ఎడెల్లి అంజనేయులు మాదిగ
నవతెలంగాణ – అచ్చంపేట
ఎస్సీ వర్గీకరణ ఉద్యమం విజయం ఆనాటి మాదిగ అమర వీరులకు అంకితం చేస్తున్నామని నాగర్కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయులు మాదిగ అన్నారు. ఆదివారం మాదిగ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నిర్వహించారు. ఏబిసిడి వర్గీకరణలో అమరులైన మాదిగ అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎడెల్లి ఆంజనేయులు మాదిగ హాజరై వారు మాట్లాడుతూ. మూడు దశాబ్దాల ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రస్థానంలో ఎస్సీ వర్గీకరణ సాధన కోసం జరిగిన అనేక ఉద్యమ ఘట్టాలలో వీరోచితమైన పాత్రను పోషించి, జాతి లక్ష్యాన్ని సాధించడం కోసం తృణప్రాయంగా తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించి నేలరాలిన మాదిగ అమరవీరులకు సామాజిక ఉద్యమ జోహార్లు… కన్నీటి నివాళులు..అన్నారు.
త్యాగాలు లేకుండా ఏ పోరాటం గమ్యాన్ని ముద్దాడలేదు.. పోరాటాలు లేకుండా విజయం ఏనాడు దరి చేరలేదు.జాతి మీద చీకట్లు కమ్ముకున్నప్పుడు దండోరా అనే ఒక వేగుచుక్క మాదిగ వాడల్లో అగ్గి పుట్టించిందన్నారు. అది తరతరాల జాతిని చీకటి పారదోలుతూ జాతికి వెలుగులు తీసుకొచ్చింది. ఈ వెలుగులు సాధించడం కోసం నడిచిన పోరుబాటలో అనేకమంది బిడ్డలు అసువులు బాసారని అన్నారు. నాడు వారి అమరత్వం సాక్షిగా వర్గీకరణను సాధిస్తామని ప్రమాణం చేశాం.. నేడు ఆ ప్రమాణం సాక్షిగా ఎస్సీ వర్గీకరణ సాధించి అమరుల ఆశయాలను నెరవేరచడమన్నారు .
ఎస్సీ వర్గీకరణ ఫలితాలు మాదిగ సమాజం పొందుతున్న వేళ మాదిగ అమరులను మది నిండా తలచుకొని ఘనమైన నివాళులు అర్పిద్దామన్నారు. వారి త్యాగాలను ప్రపంచానికి ఎలుగెత్తి చాటి చూపుదామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొయ్యాల వెంకటేష్ , ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ఖాసీం మాదిగ, ఎమ్మేసేఫ్ రాష్ట్ర నాయకులు మహేష్ మాదిగ, బీఎస్పీ ఇంచార్జి కృపానంద్, కౌన్సిలర్ అంతటి శివ, బీజేపీ నాయకులు శంకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ బుడగ జంగాల జిల్లా అధ్యక్షులు మోతె రాజు, నాయకులు బుద్దుల మల్లయ్య, విజయ్, వెంకయ్య, కొండలు ,మహేష్, తదితర నాయకులు పాల్గొన్నారు.



