Tuesday, February 10, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిప్రజలగొంతు..కమ్యూనిస్టులతోనే…

ప్రజలగొంతు..కమ్యూనిస్టులతోనే…

- Advertisement -

ఎన్నికలు రాగానే రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతోంది. ఊరూరా ప్రచారాల హడావుడి, హామీల వెల్లువ, నినాదాల మోత వినిపిస్తోంది. అయితే ఓటు వేసిన తర్వాత సామాన్యుడి జీవితంలో నిజంగా ఎంత మార్పు వస్తోందన్న ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న కార్పొరేషన్‌, మున్సిపాలిటీ ఎన్నికలు సాధారణ రాజకీయ పోటీలు కావు. ప్రజా సమస్యలు పాలనలోకి వస్తాయా, లేక అవి పక్కకు నెట్టబడతాయా అన్నది నిర్ణయించే కీలక దశ ఇవి. బల మున్న చోట కమ్యూనిస్టులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వారు కొన్ని స్థానాలకే పరిమితమైనా, అక్కడ వారి గెలుపు ప్రజల పక్షాన నిలిచే బలమైన రాజకీయ సందేశంగా మారుతుంది. కమ్యూనిస్టులు బలహీనపడితే నష్టపోయేది సామాన్య ప్రజలే. చట్టసభల్లో ప్రశ్నించే గొంతు తగ్గిపోతుంది. పాలకుల నిర్ణయాలపై ప్రజల నియంత్రణ సడలిపోతుంది. ఫలితంగా ప్రజావ్యతిరేక విధానాలు అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతాయి. కార్మిక వ్యతిరేక నిర్ణయాలు అమలవుతాయి. రైతు సమస్యలు అంచున పడతాయి. అవినీతి వేళ్లూనుకుంటుంది. ప్రజాపాలన అన్న భావన క్రమంగా మసకబారుతుంది.

ఇది కేవలం హెచ్చరిక కాదు, నేటి అనుభవమే. ఇప్పటికే కార్మికహక్కులు కుదించబడుతున్నాయి. ఉపాధి భద్రత దెబ్బతింటోంది. ధరల పెరుగుదల సామాన్య కుటుంబాలపై భారంగా మారుతోంది. ప్రభుత్వ విధానాలు ప్రజల అవసరాల కన్నా కొద్దిమంది ప్రయోజనాలకు అనుకూలంగా మారుతున్నా యన్నది వాస్తవం. ఈ పరిస్థితుల్లో అధికారం ఉన్నా, లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పోరాడుతున్న వారు కమ్యూనిస్టులే. నీతి, నిజాయితీకి నిలువెత్తు రూపకర్తలు. ప్రజాసమస్యలను పరాయి సమస్యలుగా చూడరు. తమ సమస్యలుగానే భావిస్తారు. నిత్యం ప్రజలకు అందు బాటులో ఉంటారు. ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుని, పరిష్కారానికి పోరాడతారు. వారికి కులం, వర్గం, ప్రాంతమనే అడ్డుగోడలుండవు. ప్రజలందరినీ సమానంగా చూస్తారు. వీధుల్లోనూ, కార్యాలయాల్లోనూ, అవసరమైతే జైలుకెళ్లడానికి కూడా వెనుకాడరు. అదే కమ్యూనిస్టు రాజకీయ నిబద్ధత. ఇది చాలామంది ఆచరణలోనూ చూపించారు.

సభ్యుల సంఖ్య ఎంత అన్నదానితో సంబంధం లేకుండా, వారి చర్చలు పాలకవర్గాల ప్రజాప్రతినిధుల పరిమితులను మించేవిగా ఉండేవి. అధికార పక్ష సభ్యులు తమ నియోజకవర్గాల పరిధిలోనే మాట్లాడిన సందర్భాల్లో, కమ్యూనిస్టు ప్రజాప్రతినిధులు రాష్ట్రం మొత్తాన్ని తమ సమస్యగా భావించి మాట్లాడతారు. అందుకే కార్మికులు, రైతులు, మహిళలు, దళితులు, యువత, అన్ని వర్గాల సమస్యలు చట్టసభల్లో ప్రతి ధ్వనిం చాయి. కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుంద రయ్య, రావి నారాయణరెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, నర్రా రాఘవరెడ్డి, గుమ్మడి నరసయ్య, ధర్మభిక్షం వంటి నాయకులు ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లో పాలకులను నిలదీశారు. చట్టాలు ప్రజల పక్షాన ఉండేలా కీలక పాత్ర పోషించారు. ఒక ప్రాంతంలో ఒక్క కమ్యూనిస్టు ప్రజాప్రతినిధి ఉన్నా, అక్కడ ప్రజల సమస్యలు అణగారవు.

అందుకే ఎన్నికల్లో కొన్ని సీట్లలో గెలుపు సాధించినా, చట్టసభల్లో ప్రజల గొంతు మరింత బలంగా వినిపిస్తుంది. ప్రజల అవసరాలకు అనుగు ణంగా విధానాలు, చట్టాలు రూపొందే దిశగా ఒత్తిడి పెరుగుతుంది. పాలనపై ప్రజల పట్టు బలపడుతుంది. ప్రస్తుతం కార్పొరేషన్‌, మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కమ్యూనిస్టులకు ప్రజలు అండగా నిలిస్తే, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ తదితర ఎన్నికల్లో కూడా వారి ప్రాతినిధ్యం విస్తరించే అవకాశం ఉంటుంది. ప్రజల మద్దతే కమ్యూనిస్టుల బలం. ప్రజల అండతోనే ప్రజా సమస్యల స్వరం చట్టసభల్లో మరింత గట్టిగా వినిపిస్తుంది. అందుకే కమ్యూనిస్టు పోటీ చేస్తున్న ప్రతి స్థానంలో వారికి పట్టం కట్టాల్సిన బాధ్యత ప్రజలదే. కమ్యూనిస్టులను గెలిపించడం ఒక పార్టీని గెలిపించడం కాదు, చట్టసభల్లో ప్రజల గొంతును నిల బెట్టడం. ప్రజాస్వామ్యాన్ని రక్షించడం. సామాన్యుడి హక్కులను కాపాడటం. చట్టసభల్లో ప్రజలగొంతు కమ్యూనిస్టులతోనే సాధ్యం.

జి.రవీంద్రాచారి
9848772232

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -