అడవి అంటేనే అందమైన ఆవరణమే !
అడవిలో సహజంగా సాగే సంప్రదాయం
నాగరీకుల్ని సిగ్గుపడేలా చేస్తాయి
నీతి తప్పిన లోకులంతా అనుసరించాల్సిన
నియమబద్ద ప్రపంచం అరణ్యం!
అడవిలో ఆకలేస్తేనే క్రూర పులిరాజు
జంతువులపై దాడి చేసి
కడుపు నింపుకునేందుకు ఏదో ఒక అమాయక జీవిని చంపితింటుంది
ఆకలి తీరగానే దాడి ఆపేసి మిగతా జంతువుల జోలికి పోకుండా
దట్టమైన చెట్టు నీడకెళ్ళి సేదదీరుతుంది
అడవి జంతువులకు కూడా
తమదైన పద్ధతులుంటాయట !
ఈదురు గాలుల దాటికి
అడవిలో చెట్టు కొమ్మలు ఊగిపోతున్నపుడు
కోయిల తన కూనల్ని వదిలి ఎగిరెళ్ళి
నేస్తపు అమ్మకాకిలేని గూడులోని గుడ్లను
రెక్కలు చాచి హత్తుకుని పొదుగుతుందట !
జాతులకతీతమైన అనుబంధం !
చెట్టు మీది పక్షి గూడులోంచి పొరపాటున
పిల్లపక్షి జారి పడిపోతే అమ్మపక్షికి తోడుగా
అడివంతా ఒక్కటై అల్లకల్లోలమై హాహాకారాలు చేస్తాయట
ఎంత గొప్ప సమూహ జీవన సౌందర్యం !
అనుకోకుండా చెట్టు పైనుండి
ఎపుడైనా ఉడతల గూడు ఊడి నదీప్రవాహంలోకి పడిపోతే
ఆకులు రెమ్మలతో అందంగాఅల్లిన
కనిపించే గూడును
గూటిలోని ఉడుతపిల్లల్ని చూసి ముందుగా
నీటిలోని మెరిసే వెండిరంగు చేపలు
చుట్టూచేరి కేరింతలతో
తమతో కలుపుకుని నేస్తాలౌతాయట
అరమరికలు లేని స్నేహ పరిమళం !
ఊహించని తుపాను రాకతో
అడవికి ప్రాణమైన నది ఉధతమై
పైనున్న చెక్క వంతెన విరిగినపుడు
ఉడుత పాము చిట్టిమేక చిరుతలు జతకట్టినట్టు ఒకటిగా
నీటిమీద తేలియాడే కర్రదుంగ
ఆసరాగా ప్రాణాలను నిలుపుకుంటాయట !
అందుకే అడివంటే ఒక అద్భుతం !
ఇపుడు అడవి ఆ అడవిలా లేదు
అడవిలో అప్పటి అందమైన
జీవావరణమూ కానరాదు
పచ్చదనం పరుచుకున్న అడివంతా
నెత్తురు కారుతోంది !
అడవిని అడవి బిడ్డల్ని
అడవి గర్భాన దాగిన సంపదను
కాపుకాసే చేతుల్ని కాటేస్తున్న
దుర్మార్గపు కామందులు
అడవిపై అన్యాయంగా యుద్ధం ప్రకటిస్తూ
నీతి తప్పిన ఆటవిక రాజ్యాన్ని
కర్కశంగా అమలు చేస్తున్నారు
బావురుమంటూ అడవి కన్నీరెడుతోంది !
ఇపుడు అడవి అందమైన అడవి కాదు
నేడది కల్లోల క్షతగాత్ర కాననమే !
– డా. కె. దివాకరాచారి, 9391018972
కల్లోల క్షతగాత్ర కాననం
- Advertisement -
- Advertisement -