దేశవ్యాప్తంగా వామపక్షాల ఆందోళన
పలు రాష్ట్రాల్లో భారీ నిరసనలు
మోడీ సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఉపాధి హామీ చట్టాన్ని చిన్నాభిన్నం చేసి తీసుకొచ్చిన వీబీ- జీ రామ్ జీ’ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. గ్రామీణ భారతదేశానికి మూలస్తంభంగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) మోడీ ప్రభుత్వం దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. సోమవారం వామపక్షాల నేతృత్వంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఒడిశా, బీహార్, కేరళ, ఢిల్లీ, రాజస్తాన్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, త్రిపుర తదితర రాష్ట్రాల్లో సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐఎంఎల్, ఫార్వర్డ్ బ్లాక్, ఆర్‌ఎస్‌పీ, ఎస్‌యూసీఐ తదితర పార్టీలు ఆందోళన నిర్వహించాయి. అన్ని రాష్ట్రాల్లోని అన్ని జిల్లా, మండల కేంద్రాలలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో వేలాది మంది పాల్గొన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని దెబ్బతీసేందుకు తీసుకువచ్చిన కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, పథకం పేరు నుంచి మహాత్మా గాంధీని మినహాయించిన చర్యను సరిచేయాలని డిమాండ్ చేశారు.కర్నాటకలో కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసం ముందు నిరసనకారులు వివాదాస్పద చట్టం కాపీని దహనం చేశారు. ఉపాధి హామీ చట్టం ప్రధాన లబ్దిదారులైన గ్రామాల మహిళలు ఈ నిరసనకు నాయకత్వం వహించారు. బీహార్‌లోని పాట్నాలో కూడా వామపక్షాలు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు నిర్వహించాయి. ఉపాధి హామీ చట్టం కింద కార్మికులకు హామీ ఇవ్వబడిన హక్కులను హరించే కుట్రలో ఈ కొత్త చట్టం భాగమని నిరసనలో పాల్గొన్న కార్మికులు అన్నారు. ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలోని వివిధ కేంద్రాలలో కూడా నిరసనలు జరిగాయి. రాజస్తాన్‌లోని జైపూర్‌లో కార్మికులు కలెక్టరేట్ ముందు చట్టం కాపీని తగలబెట్టి నిరసన తెలిపారు. ఉపాధి హామీ చట్టాన్ని కూల్చివేయడానికి మోడీ తీసుకున్న చర్యకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాన్ని కొనసాగించాలని నేతలు పిలుపు ఇచ్చారు. ఉపాధి హామీ చట్టాన్ని కూల్చివేయడానికి బిల్లును వ్యతిరేకిస్తూ పార్లమెంటు లోపల, వెలుపల వామపక్షాలు తీవ్రంగా నిరసన తెలిపాయి.
‘వీబీ-జీ రామ్ జీ’ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -



