న్యూఢిల్లీ : దేశ 17వ ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మెన్‌గానూ ఎన్నికైన సి.పి.రాధాకృష్ణన్‌కు కాంగ్రెస్ కమ్యూనికేషన్ ప్రతినిధి జైరాం రమేశ్ బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. ఉపరాష్ట్రపతి నిష్పక్షపాతంగా వ్యవహరించడం ముఖ్యమని పేర్కొంటూ.. మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరియు రాజ్యసభ చైర్మన్ అయిన డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పిన మాటలను ఈ సందర్భంగా ఉదహరించారు. ”ప్రభుత్వ విధానాలను నిష్పాక్షికంగా, స్వేచ్ఛగా, స్పష్టంగా విమర్శించడానికి ప్రతిపక్షాలను అనుమతించకపోతే ఆ ప్రజాస్వామ్యం నిరంకుశత్వంగా దిగజారిపోయే అవకాశం ఉంది” అని పేర్కొన్నారు. 1952 మే16న రాజ్యసభ ప్రారంభం రోజున, ప్రముఖ విద్యావేత్త, తత్వవేత్త, రచయిత, దౌత్యవేత్త ఈవిధంగా అన్నారు. ”నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు. అంటే ఈ సభలోని ప్రతి పార్టీకి చెందినవాడిని. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అత్యున్నత విలువలను, సాంప్రదాయాలను నిలబెట్టడం, ప్రతి పార్టీ పట్ల న్యాయంగా, నిష్పాక్షికంగా వ్యవహరించడం, ఎవరిపట్లా ద్వేషం లేకుండా, అందరిపట్ల సద్భావనతో వ్యవహరించేందుకు యత్నిస్తాను. ప్రభుత్వ విధానాలను ప్రతిపక్ష పార్టీలు న్యాయంగా, స్వేచ్ఛగా , స్పష్టంగా విమర్శించడానికి అనుమతించకపోతే ప్రజాస్వామ్యం నిరంకుశత్వంగా దిగజారిపోయే అవకాశం ఉంది” అని ఎక్స్‌లో పేర్కొన్నారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ తాను బోధించిన దానిని అక్షరాలా సమయ స్ఫూర్తితో ఆచరించారు అని ఉద్ఘాటించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సి.పి.రాధాకృష్ణన్ 452 ఓట్లతో తదుపరి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఇండియా కూటమి అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డి 300 ఓట్లను సాధించారు.