రాహుల్‌పై తీవ్ర ఆరోపణలతో తీర్మానం
పార్లమెంటరీ కమిటీల ముందుకు రాని కీలక బిల్లులు
అర్థవంతమైన చర్చ లేకుండానే హడావుడిగా ఆమోదం
ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్న ప్రిసైడింగ్ అధికారులు
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీకి చర్చలంటే చాలా చాలా ఇష్టం. పరీక్షా పే చర్చ, చారు పే చర్చ, డిన్నర్ పే చర్చ…ఇలాంటివన్నీ ఆయన ఆలోచనల నుంచి పుట్టుకొచ్చినవే. అయితే అవన్నీ చాలా వరకూ ఏకపక్షంగానే సాగుతుంటాయి. ప్రేక్షకులతో సంభాషించే సందర్భాలు ఉండవు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు లేదా పార్లమెంటరీ పార్టీ సమావేశాలు జరిగినప్పుడు కూడా జరిగేది ఇదే. మోడీ వస్తారు…ప్రసంగిస్తారు…నిష్క్రమిస్తారు. అటల్ బిహారీ వాజ్‌పేయి వంటి గత ప్రధానుల వైఖరికి ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. సావధానంగా కూర్చొని ఇతరులు చెప్పేది వినరు. చర్చలలో భాగస్వామి కారు. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఇతరులు చెప్పింది విని నోట్స్ రాసుకునే వారు.
వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవారు. కానీ మోడీ వ్యవహార శైలి ఇందుకు భిన్నం. గత ప్రధానుల మాదిరిగా కాకుండా మోడీ చాలా అరుదుగా మాత్రమే పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతారు. పార్లమెంట్ అంటే తన విధానాలను ఆమోదించే సభగా ఆయన భావిస్తారు. దాని ప్రవేశద్వారం వద్ద తల వంచుకొని నమస్కరిస్తారు. కానీ దానికి గత పాలకుల మాదిరిగా తగిన గౌరవం ఇవ్వరు. ప్రస్తుతం జరుగుతున్న తొలి విడత బడ్జెట్ సమావేశాలు ఈ నెల 13న ముగిశాయి. ఆ సమావేశాలలో ఆయన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విరామం తర్వాత వచ్చే నెల 9న సభ తిరిగి సమావేశం అవుతుంది. అప్పుడు కూడా రాహుల్ గొంతు నొక్కడానికి అధికార పార్టీ అవలంబించాల్సిన వ్యూహాన్ని ఆయన ఇప్పటికే రచించారు.
ప్రతిపక్ష నేతే టార్గెట్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో కుదుర్చుకున్న ఏకపక్ష వాణిజ్య ఒప్పందం, దాని వినాశకర ప్రభావాన్ని రాహుల్ బహిర్గతం చేయడం మోడీని ఆగ్రహానికి గురి చేసింది. రాహుల్‌పై ప్రధాని దాడికి కారణం అదే. ఒప్పందంలోని రహస్య నిబంధనలను రాహుల్ పదే పదే బయటపెట్టారు. తన ముందు మోకరిల్లాలంటూ ట్రంప్ చేసిన ఒత్తిడికి తలవంచి, ఆయనతో మోడీ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని రాహుల్ ధ్వజమెత్తారు. ‘మోడీని ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆయన పగ్గాలు ట్రంప్ చేతిలో ఉన్నాయి.
వాటిని ట్రంప్ బిగించిన ప్రతి సందర్భంలోనూ మోడీ లొంగిపోతారు. ట్రంప్ చెప్పిన ప్రతి దానికీ తల ఊపాల్సిందిగా ఆయనను బలవంతం చేస్తారు’ అంటూ రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌పై మోడీ కోపగించుకోవడానికి ఈ మాటలే కారణమయ్యాయి. రాహుల్‌ను బీజేపీ నాయకులు ఎప్పుడూ ‘పప్పు’ అని, ‘పార్ట్‌టైమ్ రాజకీయ నాయకుడు’ అని ఎద్దేవా చేస్తుంటారు. అలాంటి వ్యక్తి తమకు అత్యంత భయంకరమైన ప్రత్యర్థిగా ఎదుగుతుండడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే సభ లోపల, బయట ఆయన గొంతు నొక్కడానికి, అయన్ని అవమానించడానికి తమ వద్ద ఉన్న అన్ని మార్గాలనూ సమీకరించారు.
తీవ్ర ఆరోపణలతో తీర్మానం
రాహుల్‌పై విరుచుకుపడడంతోనే మోడీ సంతృప్తి చెందడం లేదు. పార్లమెంట్ ఉభయ సభలలో ప్రతిపక్షాలు చెబుతున్న అనేక మాటలను రికార్డుల నుంచి తొలగించాలంటూ సభాపతులపై ఒత్తిడి తెస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మలిఖార్జున ఖర్గే కూడా బాధితుల జాబితాలో ఉండడం గమనార్హం. రాహుల్‌పై బీజేపీ సభ్యుడు నిషికాంత్ దూబే ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పరిశీలిస్తే అది ఆ పార్టీ అగ్ర నేతల సూచనల మేరకే జరిగిందని అర్థమవుతోంది. ఆ తీర్మానంలో రాహుల్‌పై అనేక తీవ్రమైన ఆరోపణలు చేశారు. రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, ఆయన చట్టసభకు పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని ఆ తీర్మానంలో కోరారు. అమెరికాకు చెందిన బిలియనీర్ జార్జ్ సోరస్, ఫోర్డ్ ఫౌండేషన్, యుఎస్ ఎయిడ్ వంటి భారత్ వ్యతిరేక శక్తులతో కలిసి రాహుల్ కుట్ర పన్నారని దూబే ఆ తీర్మానంలో ఆరోపించారు.
అంతేకాదు…థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం, అమెరికా దేశాలకు రాహుల్ వెళ్లి దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నారని తెలిపారు. విదేశీ మద్దతుతో రాహుల్ చాలా తెలివిగా పార్లమెంట్ యొక్క అత్యంత పవిత్రమైన వేదికను స్వాధీనం చేసుకున్నారని, భారత న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్‌పై నిరాధారమైన ఆరోపణలు చేశారని వివరించారు. సైనిక దళాల మాజీ ప్రధానాధికారి జనరల్ ఎంఎం నరవనే రాసిన పుస్తకాన్ని ఇంకా ప్రచురించక పోయినప్పటికీ దానిని రాహుల్ సభలో ప్రదర్శించారని తప్పుపట్టారు. ఆయనపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయినప్పటికీ రాహుల్ చలించకుండా రైతు సంక్షేమం కోసం పోరాటం కొనసాగిస్తానని ప్రకటించారు.
పరిశీలనకు నోచుకోని బిల్లులు
ప్రతిపక్షం బలహీనంగా ఉండి, పార్లమెంటులో తనను తాను నిరూపించుకోలేని పరిస్థితి తలెత్తినప్పుడు పాలకపక్షం కీలక బిల్లులకు హడావిడిగా ఆమోదముద్ర వేయించుకుంటోంది. వాటిని కనీసం పార్లమెంటరీ కమిటీల పరిశీలనకు కూడా పంపలేదు. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వ్యవసాయ బిల్లులను విధిలేని పరిస్థితులలో ప్రభుత్వం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. 15వ లోక్‌సభలో 71 బిల్లులు పార్లమెంటరీ కమిటీల పరిశీలనకు వెళ్లగా 16వ లోక్‌సభలో ఆ సంఖ్య 27కి తగ్గిపోయింది. ప్రస్తుత లోక్‌సభలో ఇప్పటి వరకూ కేవలం 13 బిల్లులు మాత్రమే కమిటీల పరిశీలనకు నోచుకున్నాయి. సమర్ధవంతమైన చర్చ పట్ల ప్రభుత్వానికి ఉన్న విముఖత దీని ద్వారా తేటతెల్లమవుతోంది. 2004-2014 మధ్య 60 ఆర్డినెన్సులను ఆమోదించగా మోడీ-షా ద్వయం పాలనలోని మొదటి ఎనిమిది సంవత్సరాల కాలంలో 80కి పైగా…అంటే సంవత్సరానికి సగటున 10కి పైగా ఆర్డినెన్సులను ఆమోదించారు.
రాజ్యసభను తప్పించుకునేందుకే
లోక్‌సభ స్పీకర్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం…ఖాళీగా ఉన్న ఉప సభాపతి పదవిపై చర్చను మరోసారి లేవనెత్తింది. ప్రతిపక్షానికి చెందిన వ్యక్తి డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండడం ప్రభుత్వానికి సుతరామూ ఇష్టం లేదు. వాస్తవానికి 2019 నుండి లోక్‌సభను డిప్యూటీ స్పీకర్ లేకుండానే నడిపిస్తున్నారు. గత సంవత్సరం స్పీకర్ ఆస్పత్రిలో చేరినప్పుడైనా డిప్యూటీ స్పీకర్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందే మోనని అందరూ ఆశించారు. కానీ అది జరగలేదు. ఇక మోడీ ప్రభుత్వం వివాదాస్పద బిల్లులను ద్రవ్య బిల్లులుగా గుర్తించడంతో అవి రాజ్యసభ ఆమోదం పొందనవసరం లేకుండా పోయింది. ఎందు కంటే ఎగువ సభలో అధికార పక్షానికి మెజారిటీ లేదు. ముసాయిదా బిల్లులను పార్లమెంటరీ ప్యానల్స్ పరిశీలనకు పంపాల్సి ఉండగా ఆ పని కూడా చేయడం లేదు. ద్రవ్య బిల్లుగా గుర్తించిన ఆధార్ చట్టం విషయంలో సుప్రీంకోర్టు కొన్ని నిబంధనలను తోసిపుచ్చింది.
‘రికార్డుల’కు కొదవే లేదు
మోడీ హయాంలో సాధించిన ‘రికార్డుల’ను గురించి చెప్పుకోవాలంటే చాంతాడంత జాబితా ఉంది. మన్మోహన్ సింగ్ హయాంలో లోక్‌సభలో మొత్తం 96 స్వల్పకాలిక చర్చలు జరిగాయి. కానీ మోడీ పాలనలో (16వ, 17వ లోక్‌సభలలో) ఆ సంఖ్య 44కు పడిపోయింది. అదే సమయంలో సావధాన తీర్మానాల సంఖ్య కూడా 152 నుంచి 17కు తగ్గింది. 17వ లోక్‌సభలో ఒక్క సావధాన తీర్మానం కూడా రాలేదు. అరగంట చర్చల సంఖ్య కూడా 21 నుంచి ఆరుకు తగ్గిపోయింది. 2004-14 మధ్య యూపీఏ ప్రభుత్వం 99.38 శాతం హామీలు అమలు చేయగా మోడీ హయాంలో ఆ రేటు 79 శాతానికి పరి మితమైంది.
ప్రధాని కార్యాలయం, ఇతర మంత్రిత్వ శాఖలు తరచూ సభా వ్యవహారాలలో జోక్యం చేసుకుంటున్న ఉదంతాలు కూడా ఉంటున్నాయి. ఏ రకమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలనే దానిపై ప్రిసైడింగ్ అధికారులకు సూచనలు అందుతున్నాయి. భారత చరిత్రలో అత్యధిక సంఖ్యలో ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసిన రికార్డు కూడా మోడీ ప్రభుత్వం పేరిట ఉంది. 1952 నుంచి చూస్తే అతి తక్కువ కాలం సమావేశమైంది 17వ లోక్‌సభే. ఆ సమా వేశాలలో ఒక్క బిల్లును కూడా సెలక్ట్ కమిటీకి పంపలేదు. 17వ లోక్‌సభకు మరో ‘విశిష్టత’ కూడా ఉంది. ఈ సమావేశాలలో ఆమోదించిన బిల్లులలో సగం బిల్లులపై కనీసం రెండు గంటల చర్చ కూడా జరగలేదని సీనియర్ పాత్రికేయుడు పి.రామన్ గుర్తు చేశారు.



