Tuesday, March 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇరాన్‌పై యుద్ధాన్ని ఉపసంహరించుకోవాలి

ఇరాన్‌పై యుద్ధాన్ని ఉపసంహరించుకోవాలి

- Advertisement -

– అన్ని దేశాలూ యుద్ధాన్ని ఆపాలంటున్నా ప్రధాని మోడీ నోరు మెదపడం లేదు
– శాసనసభలో ప్రజా సమస్యలకు ప్రాధాన్యత లేదు
– నిరుద్యోగుల అణచివేత సరికాదు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ – ఇబ్రహీంపట్నం

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ చేస్తున్న యుద్ధాన్ని ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. ప్రపంచ దేశాలు ముక్తకంఠంగా యుద్ధాన్ని ఖండిస్తున్నా భారత ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం నోరు మెదపకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. యుద్ధం వల్ల ఇప్పటికే భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం చోటుచేసుకుందన్నారు. మరింత నష్టం జరగకముందే యుద్ధాన్ని నిలిపివేయాలని కోరారు. సోమవారం రంగారెడ్డి జిల్లా సీపీఐ(ఎం) శాఖ కార్యదర్శుల సమావేశం ఇబ్రహీంపట్నంలోని పాషా, నరహరి స్మారక కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యుద్ధంతో వంట గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఏర్పడిందని, నిత్యవసర సరుకుల ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ధరల నియంత్రణ అదుపు చేయలేకపోతున్నారన్నారు. ప్రభుత్వ విధానాలతో ప్రజలపై భారాలు పడుతున్నాయని అన్నారు. యుద్ధం ఇదే విధంగా కొనసాగితే సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. మరోవైపు ఉపాధి హామీ నిర్వీర్యానికే కేంద్రం కుట్ర పన్నుతుందన్నారు. విత్తన, విద్యుత్తు సవరణ బిల్లులు తీసుకువచ్చిందని తెలిపారు. ఉపాధి రంగానికి నిధులు కేటాయింపు పెంచాలని డిమాండ్‌ చేశారు.

అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చల్లేవు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రజలకు అనుగుణంగా లేదని జాన్‌వెస్లీ అభిప్రాయపడ్డారు. ఈ శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చ సాగడం లేదన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాదులాటలే కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రధాన రంగాలకు నిధుల కేటాయింపుపై చర్చ సాగడం లేదని విమర్శించారు. విద్యారంగానికి కేవలం 15 శాతం నిధులు మాత్రమే కేటాయించారని, ఇక వైద్య రంగానికి నిధుల కేటాయింపుపై చర్చ చేయడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌పై స్పష్టత కొరవడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలకు నిధుల కేటాయింపు విషయంలోనూ అస్పష్టత ఉందన్నారు. మరోవైపు ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలపై నిర్బంధం కొనసాగుతుందన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తుంటే.. ముందస్తు అరెస్టుల పేరుతో ఉద్యమాలను అణిచే ప్రయత్నం జరుగుతోందన్నారు. నిరుద్యోగుల అణిచివేత సరికాదన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిందని, ఈ వ్యతిరేకత ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందక ముందే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొవాలని సూచించారు. హామీల అమలు జరగకపోతే కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కాడిగళ్ల భాస్కర్‌, బి.సామెల్‌, డి.రామచందర్‌, డి.జగదీష్‌. కె.జగన్‌, ఇ.నర్సింహా, చంద్రమోహన్‌, జిల్లా కమిటీ సభ్యులు ఆయా మండలాల కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -