చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి
అమెరికా, ఇజ్రాయిల్ అంతర్జాతీయ న్యాయ సూత్రాలను తుంగలో తొక్కాయి
భారత ప్రభుత్వం నోరు మెదపకపోవడం అన్యాయం : సెమినార్‌లో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు
సూర్యాపేటలో మల్లు స్వరాజ్యం 4వ వర్థంతి
నవతెలంగాణ-సూర్యాపేట
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం ఆపాలని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించు కోవాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు కోరారు. ఆ రెండు దేశాలు అంతర్జాతీయ న్యాయ సూత్రాలను తుంగలో తొక్కాయని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం 4వ వర్థంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విజయ్ కన్వెన్షన్ హాల్‌లో బుధవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ‘ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయిల్ దాడులు – పర్యవసానాలు’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. ఇరాన్‌పై యుద్ధం కారణంగా భారత్‌లో తీవ్రంగా గ్యాస్ కొరత ఏర్పడిందన్నారు. ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయి రాబోయే రోజుల్లో చమురు, డీజిల్, పెట్రోల్ దొరక్కుండా పోయే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌పై రూ.60 పెంచిందని తెలిపారు. మోడీ ప్రభుత్వం దేశ ప్రయోజనాల కన్నా ఇరాన్‌పై యుద్ధానికే ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ దాడి చేసి వందలాది మంది పౌరులను హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
అమెరికా సామ్రాజ్యవాద ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని, గత నెలలోనే వెనిజులా అధ్యక్షులు మదురో దంపతులను కిడ్నాప్ చేసి న్యూయార్క్‌లో నిర్బంధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీని బాంబు దాడులతో హతమార్చిందని అన్నారు. గతంలో ఇరాక్ అధ్యక్షులు సద్దాం హుస్సేన్, లెబనాన్ అధ్యక్షులు గడాఫీని ఇదేవిధంగా హత్య చేసిన ఘటనలను గుర్తు చేశారు. ఖనిజాలు, సహజ వనరులపై, ఆయిల్ నిల్వలపై కన్నేసిన అమెరికా.. ఇరాన్‌ను ఎలాగైనా తన దారిలోకి తెచ్చుకొని అక్కడున్న ఆయిల్ నిల్వలను కొల్లగొట్టాలనే దురుద్దేశంతోనే ఇజ్రాయిల్‌తో కలిసి దాడులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంతో కాలంగా భారతదేశానికి మిత్ర దేశంగా కొనసాగుతున్న ఇరాన్‌పై దాడులు జరుగుతున్నా భారత ప్రభుత్వం నోరు మెదపకపోవడం అన్యాయమన్నారు. అమెరికాకు భయపడి ప్రధాని మోడీ నోరు మూసుకున్నారా? అని ప్రశ్నించారు. యుద్ధం వల్ల పశ్చిమాసియాలో కోటి మంది భారతీయులకు ఉపాధి పోయే అవకాశం ఉందని, దిగుమతులపై ప్రభావం పడి పెద్దఎత్తున ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. భారత ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజాస్వామ్య దేశాలతో కలిసి యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలన్నారు.
స్వరాజ్యం జీవితం స్ఫూర్తిదాయకం
వీరనారి మల్లు స్వరాజ్యం జీవితం స్ఫూర్తిదాయకమని, ఈ తరానికి ఆమె ఒక స్ఫూర్తి అని రాఘవులు అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ దుర్మార్గంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మతం రంగు పూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఆనాటి అమరవీరుల త్యాగానికి ద్రోహం చేసినట్టేనని తెలిపారు. వీర తెలంగాణ సాయుధ పోరాట వారసత్వమైన లౌకికత్వాన్ని రక్షించుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉందన్నారు. తన జీవితాంతం ప్రజల కోసం నిస్వార్ధంగా పనిచేసిన మహా నాయకురాలు స్వరాజ్యం అన్నారు. మహిళలకు సంపూర్ణ స్వరాజ్యం రావాలని ఆమె నిరంతరం తపించేవారని, ఆ దిశగా ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని ఎదుర్కొనేందుకు ప్రతి మహిళా ఓ మల్లు స్వరాజ్యం కావాలని పిలుపునిచ్చారు. స్వరాజ్యం అంటే వ్యక్తి కాదు.. మహా శక్తి.. ఆమె ఒక ఉద్యమ కిరణం అని కొనియాడారు.
లౌకిక తెలంగాణ వారసత్వాన్ని కాపాడాలి : మల్లు నాగార్జున రెడ్డి
తెలంగాణ సాయుధ పోరాటం అందించిన లౌకిక వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం దేశానికి ప్రమాదకరమని విమర్శించారు. అంతకుముందు మల్లు స్వరాజ్యం చిత్రపటానికి నేతలు పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన గేయాలు పలువురిని ఆకట్టుకున్నాయి. మల్లు నాగార్జున రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సెమినార్‌లో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ములకలపల్లి రాములు, నాగారపు పాండు, పారేపల్లి శేఖర్‌రావు, మట్టిపెళ్లి సైదులు, కోట గోపి పాల్గొన్నారు.
స్వరాజ్యం ఈ తరానికి స్ఫూర్తి : జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అపార ధైర్యసాహసాలతో పోరాడిన వీరవనిత మల్లు స్వరాజ్యం జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. తుపాకీ పట్టి నిజాం పాలనను ఎదుర్కొన్న గొప్ప యోధురాలిగా ఆమె చరిత్రలో నిలిచారని తెలిపారు. మల్లు స్వరాజ్యం.. మహిళా శక్తికి ప్రతీకగా నిలిచారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి అన్నారు. ప్రస్తుతం మహిళలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి మహిళా మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.



