నవ్వుతున్నప్పుడు వెక్కిరిస్తుందీ సమాజం. దుఃఖిస్తున్నప్పుడు సంతోషాన్ని వెదకడం సహజం. బతికున్నంత సేపు ఎవ్వరూ పట్టించుకోరు. బాధలకు, బాధ్యతలకు లొంగిపోయి బతుకీడుస్తుంటే ఆకతాయిలా చూస్తారంతా. ఓర్పుతో భరిస్తున్నప్పుడు మరిన్ని బండరాళ్లను మీదకి విసురుతారు. అది మానవ నైజమేమో అనిపిస్తుంది.
బతకడం అంత ఈజీ కాదు అనిపిస్తుంది. సరే ఎలాగోలా బతికేద్దాం, నా జీవితం నాకోసం కాదు నా అనుకున్న వాళ్ళ కోసం నేనెలా వున్నా పర్లేదు బతకాలి అంతే అనుకుని ఒక్కో అడుగు ముందుకేస్తుంటే టక్కున వెన్నక్కి లాగెయ్యాలని వంద చేతులు అడ్డుపడతాయి. కన్నీటి కడలిలో ఈదుతున్నప్పుడు ఒక్క వేలు వచ్చి ఓదార్పునివ్వదు. అన్ని భరిస్తూ ఛీ ఎందుకు నాకీ బతుకు అనుకుని ఒక్క క్షణం నాది కాదనుని ఊపిరాపేసుకుంటే..
బతికున్నపుడు సహరించని స్నేహం, మేమున్నామని చెయ్యందించలేని బంధువర్గం… ఈ భువినొదిలి పోయాకా రాబందువుల్లా ఒక చోట చేరే శవాలపై పైసలేరుకున్నట్లు నీతి కవనాలు వల్లెవేస్తాయి. ఎంతలా అంటే ఒక వివేకానందుడు, ఏపీజే అబ్దుల్ కలాం లాంటి వారు చెప్పిన సూక్తులన్నీ చెప్పేస్తుంటారు. అవి విన్నప్పుడు అనిపిస్తుంది బతికివున్నప్పుడు చెప్పుంటే జీవితాలు చెల్లా చెదురు కావు కదా అని.
పైగా తీర్పులు చెప్పేస్తుంటారు. ఇలా జరిగివుంటే అలా జరిగి ఉండేది. అది అలా చేసింది కాబట్టి ఇలా జరిగింది. ఇది తప్పు అది ఒప్పు అని పేరుగాంచిన న్యాయవాదుల్లా ఉచిత సలహాలిస్తుంటారు. సందర్భోచిత సామెతలు చెబుతుంటారు. మన మాటల వల్ల అవతలి వాళ్ళు ఎంత గాయపడతారనేది అస్సలు ఆలోచించరు.
ఆలోచనా విధానం మారాలి. సలహాలు ఇచ్చే వాడికి అనుభవం ఉండదు. అనుభవించేవాడికి చూసేవాడు ఓదార్పు మాత్రమే ఇవ్వాలి. ముల్లులా గుచ్చి గుచ్చి గాయాన్ని మానకుండా మొత్తానికి నరికేసునే పరిస్థితికి తీసుకురానివ్వకూడదు. ఏది ఎందుకు జరిగిందో మనకు తెలీదు. తెలియకుండా ఎవ్వరికి సలహాలు, సూక్తులు, తీర్పులు ఇచ్చే ప్రయత్నం చెయ్యకండి. నీ ఒక్క మాట వల్ల అవతలి వాళ్ళ మనసు ముక్కలయ్యే ప్రమాదం వుంది. ప్రతి ఒక్కరికి అంతరాత్మ అనేది ఒకటుంటుంది. తప్పు చేసినా ఒప్పు చేసినా అది ప్రశ్నిస్తూనే ఉంటుంది. గ్రహించడం, తమను తాము సరిచేసుకోవడం అనేది వారి వారి విజ్ఞతకు సంబందించిన విషయం. అకారణంగా ఎవరినీ నిందించవద్దు. దూషించవద్దు.
ఎవరి జీవితం వారిది. ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్ళవి. ప్రస్తుత పరిస్థితుల్లో మీ వ్యక్తిగత విషయాలు బయటి వారితో పంచుకోవడం తప్పు. అవతలి వాళ్ళ విషయాలు అతిగా తెలుసుకోవడం అంతకంటే పెద్ద తప్పు. ఎందుకంటే విన్న చెవి మరో చెవికి చేరే వరకు ఊరుకోదు. ప్రచారం కావడం వల్ల నువ్వు సాధించేదేమీ లేదు. బతకాలి అంటే మొండిగా బతకాలి. మనతో వున్న వారిని బతికించాలి. పిరికితనం మనిషికి పట్టిన జాడ్యం. ఒక్కసారి అది మనసును అతుక్కుంటే వదిలించుకోవడం కష్టం. జీవితం చాలా చిన్నది. ప్రతి విషయంలో తప్తిగా బతకండి.
– వాసి జ్యోత్స్న, 9866843005