– తప్పించిన ఆ కారే కీలక ఆధారం ?
– చర్యలకు అధికారుల జాప్యం ఎందుకు ?
– మరోసారి రంగంలోకి ఆ మిత్రులు
– మీరేమీ మాట్లాడొద్దంటూ బేరసారాలు
– నిజాయితీ నిరూపించుకున్న ప్రజాసంఘాల నాయకులు
– చర్చనీయంగా నవతెలంగాణ సంచలన కథనాలు..
నవతెలంగాణ – భూపాలపల్లి
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఉదంతంలో ‘నవతెలంగాణ’ వరుస కథనాలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రజాసంఘాలు గర్జిస్తుంటే, తెరవెనుక జరుగుతున్న చీకటి దందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
ఆ అగంతకుడే ‘సాక్షి’
ఈ కేసులో అనూహ్యంగా ఒక అగంతకుడు ప్రధాన సాక్షిగా తెరపైకి వచ్చారు. ఈ ఉదంతం వెనుక ఏదైనా పెద్ద రాకెట్ ఉందా? అనే కోణంలో విశ్లేషిస్తే, ఆ సాక్షి వద్ద ఉన్న సమాచారం అత్యంత విలువైనదిగా తెలుస్తోంది. అయితే, ఆ సాక్షిని బయటకు రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు? నిందితులకు కొమ్ముకాస్తున్న ఆ ‘పెద్దలు’ ఎవరు? అనే చర్చ ఇప్పుడు రాజకీయ, అధికారుల వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తప్పించిన ఆ కారే కీలక ఆధారం?

ఆ రాత్రి హాస్టల్ లో ఘటన జరిగిన సమయంలో అక్కడి నుండి అత్యంత వేగంగా వెళ్ళిపోయిన ఆ ‘మిస్టరీ కారు’ ఇప్పుడు దర్యాప్తులో కీలకంగా మారనుంది.అక్కడికి వచ్చిన మిత్రులు ఎవరు ? ఆ కారు ఎవరిది? ఎక్కడి నుండి వచ్చి ఎక్కడికి వెళ్ళింది? అనే వివరాలు సేకరించి కారును పట్టుకుంటే నిందితుల జాతకాలు బయటపడతాయి.
చర్యలకు అధికారుల జాప్యం ఎందుకు?
సాక్ష్యాలు ఇంత స్పష్టంగా ఉన్నా, ప్రజా క్షేత్రంలో నిరసనలు వెల్లువెత్తుతున్నా.. ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకనే ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి.
మరోసారి రంగంలోకి ఆ ‘ మిత్రులు’
సోమవారం నవతెలంగాణలో ప్రచురితమైన కథనానికి విద్యార్థి సంఘాలు గర్జించాయి. అగంతకుడి తో పాటు, హాస్టల్ వార్డెన్ కు సహకరించిన మిత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. జరిగిన సంఘటనను నీరుగార్చడంలో ఆరితేరిన ‘ఆ ఇద్దరు మిత్రులు’ మళ్ళీ రంగప్రవేశం చేశారు. బాధితులను, వారి కుటుంబాలను, విద్యార్థి సంఘాల నాయకులను వేరువేరుగా కలిసి “మీరేమీ మాట్లాడొద్దు.. సెటిల్ చేసుకుందాం” అంటూ బేరసారాలకు తెరలేపారు. బెదిరింపులు ఒకవైపు, ఆశ చూపడం మరోవైపుగా ఈ నయవంచకుల నాటకం సాగుతోంది.
నిజాయితీ నిరూపించుకున్న విద్యార్థి సంఘాల నాయకులు…
విద్యార్థినిల యోగక్షేమాలే విద్యార్థి సంఘాల ప్రధాన లక్ష్యం. ఆర్థికంగా ఆశ చూపినా, బెదిరింపులకు దిగినా లొంగకుండా నిజాయితీని నిరూపించుకున్నారు. ఈ ధైర్యం చూసి బాధితులు మరియు విద్యార్థినిలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘నవతెలంగాణ’ ప్రత్యేక కథనాలే తమకు కొండంత అండగా నిలుస్తున్నాయని సంఘటన తేలే వరకువీడకుండా పోరాడతామని చెప్పడం గమనార్హం. దీంతో ప్రజలు ప్రజాప్రతినిధులు, విద్యార్థులు సైతం హర్ష వ్యక్తం చేస్తున్నారు.



