– పశుసంపద సంక్షేమానికి కృషి చేయాలి : విద్యార్థులకు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సూచన
– ఘనంగా వెటర్నరీ విశ్వవిద్యాలయం 5వ స్నాతకోత్సవం
నవతెలంగాణ-రాజేంద్రనగర్
పట్టభద్రులైన పశు వైద్య విద్యార్థులు పశువైద్య విభాగం అభివృద్ధికి, పశుసంపద సంక్షేమానికి తోడ్పడాలని రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం 5వ స్నాతకోత్సవం నిర్వహించగా.. గవర్నర్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరుమీద ఏర్పాటు చేసిన ఈ విశ్వవిద్యాలయం ఐదవ స్నాతకోత్సవానికి అధ్యక్షత వహిం చడం గర్వకారణంగా ఉందన్నారు. ఆయన ఆదర్శాలు విశ్వ విద్యాలయాన్ని ఎల్లప్పుడూ సన్మార్గంలో నడిపిస్తుంటా యని తెలిపారు. ముందుగా ఈ అద్భుత మైలురాయిని చేరుకు న్నందుకు పట్టభద్రులైన విద్యార్థులందరినీ అభినందించారు. ఇది విద్యార్థుల విద్యా ప్రయాణం ముగింపును కాక కొత్త ఆరంభానికి నాందిని సూచిస్తుందన్నారు. పశువైద్యులు జంతువుల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా ప్రజారోగ్యం, పర్యావరణం మధ్య వారధిగా నిలుస్తారని తెలిపారు. డైరీ టెక్నాలజిస్టులు, పోషకాహారంలో ఆవిష్కరణలు, మన ఆహారం సురక్షితంగా, స్థిరంగా ఉండేలా చూసుకుంటారని చెప్పారు. మత్స్య నిపుణులు మన జల వనరుల సంరక్షకులు, సంప్రదాయాన్ని సాంకేతికతతో మిళితం చేస్తూ ఆహార భద్రతకు తోడ్పడుతున్నారని వివరించారు. అనంతరం జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డు గుజరాత్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డా.మీనేష్ షా మాట్లాడుతూ.. పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ప్రసంగించడం గర్వకారణంగా ఉందన్నారు. ముందుగా గ్రాడ్యుయేట్లు, పోస్ట్‌గ్రాడ్యుయేట్లు, డాక్టోరల్ పట్టా గ్రహీతలకు అభినందనలు తెలిపారు. విద్యార్థుల కృషి, అంకిత భావంతో పాటు కుటుంబ సభ్యులు, అధ్యాపకుల సహకారాన్ని కూడా ప్రశంసించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి డా|| ప్రొ. ఎం. జ్ఞానప్రకాష్ మాట్లాడుతూ.. యూనివర్సిటీ సాధించిన విజయాలు, పశువైద్య విద్య, పరిశోధన, విస్తరణ సేవల్లో నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉన్న నిబద్ధతను వివరించారు. ఈ స్నాతకోత్సవంలో 2023 జనవరి 1 నుంచి 2024 డిసెంబర్ 31 వరకు పట్టభద్రులైన మొత్తం 524 మందికి గవర్నర్ పట్టాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఉన్నతాధికారులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
పశువైద్య విభాగం అభివృద్ధికి తోడ్పడాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES