Saturday, December 13, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంవెనిజులాపై యుద్ధం ఎప్పుడో మొదలైంది

వెనిజులాపై యుద్ధం ఎప్పుడో మొదలైంది

- Advertisement -

ఆంక్షలు, ఆర్థిక దిగ్బంధంతో కట్టడికి ఎత్తుగడ
ఎదురు దెబ్బల నుంచి గుణపాఠం నేర్వని అగ్రరాజ్యం
రహస్య కార్యకలాపాల కోసం సీఐఏకు అనుమతి


కారకాస్‌ : దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాపై అమెరికా ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. వెనిజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురోను గద్దె దించడమే లక్ష్యంగా కయ్యానికి కాలు దువ్వుతోంది. తాజాగా వెనిజులా తీరంలో బుధవారం ఓ చమురు ట్యాంకర్‌ను హైజాక్‌ చేసింది. ఇటీవల కొన్ని నెలలుగా కరేబియన్‌ సముద్రంలో ప్రయాణిస్తున్న అనేక చిన్న చిన్న పడవలపై అమెరికా సైనికులు ప్రతాపం చూపుతున్నారు. అందులోని ప్రయాణికులను నిర్బంధిస్తున్నారు. ట్రంప్‌ ప్రభుత్వం వారిపై మాదక ద్రవ్యాల రవాణాదారులుగా ముద్ర వేస్తోంది. అమెరికా జరిపిన సైనిక దాడిలో కొందరు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు కూడా. తాజాగా ఈ నెల ఐదవ తేదీన జరిపిన దాడిలో ఐదుగురు చనిపోయారు.

కారణాలు వెతుకుతున్న ట్రంప్‌
వెనిజులాలో ఉన్న అపార చమురు నిల్వలపై అమెరికా కన్నేసింది. అమెరికాకు మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్న పడవలు, వ్యక్తులనే తాను లక్ష్యంగా చేసుకుంటున్నానని ట్రంప్‌ ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెబుతున్నప్పటికీ నిజానికి అమెరికా లక్ష్యం మదురోయే. అసలు అమెరికాకు జరుగుతున్న మాదక ద్రవ్యాల రవాణాలో వెనిజులా ప్రమేయమే లేదు. ఆ ప్రమేయానికి సంబంధించి అమెరికా ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలు చూపలేకపోయింది. ట్రంప్‌ ఆరోపిస్తున్నట్లుగా వెనిజులా ఫెంటానిల్‌ను ఉత్పత్తి చేయడమే లేదు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరాక్‌లో నరమేధం సృష్టించారు. విధ్వంసకర మారణాయుధాలను ఇరాక్‌ ఉత్పత్తి చేస్తోందని బుష్‌ అప్పుడు ఆరోపించారు. ఇప్పుడు వెనిజులాపై యుద్ధానికి ట్రంప్‌ కారణాలు వెతుక్కుంటున్నారు. ఆయనకు దొరికిన కారణమే మాదక ద్రవ్యాల రవాణా.

నాడు అనామకుడు గైడోకు బాసట
ఇరాక్‌పై అమెరికా విధించిన ఆంక్షల కారణంగా ఐదు లక్షల మంది చిన్నారులు చనిపోయారని ఐరాసలో అమెరికా రాయబారిగా పనిచేసిన మడేలిన్‌ ఆల్‌బ్రైట్‌ చెప్పిన మాటలను కూడా ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అమెరికా ఆంక్షల కారణంగా పలు దేశాలు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చిందని అనేక ఉదంతాలు రుజువు చేస్తున్నాయి. వెనిజులా విషయానికి వస్తే అధ్యక్షుడు మదురోను తొలగించడానికి అమెరికా చేయాల్సిందంతా చేస్తోంది. వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిగా తనను తాను ప్రకటించుకున్న జువాన్‌ గైడో అనే అనామకుడికి చేదోడువాదోడుగా ఉండాలన్న ఉద్దేశంతో 2019లో వెనిజులాపై ఆంక్షలను ట్రంప్‌ తీవ్రతరం చేశారు. గైడోకు సాయం చేయాలన్న అమెరికా ప్రయత్నాలు ఫలించకపోయినప్పటికీ అది విధించిన ఆంక్షలు పెను విధ్వంసాన్ని సృష్టించాయి.

ఆంక్షలతో కట్టడికి వ్యూహం
వెనిజులాపై ఏ క్షణంలో అయినా యుద్ధం మొదలు పెడతానని ట్రంప్‌ కొన్ని నెలలుగా బెదిరిస్తూనే ఉన్నారు. కానీ వాస్తవమేమిటంటే యుద్ధం ఇప్పటికే ప్రారంభమైంది. అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సేథ్‌ ‘యుద్ధ మంత్రి’గా కొత్త అవతారం ఎత్తారు. కరేబియన్‌ సముద్రంలో నావికులపై అమెరికా సాగిస్తున్న యుద్ధ నేరాలను ఆయన ‘యుద్ధ పొగమంచు’గా అభివర్ణించినప్పుడే జరుగుతున్నదేమిటో అందరికీ అర్థమైపోయింది. ఇప్పటికే అమెరికా చట్టవిరుద్ధమైన మరణశిక్షలు అమలు చేస్తూ స్థానిక మత్స్యకారులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. వెనిజులా మాజీ అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్‌పై 2002లో జరిగిన తిరుగుబాటుకు అమెరికా మద్దతు ఇచ్చింది. అయితే ఆ తిరుగుబాటు విఫలమైంది. అయినా తీరు మార్చుకోని అమెరికా 2005లో వెనిజులాపై పలు ఆంక్షలు విధించింది. అమెరికా విధించిన ఈ ఆంక్షలు ఒక్క 2017-18లోనే వెనిజులాలో నలభై వేల మందికి పైగా ప్రజల మరణానికి కారణమయ్యాయని వాషింగ్టన్‌ డీసీకి చెందిన సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ అండ్‌ పాలసీ రిసెర్చ్‌ సంస్థ తెలిపింది.

మూల్యం చెల్లించేది ప్రజలే
అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికే ఆంక్షలు అనే విషయం అందరికీ తెలి సిందే అయినా అంతిమంగా మూల్యం చెల్లించుకోవాల్సింది ప్రజలే. అమెరి కా ఆంక్షల కారణంగా 2020 నాటికి లక్ష మంది వెనిజులా వాసులు మరణించారని ఐరాస ప్రత్యేక నిపుణుడు ఆల్‌ఫ్రెడ్‌ డి జాయాస్‌ అంచనా వేశారు. 2021లో ఎదురైన ఆర్థిక దిగ్బంధనం కారణంగా పాతిక లక్షల మంది వెనిజులా ప్రజలు ఆహార అభద్రతకు గురయ్యారు. వ్యాధుల ఉధృతి, చిన్నారుల కుంగుబాటు, నీరు-విద్యుత్‌ కొరత వంటి సమస్యలను గురించి వేరే వివరిం చాల్సిన అవసరమే లేదు. ఇది లావుండగా వెనిజులాలో రహస్య కార్య కలాపాలు సాగించడానికి అక్టోబరు లో సీఐఏకు ట్రంప్‌ అనుమతి ఇచ్చేశారు. దాంతో రెచ్చిపోయిన సీఐఏ మాదక ద్రవ్యాల సరఫరాను అడ్డుకునే పేరిట వెనిజులాలో అశాంతిని సృష్టించే ప్రయత్నం చేస్తోంది. ట్యాంకర్‌ను హైజాక్‌ చేయడం అందులో భాగమే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -