– ట్రంప్ టారిఫ్‌లపై మోడీ పరోక్ష స్పందన
– దేశానికి ఎంఎస్ స్వామినాథన్ రత్నం లాంటి వారు : ప్రధాని
న్యూఢిల్లీ : భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుంకాల బాదుడుపై ప్రధాని మోడీ పరోక్షంగా స్పందించారు. రైతుల సంక్షేమమే తమకు అత్యంత ప్రాధాన్యమని చెప్పారు. రైతులు, మత్స్యకారులు, పాడిరైతుల ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో ఎన్నటికీ రాజీపడబోమని తెలిపారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు వ్యక్తిగతంగా ఎంత మూల్యమైనా చెల్లించేందుకు తాను సిద్ధమేనని వ్యాఖ్యానించారు. భారత్ కూడా సిద్ధమేనని తెలిపారు. ఈ మేరకు వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాథన్ జయంతి ఉత్సవాలను పురస్కరించిన ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ.. స్వామినాథన్ మన దేశానికి ఓ రత్నం లాంటి వారని కొనియాడారు.
‘కొంతమంది వ్యక్తుల సహకారాలు ఒక యుగానికి లేదా ప్రాంతానికి మాత్రమే పరిమితం కావు. ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ కూడా అలాంటి గొప్ప శాస్త్రవేత్త. ఆయన భారతమాతకు నిజమైన పుత్రుడు. ఆయన విజ్ఞానాన్ని ప్రజాసేవకు మాధ్యమంగా మార్చారు. దేశ ఆహార భద్రతను తన జీవిత లక్ష్యంగా చేసుకున్నారు. ప్రొఫెసర్ స్వామినాథన్‌ను కలవడం నాకు ఒక విలువైన అనుభవంగా నిలిచింది. ఆయన ఎప్పుడూ సైన్స్ అనేది కేవలం ఆవిష్కరణ కోసమే కాదని, అందరికీ అందించడానికి కావాలని చెబుతుంటారు. ఆయన తన పనితో దీన్ని నిరూపించారు. ఆయన ఆలోచనలు నేటి వ్యవసాయ రంగంలో కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన నిజంగా భారత్‌కు ఓ రత్నం లాంటి వారు. ప్రొఫెసర్ స్వామినాథన్‌కు భారత్ రత్న పురస్కారంతో సత్కరించే అవకాశం మా ప్రభుత్వానికి లభించడం గౌరవంగా భావిస్తున్నాం’ అని మోడీ పేర్కొన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రొఫెసర్ స్వామినాథన్‌తో ఉన్న అనుబంధం గురించి ప్రధాని మోడీ తెలిపారు.
బయో హ్యాపీనెస్‌కు పునాది.. మోడీ
బయో-హ్యాపీనెస్ అనే పదాన్ని రూపొందించడంలో డాక్టర్ స్వామినాథన్ సహకారాన్ని మరవలేనిదని ప్రధాని మోడీ చెప్పారు. నేడు ప్రపంచవ్యాప్తంగా జీవవైవిధ్యం గురించి చర్చలు జరుగుతున్నాయని, రక్షించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు. కానీ స్వామినాథన్ ఒక అడుగు ముందుకు వేసి బయో-హ్యాపీనెస్ అనే భావనను సమాజానికి అందించారని చెప్పారు. జీవవైవిధ్యం శక్తితో స్థానిక ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురాగలమని డాక్టర్ స్వామినాథన్ నమ్మేవారని తెలిపారు.