Monday, March 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇరాన్‌పై అమెరికా యుద్ధం ఆపాలి

ఇరాన్‌పై అమెరికా యుద్ధం ఆపాలి

- Advertisement -

చమురు నిక్షేపాల కోసమే ఉగ్రవాద నాటకం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్‌
వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకుల శాంతి ర్యాలీ

నవతెలంగాణ -మహబూబ్‌నగర్‌
ఇరాన్‌పై అమెరికా యుద్ధం ఆపాలని, చమురు నిక్షేపాల పై కన్నేసిన అమెరికా ఉగ్రవాదం పేరుతో యుద్ధాలు చేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ”యుద్ధం వద్దు.. శాంతి ముద్దు” అనే నినాదంతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ చమురు వనరులున్న దేశాలపై వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని, ఇరాన్‌పై ఇజ్రాయిల్‌, అమెరికా కలిసి కొనసాగిస్తున్న యుద్ధం వల్ల అరబ్‌ దేశాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. దీని ప్రభావం ప్రపంచ దేశాలపైనా పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అనేక దేశాల్లో గ్యాస్‌ కొరత ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ ట్రంప్‌ విధానాలపై ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. యుద్ధాలు ఆపి సామరస్యంగా, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలు, అభ్యుదయవాదులు కోరుతున్నా ట్రంప్‌ వైఖరి మారడం లేదని చెప్పారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుల డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పినట్టు వినడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తక్షణమే మోడీ నోరు విప్పి వ్యక్తి యుద్ధాన్ని ఆపాలని ఇరుదేశాలకు చెప్పాలన్నారు. యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్‌ కొరత ఏర్పడిందని, హోటళ్లు మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అందులో పని చేసే వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. ట్రంపు అనాలోచిత విధానాల వల్ల గతంలో వెనుజులా అధ్యక్షులు మధురో దంపతులను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లి నిర్బంధించారని, అదేమాదిరిగా ఇరాన్‌పై దాడి చేసి ఆ దేశ సుప్రీం లీడర్‌ను హతమార్చారని తెలిపారు.. తక్షణమే యుద్ధాన్ని ఆపి శాంతియుతంగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు.
కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పి.జయలక్ష్మి, సీనియర్‌ నాయకులు కిల్లె గోపాల్‌, జిల్లా కార్యదర్శి ఏ.రాములు, సీపీఐ ఎంఎల్‌ మాస్‌ లైన్‌ జిల్లా కార్యదర్శి సిహెచ్‌.రామచందర్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్‌,

పాలమూరు అధ్యయన వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాఘవచారి, యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌.వెంకటేష్‌, ఆల్మేవ రాష్ట్ర నాయకులు ఫారుక్‌ హుస్సే, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు సి.వెంకటేష్‌, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడియాల మోహన్‌ మాట్లాడారు. ఎస్‌డబ్లుఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు, ఎమ్మార్‌ యూఎఫ్‌ రాష్ట్ర నాయకులు హనీఫ్‌ అహ్మద్‌, ఎల్‌ఐసీ యూనియన్‌ రాష్ట్ర నాయకులు రాజేష్‌, తెలంగాణ రైతు సంఘం, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, టీయూసీఐ, ఐద్వా, చైతన్య మహిళా సంఘం, టిపిఎస్‌కె, కేవీపీఏస్‌, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, రైతుకూలీ సంఘం, బికేయంయు నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -