– శంషాబాద్‌లో కల్లు తాగుతుండగా ఈ నెల 1న ఘటన
– ఆలస్యంగా వెలుగులోకి..
– చిన్నారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు
నవతెలంగాణ-శంషాబాద్
గుర్తుతెలియని మహిళ ఆరేండ్ల చిన్నారిని ఎత్తుకెళ్లిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ కె.బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కంచన్‌పల్లి గ్రామానికి చెందిన దంపతులు క్యాత్రమోని లక్ష్మమ్మ, రవి తమ కుటుంబ సభ్యులతో కలిసి శంషాబాద్‌కు వలస వచ్చి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆమె ఈ నెల 1వ తేదీన తన ఇద్దరు కూతుళ్లు కీర్తన (6), అర్చనను తీసుకొని శంషాబాద్ కల్లు కంపౌండ్ వచ్చింది. అక్కడ తన పిల్లలతో పాటు కూర్చొని కల్లు తాగుతుండగా ఒక గుర్తుతెలియని మహిళ కల్లు తాగడానికి వచ్చింది. వారితో ఆ మహిళ మాటలు కలిపి కలుపుగోలుగా మాట్లాడింది. ఈ క్రమంలో ఎవరూ గుర్తించని సమయంలో కీర్తనను వెంట బెట్టుకొని బయటకు వెళ్ళిపోయింది. వెంటనే తేరుకున్న లక్ష్మమ్మ తన కూతురు కోసం వెతికింది. కీర్తన కనిపించలేదు. దాంతో తన చిన్న కూతురు అర్చనను తీసుకొని ఇంటికి వెళ్లిపోయింది. కానీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదు. ఇప్పటి వరకు కూతురు ఆచూకీ లభించకపోవడంతో బంధువుల సూచన మేరకు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. శంషాబాద్ కల్లు కాంపౌండ్ వద్ద తన కూతురిని గుర్తు తెలియని మహిళ తీసుకెళ్లిందని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అక్కడున్న సీసీ కెమెరాలు పరిశీలించి.. అనుమానితురాలి ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. వారి ఆచూకీ కోసం పోలీసులు స్పెషల్ టీమ్‌లను రంగంలోకి దింపారు.
బాలికను ఎత్తుకెళ్లిన మహిళ
- Advertisement -
- Advertisement -