బీహార్‌లో 24 లోక్‌సభ స్థానాల్లో ఇదే పరిస్థితి
పాట్నా : కేంద్ర ఎన్నికల సంఘం ప్రచురించిన బీహార్ ముసాయిదా ఓటర్ల జాబితాలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో 40 లోక్‌సభ స్థానాలు ఉండగా వాటిలో 24 స్థానాలలో తొలగించిన ఓటర్ల సంఖ్య గత లోక్‌సభ ఎన్నికల్లో విజేతలు సాధించిన మెజారిటీ కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం. అంటే దీనర్థం ఏమిటి? జాబితాల నుంచి తొలగించబడిన ఓటర్లు బీహార్‌లోని సగానికి పైగా లోక్‌సభ స్థానాల ఫలితాలను నిర్ణయించడంలో కీలకంగా మారి ఉండవచ్చునని అర్థమవుతోంది. వివిధ సందర్భాలలో ఎన్నికల కమిషన్ విడుదల చేసిన డేటాను ‘ది క్వింట్’ పోర్టల్ విశ్లేషించగా ఈ విషయం బయటపడింది.
ఉదాహరణకు బీజేపీ నాయకుడు గిరిరాజ్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న బెగూసరారు లోక్‌సభ స్థానంలో 2024 ఎన్నికల సమయంలో 22,00,435 మంది ఓటర్లు ఉన్నారు. ‘సర్’ కసరత్తు తర్వాత వారి సంఖ్య 20,77,257కు తగ్గింది. అంటే 1,23,178 మంది ఓటర్లు తగ్గిపోయారు. లోక్‌సభ ఎన్నికలలో గిరిరాజ్ సింగ్‌కు వచ్చిన మెజారిటీ 81,480 ఓట్లు మాత్రమే. ఈ విధంగా తొలగించిన ఓటర్ల సంఖ్యతో పోలిస్తే లోక్‌సభ ఎన్నికలలో విజేతలకు వచ్చిన మెజారిటీ తక్కువగా ఉన్న స్థానాలలో వాల్మీకి నగర్, పూర్వి చంపారన్, షియోహర్, సీతామర్హి, అరారియా, కిషన్‌గంజ్, కతిహార్, పూర్నియా, వైశాలి, గోపాల్‌గంజ్, సివాన్, మహరాజ్‌గంజ్, సరన్, ఉజెయిర్‌పూర్, బెగూసరారు, భాగల్పూర్, బంకా, ముంగర్, పాటలీపుత్ర, అర్రా, బక్సర్, కారాకట్, ఔరంగాబాద్, నవాడా ఉన్నాయి.
ఈ 24 స్థానాలలో 16 స్థానాలను జేడీయూ, బీజేపీ, హెచ్‌ఏఎం, ఎల్జేపీ గెలుచుకున్నాయి. ఐదు స్థానాలలో కాంగ్రెస్-ఆర్జేడీ విజయం సాధించగా రెండు చోట్ల సీపీఐ (ఎంఎల్), ఒక చోట స్వతంత్రుడు గెలుపొందారు. షియోహర్ స్థానంలో గత లోక్‌సభ ఎన్నికల తర్వాత 1,09,723 ఓట్లను తొలగించారు. అక్కడ జేడీయూ అభ్యర్థి కేవలం 29,143 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు, 2020 శాసనసభ ఎన్నికలకు మధ్య ఈ నియోజకవర్గంలో 69,867 మంది ఓటర్లు కొత్తగా నమోదవడం గమనార్హం. పూర్వి చంపారన్, అరారియా, సీతామర్హి వంటి కొన్ని స్థానాలలో కూడా ఆ సమయంలో ఓటర్లు పెరిగారు.
తొలగించిన ఓటర్లకు సంబంధించి ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వ్యవస్థాపకుడు జగదీప్ ఛోకర్ అభిప్రాయపడ్డారు. అయితే ఎన్నికల ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరమేమీ లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ స్పష్టం చేశారు.
విజేతల మెజారిటీ కంటే తొలగించిన ఓటర్లే అధికం
- Advertisement -
- Advertisement -