Friday, November 21, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఉక్రెయిన్‌ యుద్ధానికి త్వరలోనే ముగింపు

ఉక్రెయిన్‌ యుద్ధానికి త్వరలోనే ముగింపు

- Advertisement -

చడీచప్పుడు లేకుండా శాంతి ప్రణాళికకు ట్రంప్‌ ఆమోదం

వాషింగ్టన్‌ : రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలికేందుకు ఉద్దేశించిన శాంతి ప్రణాళికకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ‘చడీచప్పుడు లేకుండా’ ఆమోదం తెలిపారని సమాచారం. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య శాంతి స్థాపన కోసం 28 సూత్రాల ప్రణాళికకు ట్రంప్‌ ఈ వారంలోనే ఆమోదం తెలిపారని ప్రభుత్వ సీనియర్‌ అధికారిని ఉటంకిస్తూ ఎన్బీసీ న్యూస్‌ వెల్లడించింది. ప్రభుత్వానికి చెందిన ఉన్నతాదికారులు గత కొన్ని వారాలుగా ఈ ప్రణాళికను ఎవరికీ తెలియకుండా గోప్యంగా రూపొందిం చారని, అందులో భాగంగా రష్యా రాయబారి కిరిల్‌ డ్మిట్రైవ్‌, ఉక్రెయిన్‌ అధికారులతో సంప్రదింపులు జరిపారని తెలియజేసింది. రష్యాతో పాలనా సంబంధమైన చర్చలు జరపడంలో ట్రంప్‌ ప్రత్యేక దూత స్టీవ్‌ విట్‌కాఫ్‌ కీలక పాత్ర పోషించారు.

ఫలితంగా శాంతి ఒప్పందానికి రష్యా సుముఖత వ్యక్తం చేసింది. ఈ ప్రణాళికను తొలుత ఆక్సియోస్‌ అనే వార్తా వెబ్‌సైట్‌ బయటపెట్టింది. ట్రంప్‌ ప్రతిపాదించిన 20 సూత్రాల గాజా శాంతి ప్రణాళిక నుంచి ఈ ప్రతిపాదన స్ఫూర్తి పొందిందని ఆ వెబ్‌సైట్‌ తెలిపింది. కాగా శాంతి ప్రణాళికలోని ముఖ్యమైన అంశాలను తెలిపేందుకు ప్రభుత్వాధికారి నిరాకరించారని ఎన్బీసీ న్యూస్‌ చెప్పింది. దీనిపై సంబంధిత పక్షాల మధ్య ఇంకా సంప్రదింపులు జరగాల్సి ఉన్నదని ఆ అధికారి గుర్తు చేశారు. శాంతి ప్రణాళికను ఇంకా ఉక్రెయిన్‌ నేతలకు అందజేయలేదని అమెరికా అధికారులు చెప్పారు. అమెరికా సైనిక ప్రతినిధి బృందం ఉక్రెయిన్‌లో పర్యటించాల్సి ఉన్నదని, ఆ తర్వాతే ముసాయిదా రూపకల్పన పూర్తవుతుందని వారు అన్నారు.

ఏం జరిగిందంటే…
2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం మొదలైంది. గత కొన్ని దశాబ్దాల కాలంలో యూరప్‌లో మునుపెన్నడూ ఇంతటి భారీ పోరాటం జరగలేదు. ముఖ్యంగా తూర్పు, దక్షిణ ఉక్రెయిన్‌ ప్రాంతంలోనే యుద్ధం కేంద్రీకృతమైంది. ఈ పోరు కారణంగా పెను విధ్వంసమే జరిగింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ దేశాల సైనిక, ఆర్థిక మద్దతుతో ఉక్రెయిన్‌ తన భూభాగాన్ని పరిరక్షించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. మరోవైపు రష్యా తాను ఆక్రమించుకున్న ప్రాంతాలపై పట్టు బిగించడానికి కృషి చేసింది. ఉక్రెయిన్‌ సైనికులపై, మౌలిక వసతులపై దాడులు చేస్తూ ఒత్తిడి పెంచింది. ఇరు పక్షాల మధ్య జరిగిన ఘర్షణతో పెద్ద ఎత్తున ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రతిష్టంభన సుదీర్ఘ కాలం కొనసాగడంతో పోరు ఎప్పుడు నిలిచిపోతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -