తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారమే ఎజెండా
నోటీస్ జారీ చేసిన సెంట్రల్ వాటర్ కమిషన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ జనవరి 30న సమావేశం కానుంది. ఈ మేరకు సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) శుక్రవారం మీటింగ్ నోటీస్ జారీ చేసింది. మూడు నెలల్లో తన నివేదికను సమర్పించాల్సి ఉన్న నేపథ్యంలో కమిటీ మొదటి సమావేశం న్యూఢిల్లీలోని సేవా భవన్‌లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీ వివాదాలపై నోటిఫై చేయనున్నారు. తదుపరి చర్చల కోసం నీటి నిర్వహణకు సంబంధించి రెండు రాష్ట్రాలు వివరాలను అందించాలని కమిటీ నోటీస్‌లో పేర్కొంది. అలాగే కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ తమ వద్ద ఉన్న పూర్తి సమాచారాన్ని అందజేయాలని సూచించింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మెన్ అతుల్‌జైన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలో కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మెన్లు, (ఎన్‌డబ్ల్యూడీఏ) చీఫ్ ఇంజినీర్, (సీడబ్ల్యూసీ) చీఫ్ ఇంజినీర్ రెండు రాష్ట్రాల నుంచి నలుగురు ఉన్నతాధికారులకు అవకాశం కల్పించారు.
పోలవరం నల్లమలసాగర్‌తో పాటు కృష్ణా నది వాటాల విషయంలో ఏర్పడ్డ వివాదాలను పరిష్కరించడానికి 2025 జూన్‌లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తెలంగాణ, ఏపీతో పాటు కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. అయితే వివాదాలు పరిష్కారం కాక పోగా, ఇంకా పెరిగాయి. దానికి తోడు బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలో ఏర్పాటైన కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యూనల్-2 (కేడబ్ల్యూడీటీ) కృష్ణా జలాల పంపకాల పున:పంపకంపై సెక్షన్ 3 ప్రకారం ఇవ్వాల్సిన అవార్డు గడువును కేంద్రం 31 జులై 2026 వరకు పెంచింది. అలాగే గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యూనల్ (జీడబ్ల్యూడీటీ) గతంలో ఇచ్చిన అవార్డులో రాష్ట్రాల మధ్య స్పష్టమైన పంపకాలపై నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో తాజాగా వేసిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.



