Sunday, October 19, 2025
E-PAPER
Homeసోపతిఉద్యమ స్వరం… దేశభక్తి… చైతన్య గీతాల భాస్వరం

ఉద్యమ స్వరం… దేశభక్తి… చైతన్య గీతాల భాస్వరం

- Advertisement -

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోనే కాదు తెలంగాణమంతా తెలిసిన ఉద్యమ కార్యకర్త, ఉపాధ్యాయుడు, కవి, రచయిత, విమర్శకుడు, బాల సాహిత్య సృజనకారుడు, బాల వికాసకారుడు ‘సిరిసిల్ల’ గఫూర్‌ శిక్షక్‌. ఆయన గురించి మాట్లాడుకునే ముందు ఇక్కడ మనం ఒక ముచ్చట చెప్పుకోవాలి…

సిరిసిల్ల ఊరుకు బొడ్రాయి పొందించిన కొన్ని కుటుంబాల్లో మాదొకటి. కానీ ఆ పేరును నా పేరుగా ఎన్నడూ పెట్టుకోలేదు… తమకు జన్మనిచ్చిన ‘సిరిసిల్ల’ నేల పేరును తన జండాగా… కిరీటంగా పెట్టుకున్న తండ్రీకొడుకుల గురించి మొదటగా చెప్పుకోవాలి. తెలుగు పాఠకులకు, ప్రత్యేకంగా ఎనభయ్యవ దశకంలో కార్టూన్లు, జోక్‌ల రచయితగా తెలిసిన పేర్లలో ‘సిరిసిల్ల రషీద్‌ శిక్షక్‌’ ఒకరు. తాను పుట్టిన సిరిసిల్ల నేలను తన మొదటి పేరుగా, హిందీ పండిత శిక్షణ పూర్తిచేశారు కనుక ‘శిక్షక్‌’ను పేరు చివరగా స్థిరపరచుకున్నారు. ఆయన కుమారుడే మనం మాట్లాడుకుంటున్న బాల సాహిత్యకారుడు గఫూర్‌… అలియాస్‌ సిరిసిల్ల గఫూర్‌ శిక్షక్‌… ఉర్దూ గఫూర్‌ మాతృభాష.. హిందీ బడిలో బోధనా భాష… సాహిత్యభాష తెలుగు. సిరిసిల్ల గఫూర్‌ శిక్షక్‌ జూన్‌ 1, 1978 న సిరిసిల్లలో పుట్టారు. తల్లిదండ్రులు శ్రీమతి రజియా సుల్తానా- జనాబ్‌ సిరిసిల్ల రషీద్‌ శిక్షక్‌. ఈయన ఎం.ఎ., హిందీ, హిందీ పండిత శిక్షణ పూర్తి చేసి, హిందీ పండితులుగా పనిచేస్తున్నాడు. మూడు దశాబ్దాలుగా కామారెడ్డిలో నివాసముంటున్నారు.
కవిగా సృజనతో పాటు వివిధ ఉద్యమాలతో మమేకమైన గఫూర్‌ తెలంగాణ ఉద్యమ సమయంలో ముందు వరుసలో నిలిచిన ఉద్యమకారుడు, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు. ఉపాధ్యాయ పండిత పరిషత్తు బాధ్యుడు. తొలి నుండి స్వరాన్ని… తన పథాన్నే కాక కవితాక్షరాల్ని కూడా ఉద్యమంలో భాగంగా తెచ్చిన గఫూర్‌ ‘తబ్దీల్‌’ పేరుతో తొలి కవితా సంపుటి తెచ్చాడు. రెండవ కవితా సంపుటి ‘చైతన్య వసంతం’, మూడవది ‘గుండె లవిసిన చోట’. ఈ మూడు సంపుటాలు తెలంగాణ ఉద్యమానికి కవిత్వం కావడం విశేషం. వీరి మరో రెండు కవితా సంపుటులు ‘ధైర్య కవచం’, ‘యుద్ధ గీతం’ దీర్ఘకవిత. ‘స్నేహం ఓ ప్రశ్నగా’, ‘జలం జీవం జీవనం’, ‘పోరు వీరుల యాదిలో’ గఫూర్‌ పాటల పుస్తకాలు. ఈయన వివిధ సమయ సందర్భాల్లో తన బాధ్యతగా పాటల సి.డి.లను వెలువరించాడు. వాటిలో తెలంగాణ ఉద్యమ పోరు హోరుగా తెచ్చినది ‘అలజడి’, సామాజిక గీతాలు ‘పాటకు సలాం’, ‘గెలుపు గీతం’ ఉన్నాయి. ‘వలస కార్మికుల గోస’ కు తన సహానుభూతిగా గీతాల సి.డి.ని తెచ్చారు గఫూర్‌. తెలంగాణ రచయితల వేదిక పక్షాన నెల నెలా సాహిత్య కార్యక్రమంలో భాగంగా ‘ఎన్నీల ముచ్చట్లు’ నిర్వహించి, తన సంపాదకత్వంలో సంకలనాలుగా ప్రచురించారు. ‘ఎన్నీల ముచ్చట్లు’ తొమ్మిది సంపుటాలతో పాటు ‘సృజన సంగమం’ వాటిలో ఉన్నాయి. ఆర్‌.టి.సి. కార్మికుల సమ్మెకు మద్దత్తుగా ‘సైరన్‌’ కవితా సంపుటి, ‘కరోనాపై కవితాస్త్రం’ ఇతర సంకలనాలు. ఉపాధ్యాయునిగా జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న గఫూర్‌ శిక్షక్‌ కవిగా, రచయితగా సత్కారాలు, పురస్కారాలు అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం అందించే జిల్లా ఉత్తమ రచయిత పురస్కారం అందుకున్నారు.
ఉపాధ్యాయునిగా తొలి నుండి బాలలతో మమేకమైన గఫూర్‌ బాలలతో రాయించడం, బాల కవి సమ్మేళనాలు నిర్వహించడం, బాలల రచనలు ప్రచురించడంతో పాటు స్వయంగా వారి కోసం గేయాలు రాసి, పాటల సి.డిలు తెచ్చాడు. ‘గఫూర్‌ శిక్షక్‌ సాంగ్స్‌’ పేరుతో యూట్యూబ్‌ ఉన్న వీరి పాటలు వినవచ్చు. ఈయన మార్గదర్శకత్వంలో బడి పిల్లల రచనలు హిందీ, తెలుగు పత్రికల్లో వచ్చాయి. ‘గురుదేవో భవ’, ‘భారతి వందనం’ గఫూర్‌ బాలల కోసం తెచ్చిన పుస్తకాలు. ‘స్నేహం ఓ ప్రశ్నగా’ బాలల కోసం రాసిన వీడ్కోలు గీతం. దీనిని కూడా పుస్తకంగా తెచ్చాడు. ఇవేకాక విద్యార్థుల కోసం రాసిన పాటల సి.డి.లు ‘గెలుపు గీతం’, ‘స్వాగత గీతం’, ‘చదువుదాం పుస్తకం’. ఇవేకాక విద్యార్థుల కోసం ‘లిటిల్స్‌’, ‘గురుదేవో భవ’ సంకలనాలు తెచ్చారు ఈయన. ‘మా బడి మా బడి సుస్వరాల లాహిరీ/ మా బడి మా బడి మంచితనపు మా గుడి/ మా బడి మమతల గుడీ/ అభిమానం ఆప్యాయత చోటు ఇక్కడ/ జ్ఞానాలు విలసిల్లే ప్రేమ ఇక్కడా/ స్నేహాలు పరిమళించే స్థానమిక్కడ’ అని గానం చేసిన గఫూర్‌ ‘స్వాగత స్వాగతమండీ/ వీడ్కోలు అందుకోండి/ విరజాజి పూవులారా/ విరితేనె స్నేహితులారా’ అని గానం చేస్తాడు.
బాలల మనసు తెలిసి రచనలు చేసే గఫూర్‌ శిక్షక్‌ మరోచోట ‘చిట్టి పాదాలతో… ఈ చిన్నారులూ/ చిన్ని నడకతో, ఈ చిన్ని బుడతలూ/ భావి తరానికి వారసులై/ భవితవ్యానికి వారధులై/ బడికి వస్తున్నారు/ పలకా బలపం పట్టుకొని/ ముందడుగే వేస్తున్నారు/ చీకటి చీల్చే కిరణాలై’ అంటూ పలకాబలపం పట్టుకున్న బాలల గురించి రాసిన గఫూర్‌, ‘ఆ రవి కిరణం ఏమంటున్నది/ ఆ శశి వెలుగు ఏమి చాటుతున్నది/ నింగిని తాకే ఆ శిఖరమేమన్నదీ/ ప్రకృతి నేర్పే పాఠమే మున్నదీ’ అంటాడు. మువ్వన్నెల జండా గురించి రాస్తూ- ‘మువ్వన్నెల జండాకు వందనం చేయనా/ ఉత్తమ పౌరునిగా దేశభక్తే చూపనా’ అని గానం చేస్తూ… ‘భరతమాత కీర్తిని పెంచి/ కన్న రుణము కాస్తతీర్చి/ మాతృభూమి మరవక నేను/ మాతృభాష వదలకు నేను’ అంటాడు. తెలంగాణ బాల సాహిత్యోద్యమంలో మరింతగా గఫూర్‌ పాలుపంచుకోవాల్సిన బాధ్యతను యాది జేస్తూ… ‘జన్మభూమి’ పేరుకు వన్నెతెచ్చిన సృజనశీలికి జయహో! జయహో బాల సాహిత్యం.

డా|| పత్తిపాక మోహన్‌
9966229548

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -