ఇలలోకపు సహజాతంలా.. కలల తీరపు కలాÛరంలా.. బ్రతుకు మేలిమి బంగారంలా.. స్థితిగతులు నీవయ్యేలా.. మునుముందుకు సాగేలా.. నిను మనిషిగా నిలిపేలా.. ప్రాణం పోసే గర్భపేటిక! సజీవ ఉనికి ప్రపంచానికి.. ఆశల విశ్వాసపు జీవన పీఠిక!! గర్భసంచి మాట్లాడుతోంది.. తల్లి తానై తనువిచ్చే చనునిచ్చే.. అమ్మతనానికి చిరునామాను.. ఔను నేను గర్భసంచిని! నీ శరీరానికి ప్రాణం పోసిన.. తొమ్మిది నెలల సజీవతను!! ఇలా కడుపు కూడా కబుర్లు చెబుతుంది.
కన్ను, ముక్కు, నాలుక, చెవి చర్మం అనే పంచ జ్ఞానేంద్రియాలు, వాక్కు, పని నడక వంటి క్రియలందించే చేతులు కాళ్ళూ, మలమూత్ర విసర్జనల వంటి కర్మేంద్రియాలు అన్నీ కలిస్తే మనిషి! Action Sensus,, నీ ఎముకలు, నీ కండరాలు, నీలో జలసదృశ్యంగా ప్రవహించే రక్తం, నువ్వు శ్వాసించే వాయువు, నీ ఆకలిలోని అగ్ని, గుండె ఊపిరితిత్తులు నీ నిర్దిష్ట పనులు చేసే అంతరావయవాలు, నువ్వు నిర్దేశిస్తే పనులు చేసే బాహ్యావయవాలూ, తల నుండి పాదాల వరకు ఉన్న అంగ ప్రత్యంగాలు, నీవనే రూపుకు నవమాసాలు మోసి, అవయవాలు అన్నీ తయారుచేస్తుంది గర్భసంచి! తల్లి ప్రేమతో జాగ్రత్తగా నేల మీద పుట్టించే గర్భసంచి ఇన్నేసి అత్యవసర విషయాలను చెబుతుంది!!
‘గర్భసంచిని కాపాడుకుందాం సమాజాన్ని బలపరుద్దాం’ అనే పేరుతో మన ముందు ప్రత్యక్షమైన ఈ పుస్తకం… ఎన్నో మంచి మంచి విషయాలను చెబుతున్నది. ఇందులోని అక్షరాక్షరం మీకోసం అందించిందంతా మనిషి జీవన విజ్ఞాన వికాసమే. ఈ పుస్తకం చదవడం మన మస్తకాలకు అత్యవసరం. ‘నిన్ను నువ్వు ఆరోగ్యంగా ఉంచుకోవటానికి నన్ను కూడా నీతో కలిసి మనుగడ సాగించనివ్వు..’ అంటూ ఏం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది ఎలా నడుచుకుంటే మనుగడ సాగుతుంది అనే విషయాలు గర్భసంచి కబుర్లుగా చిట్టచివరన అనుబంధంలో దర్శనమిస్తుంది. ఎన్నో మానవీయ, శాస్త్రీయ విధానాల ఉదాహరణలతో మొట్టమొదటి నుంచీ చిత్రపటాల వంటి రుజువులతో సహా వివరించిన పొత్తమిది.
పుట్టుక చావులకు మధ్య నీదైన అస్తిత్వానికి స్వచ్ఛ రూపం ఇచ్చే నవ మాసగర్భ కుహరపు విశేషాలన్నీ 12 అధ్యాయాలుగా డాక్టర్ సామవేదం వేంకట కామేశ్వరి రచించి మనకు అందించిన అమూల్యమైన పుస్తకం ఇది. ‘తమ గర్భసంచిని కాపాడుకుంటూ సమగ్ర ఆరోగ్య పరిరక్షణకు శ్రద్ధ వహించే స్త్రీలందరికీ అంకితం’ అంటూ పుస్తకం పైన ధర కూడా పెట్టలేదు ‘వెల అమూల్యం’ అన్నారు రచయిత్రి.
గర్భసంచిని అండాశయాలను కలిపే అండవాహికలు ముఖచిత్రంగా వేసిన ఈ పుస్తకం స్త్రీ జనోద్ధరణతో పాటు సమస్త జనోదరణ కోసం నడుం కట్టిన అక్షరాయుధం. వైజ్ఞానిక ప్రగతి తారాస్థాయికి చేరుకున్న వేళలో భూగోళంపైన మానవుడు వైద్యం ముసుగులో చేసిన వికృత చేష్టలకు ప్రతీక. 2001లో మెదక్ జిల్లాలోని సదాశివపేట గ్రామంలో గ్రామస్థాయి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నప్పుడు 300 మంది నిరుపేద గ్రామీణ నిరక్షరాస్య అమాయక స్త్రీ జీవితాలలో జరగకూడని అన్యాయం జరిగిందని తెలిసింది. అంటే అందరికీ గర్భసంచి తొలగించారని మేం తెలుసుకున్నప్పుడు నివ్వెర పోయాం. 171 మంది బాధిత స్త్రీలను 20 గ్రామాలలో గుర్తించాం. అప్పుడు తేలిన విషయాలు ఏంటంటే, వైద్యానికి అందని సమస్యను సృష్టించినట్లు తెలుస్తోంది. ఈ ఘోరాన్ని సమాజం ముందు పెట్టి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాం అంటారు.
సృష్టికి ప్రతి సృష్టి చేసే తల్లి స్థానం రీప్లేస్మెంట్ చేయలేనిది. బతకడానికి జన్మనిచ్చే శక్తి కలిగిన ఏకైక జీవి స్త్రీ. అందుకే స్త్రీలు అబలలు కాదు సబలలు అని గొంతెత్తి నినదించాల్సివస్తున్నది. మనషులలోనే కాదు ఇతర ప్రాణులలోనూ ఆడజాతికి సంబంధించినవి మాత్రమే పునరుత్పత్తి చేయగలవు. ఇదే ఆశ్చర్యకరమైన విషయం. ఆడజాతి లేదు అంటే సృష్టి మొత్తం శూన్యమే అయిపోతుంది. జీవాలను సృష్టించి ప్రత్యుత్పత్తి చేసే శక్తి స్త్రీ శక్తి. బాల్య, కౌమార, యవ్వన దశలను అధిగమించి ముగ్ధ మనోహరంగా తయారయ్యే వరకు ఆడ జాతి శరీరంలో ఎన్నో మార్పులను గమనిస్తాం. ఇక్కడ వరకు ఎంతో ఆనందంగా అందంగా ఉన్న స్త్రీలు తల్లి కాగానే శరీరంలో త్వరితగతిన మార్పులు సంభవించి రూపమే మారిపోతుంది.
స్త్రీల శారీరక ఆరోగ్య పరిరక్షణ శాస్త్రాన్ని చదువుకున్న వాళ్ళని గైనకాలజిస్టులు అంటాం. వ్యాధులు అనేవి స్త్రీ పురుషులకు ఎవరికైనా సమానమైనవి గానే వస్తాయి కానీ స్త్రీలలో కొన్ని రకాల వ్యాధులు ఎక్కువగా, అవీ ముఖ్యంగా గర్భ సంబంధమైనవే ఉండడం వలన సమాజంలో గర్భ విషయ శారీరక శాస్త్ర వైద్యులది ముఖ్యమైన పాత్ర ఉంటుంది. 12 అధ్యాయాలుగా ఈ పుస్తకం ఆడవాళ్ళకు ఓ గైడ్. ఆధారాలు లేకుండా గర్భసంచి తొలగింపు మన స్త్రీల ప్రస్తుత పరిస్థితి అనే మొదటి అధ్యాయంలో విషయ పరిచయం చేస్తూ మానవ మనుగడకు మూలమైన గర్భసంచి ఎలా నిరాదరణకు గురి అవుతోందో, ఎలా తొలగిస్తున్నారో, శాస్త్రీయ ఆధారాలు లేకుండా వైద్యాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో వివరించారు. గర్భసంచి మన మొదటి ఇల్లు అంటూనే, సాంఘిక దురాచారాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నీతిగా పాటించకపోవడం, స్త్రీలకు మౌలిక సదుపాయాలను అందించడంలో విఫలం అవ్వడం వంటి ఎన్నో విషయాలను చెప్పారు. ప్రసవ సమయంలో ఎంతోమంది స్త్రీలు మరణించడానికి కారణం వైద్య లోపమే అంటూ రాశారు.
సాధారణ శారీరక బాధలకు అనవసరమైన వ్యాధుల పేర్లను చెబుతూ భయాన్ని కలిగిస్తూ, రోగ నిర్ధారణలో తప్పుగా వ్యాఖ్యానిస్తూ ఆరోగ్యవంతులైన యువతులకు హిస్ట్రక్టరీ చేయడాన్ని నిపుణతగా పేర్కొంటూ, గర్భసంచి ఉండడమే అన్ని బాధలకు మూలం, దాన్ని తొలగించడం తప్ప వేరే మార్గం లేదని తప్పుడు విషయాలను చెప్పి గర్భాన్ని తొలగించి ఎట్లా అన్యాయం చేశారో వివరించారు. తెలంగాణలో 20.2 లక్షల మందికి గర్భసంచిని తొలగించే ఆపరేషన్లు జరిగినట్లు తెలుస్తోందని వీరు రాయడం ఎంతో విచారించాల్సిన విషయం. రెండవ అధ్యాయంలో గర్భసంచి ఆరోగ్యానికి సూచిక అంటూ పాద వివరాలను ఇచ్చారు.
1999 నుండి Life Health Reinforcement Group అనే స్వచ్ఛంద సంస్థకు అనుబంధంగా ఆరోగ్య సాంఘిక రంగాల్లో క్షేత్రస్థాయిలో గర్భ సంచి తొలగింపుపై చేసిన అధ్యయనాన్ని చేసినట్టు రుజువులతో సహా నిరూపించారట. అలాగే మూడవ అధ్యాయంలో పునరుత్పత్తి అవయవాల మధ్య సమన్వయం – తెలిసిన, తెలుసుకోవాల్సిన, తెలియని విషయాలను ఉటంకించారు. మనిషి జీవక్రియలన్నింటికీ పునరుత్పత్తి అవయవాలైన గర్భసంచి అండాశయాలు అండవాహికలు అన్నీ ఒక వ్యవస్థగా ఉంటాయని చెబుతూ అటువంటి గర్భసంచిని అనవసరంగా తొలగించినట్లు చెబుతూ కేవలం స్త్రీకి ప్రాణహాని ఉన్న పరిస్థితిలో మాత్రమే గర్భసంచిని తొలగించాలి కానీ చిన్న చిన్న సమస్యలకు గర్భసంచి తొలగించకూడదు అని చెప్పారు.
ఈ విషయాలపై అవగాహన కలిగిస్తూ మనిషి శరీరంలో 11 ముఖ్య అవయవ వ్యవస్థలు అంటేorgan systems ఉంటాయని వినాలికా గ్రంధి వ్యవస్థ అంటే endocrinesystem రక్తంలోకి నేరుగా రసాయలను స్రవించడం ద్వారా సమాచారాన్ని అందిస్తే నాడీ వ్యవస్థ నాడుల ద్వారా సమాచారాన్ని ఇస్తూ జీవధర్మాలను చక్కగా జరిగేటట్లు చేస్తాయని, అట్లాగే పునరుత్పత్తి వ్యవస్థ వ్యాధి నిరోధక వ్యవస్థ వంటివి ఎన్నో కలిసి పనిచేస్తుంటాయని చక్కగా వివరించారు. పునరుత్పత్తి అవయవాలు ఎముకల గట్టితనానికి వాటిలో ఉండే ఖనిజాలకు ఉన్న సంబంధాన్ని నాలుగవ అధ్యాయంలో వివరించారు.
పురుషులతో పోలిస్తే స్త్రీలలో మొదటి నుంచి ఎముకల బలం గట్టితనం తక్కువ.Peak Bone Mass అనేది తక్కువగా ఉంటుంది అనీ, స్త్రీలలో మోనోపాజ్ తర్వాత కూడా బలం తగ్గుతుందనీ, ఈ రకమైన తగ్గుదల పురుషులలో ఉండదని ముసలితనం ఇద్దరికీ వచ్చినా స్త్రీల ఎముకలలో బలం ప్రతి ఏడాది తగ్గుతూ వస్తుందని, మోనోపాజ్ వల్ల ఎముకలు గుల్లబారతాయనీ వివరించారు. గర్భసంచి అండాశయాల మధ్య సంబంధాన్ని ఐదో అధ్యాయంలో చెబుతూ అండాశయ క్యాన్సర్ వచ్చే రిస్క్ వయసుతో పెరుగుతుందంటారు. ‘మా పరిశోధనలో అధ్యయనం చేసిన 171 మంది స్త్రీలలో 33 శాతం స్త్రీలకు అండాశయాలను తొలగించారు. ముందు జాగ్రత్తలు చేస్తూ విజ్ఞతతో సరైన అవగాహనతో ఉంటే హిస్ట్రక్టమీ ఆపరేషన్ అవసరం లేదని, ఏ పద్ధతిని పాటించకుండా గర్భసంచిని తొలగించడం తప్పని’ రాశారు.
పురుష శుక్ర కణాల సంయోగానంతరం ఫలదీకరణ చెందిన తర్వాత పిండంగా మారడానికి గర్భంలో చేరుతుంది.
జన్యు నిర్మాణం జననేంద్రియ నిర్మాణాలు రూప భేదాలతో స్పష్టంగా ఉంటాయి. ఆడపిల్లలు యవ్వనవతులై రజస్వల సమయం ప్రారంభమైనప్పటి నుండి గర్భం దాల్చినప్పటి వరకు వచ్చే పరిణామాలు చాలా తేడాతో ఉండడం గమనిస్తాం. ఆరోగ్యకరమైన స్త్రీలలో కూడా సరైన శాస్త్రీయ ఆధారాలు లేకుండా స్వేచ్ఛ కోసమో పిల్లలు ఇక అవసరం లేదనో గర్భసంచిని అండాశయాలను వీటితోపాటు అపెండిక్స్‌ను తొలగించడం తప్పు అంటారు. అండాశయాలు ఈస్ట్రోజన్ హార్మోన్‌ను స్రవిస్తాయి. వీటిని తీసివేయడం వల్ల ఆకస్మికమైన మోనోపాజ్ వస్తుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయని వివరిస్తూ, జన్యుపరమైన క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉన్నప్పుడే ఇలా చేయాలని అంటారు.
గర్భం అంటే లోపలి అంతర్గత విషయంగా చెప్తాం. అందుకే గృహ గర్భం, నదీగర్భం, సముద్ర గర్భం అని అంటాం. పుట్టుకతోనే శత్రుత్వమున్న వాళ్ళ ఇంట్లో పుట్టిన పిల్లలు పెరిగిన తర్వాత శత్రుత్వభావన అలాగే వాళ్లతో పాటు పెరిగితే వాళ్ళని గర్భశత్రువు అని కూడా అంటారు. ఇలా గర్భ పదం చాలా ప్రాధాన్యతను సంతరించుకున్న పదం. ఋతు చక్రం ఆగి పిండం తయారయి సంపూర్ణ గర్భం నుండి ప్రసవమయ్యి జననం అయ్యేవరకు ఒకానొక అనిర్వచనీయ భావంలో ఉండే స్త్రీ తల్లి కాగానే ఒక కొత్త జన్మను అందుకుంటుంది. పిల్లలే సర్వస్వం అయి సాకుతుంది. ఈ ప్రక్రియలో తనను తాను పట్టించుకోదు. సంతానంలో తనను చూసుకుంటుంది. స్త్రీల అండంలో ఫలదీకరణ చెందిన తర్వాత పిండం ఆమె గర్భాశయంలో పెరగడాన్ని గర్భం అంటారు. ఇవన్నీ సంసారానికి సిద్ధమయ్యే ప్రతి స్త్రీ పురుషులూ సవివరంగా తెలుసుకోవాలి. పునరుత్పత్తికి సిద్ధంగా ఉన్న స్త్రీ కడుపులో జరిగే పిండ ఉత్పత్తి సంకేతం గర్భ ధారణ. ఇవన్నీ తెలిసి ఉండాలి.
ఆరవ అధ్యాయంలో గర్భసంచి తొలగింపులకు ఆరోగ్య సేవలో పేరుతో జరుగుతున్న అన్యాయాలకు పూర్తిగా భిన్నమైనదిగా వివరించారు. మూఢ నమ్మకాలు విజ్ఞాన రాహిత్యంతో స్త్రీలు ఎలా ప్రాణాలు కోల్పోయారో చెప్పే సందర్భంలో 1846లో హంగరీ దేశంలో జరిగిన సత్య నిరూపణలో ఒక వైద్యుడు తన ప్రాణాలు ఎలా కోల్పోయాడో ఉదహరించారు. అలాగే భావజాలాలు భయాలు హెచ్.పి.వి, పాప్‌స్మియర్ పరీక్షల ప్రాధాన్యతను వివరించిన ఏడవ అధ్యాయం కూడా ఆసక్తికరంగా ఉంది. అంగన్వాడిలో పని చేసే ఒక అమ్మాయి వచ్చి తన అక్కకు క్యాన్సర్ వస్తుందేమోనని భయంగా ఉందని, మీరు నాకు టైం ఇవ్వాలి, సహాయం చేయాలని ప్రాధేయపడిన విషయాన్నంతా ఇంటర్వ్యూ రూపకంగా ఇచ్చారు. సురక్షిత సంభోగం ప్రాముఖ్యతను, సుఖ వ్యాధుల వివరాలను చెప్పి ఆమె అక్కకు వెంటనే ఏ ఏ పరీక్షలు చేయించాలో అవగాహన కల్పించారనీ రాశారు.
పాప్ స్మియర్ పరీక్ష ప్రాధాన్యతను పట్టిక రూపంలోనూ ఇచ్చారు. ‘ఈ ప్రవాహాన్ని ఆపవద్దుLet it Flow గర్భసంచిని కాపాడుకుందాం’ అంటూ సేవ్ ద యూట్రస్ క్యాంపెయిన్ విశేషాలన్నీ పిక్చర్స్‌తో సహా ఎనిమిదో అధ్యాయంలో ఇచ్చారు. స్త్రీలకు సరైన ఆరోగ్య వసతులు కల్పించలేక పోవడం వల్ల కలిగే అనర్ధాలను చెప్పడం, పునరుత్పత్తి వయసు ప్రాముఖ్యతను వివరించడం, గర్భసంచి తొలగించడం వలన వచ్చే దీర్ఘకాలిక దుష్ప్రభావాలను పరిశోధించి చెప్పడం ఉద్దేశ్యంగా సాగింది. హిస్ట్రక్టమీ, పెద్దాపరేషన్ వంటివి జరిగాక తీసిన గర్భసంచిని మళ్ళీ అతికించడం అనేది ఇతర అవయవాలను పెట్టినట్టుగా అస్సలే వీలవదు అంటారు. కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మంచిదైన గర్భసంచిని తీసేయవద్దని నొక్కి వక్కాణించారు.
తెల్ల బట్ట, పొత్తి కడుపునొప్పి, బహిష్టు సమయంలో జననేంద్రియాల వాపు, పొక్కులు, దురద, మూత్రంలో మంట ఇటువంటి వాటితో ఇబ్బందిగా అనిపిస్తే, భార్యాభర్తలు కలిసినప్పుడు అంతకుముందు లేని నొప్పి వచ్చినా అనారోగ్య సమస్యలుగా గుర్తించాలి. సరైన పరీక్షలు చేసి మందులతో తగ్గించవచ్చు కాబట్టి గర్భసంచిని తీసేయించుకోవద్దు అని వివరించారు. ఇటువంటి ఇబ్బందులప్పుడు డెటాల్, ఘాటైన వాసన గల సబ్బులు ఉపయోగించకూడదు. దీనివల్ల మంచి చేసే సూక్ష్మక్రిములు చనిపోయి చెడు సూక్ష్మ క్రిములు ఎక్కువ అవుతాయి. దీనివల్ల జబ్బులు వస్తాయి. యోని సహజంగానే శుభ్రపరచుకుంటుంది. కాబట్టి శుభ్రమైన నీళ్ళతో క్లీన్ చేసుకుంటే చాలనే విషయం అందరికి తెలిసిందే. భయంతో ఏవేవో వాడకూడదు, వైద్యులను సంప్రదించాలి. ఈ సందర్భంలో మన మొదటి ఇంటిని మనం గౌరవిద్దాం. ఇతరులను గౌరవించాలని కోరుదాం అనే నినాదాలు ఇస్తారు.
గర్భం, ప్రసవం, బాలింత దశలలో స్త్రీలు ఏమేమి కోల్పోతారో పట్టిక ఇస్తూ ‘మన ఆరోగ్యానికి మనమే బాధ్యత వహిద్దాం.. మన జ్ఞానాన్ని పెంచుకుందాం’ అంటూ అనారోగ్య విషయాలలో స్త్రీలకు నిర్ణయాధికారం ఉండాలి అని తొమ్మిదవ అధ్యాయంలో చెబుతారు. స్త్రీలు తన శరీరానికి, తన ఆరోగ్యానికి తగిన సమయాన్ని ఇవ్వకపోవడం వల్లనే చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని రాస్తారు. కౌమార దశ గురించి పదవ అధ్యాయంలో వివరించారు. లైఫ్ హెచ్ ఆర్ జి ద్వారా జరిగిన క్షేత్రస్థాయి పరిశోధన వివరాలు ఫలితాలు 11వ అధ్యాయంలో రాశారు. గర్భసంచి తొలగించిన స్త్రీల ఆరోగ్య భద్రతకు తక్షణ చర్యల ఆవశ్యకత ఏమిటో 12వ అధ్యాయంలో రాశారు. ఇలా గణాంకాల వివరాలతో సహా ఇచ్చారు.
హక్కులు బాధ్యతలు అని మాట్లాడే ఎంతోమందికి కూడా స్త్రీల ఆరోగ్యం పట్ల అవగాహన లేకుండా మొరటుగా ఎందుకు ఉంటారు? ఉండకూడదు! అసలు తమ కూతురు బహిష్టు విషయాన్ని తల్లిదండ్రులు ఇద్దరు కూర్చుని చర్చించకుండా, భార్యాభర్తలు పిల్లలను ఎప్పుడు కనాలి అనే విషయాలను చర్చించకుండా అలా బతికేస్తుంటారు. గర్భం ధరించడానికి వయసుతో నిమిత్తం లేకుండా, ఆర్థిక స్తోమతను అంచనా వేసుకోకుండా అనవసరమైన హంగులు ఆర్భాటాలకు ప్రాధాన్యత ఇస్తూ చాలామంది కోరి కష్టాలను తెచ్చుకుంటారు. సాధారణంగా ఫలదీకరణ చెందిన తర్వాత కడుపులో తయారైన పిండం క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఈ కాలాన్నే గర్భావధి అంటారు. గర్భంతో ఉన్న మహిళ చివరి ఋతుకాలం నుండి 40 వారాలు గర్భంతో ఉంటుంది. సాధారణంగా ప్రెగెన్సీ వచ్చిన 38 వారాల తర్వాత డెలివరీ అవుతారు. అంటే దాదాపు తొమ్మిది నెలలు పొట్టతో ఉంటారు. ఇట్లా నవమాసాలు మోసిన తర్వాత పురుడు పోసుకుంటారు. అప్పుడు గాని శిశువులు అవయవాలు సంపూర్ణంగా సిద్ధమై ఆరోగ్యంగా పుడతారు.
ఈ గర్భావధి సమయంలో స్త్రీలకు శరీరంలో విపరీతమైన మార్పులు వస్తాయి. ఐరన్ లోపం, కొంతమందికి షుగర్, బీపీ పెరగడం, ఆహారం సహించకపోవడం, కడుపులో తిప్పడం, తీవ్రమైన వికారంతో వాంతులు చేసుకోవడంతో పాటు విపరీతంగా వెన్ను నొప్పి కూడా చాలా మందికి వస్తుంది. మూడు కాలాలుగా ఈ గర్భధారణ సమయాన్ని విభజిస్తే మొట్టమొదటి గర్భ సమయం కాలంలోనే ఎక్కువ మందికి గర్భస్రావాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గర్భం ధరించినప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాలపై ఏ అవస్థ వచ్చినా మృత పిండం అయ్యే అవకాశాలు ఉంటాయి. గర్భధారణ సమయంలోనూ, గర్భవిచ్ఛిత్తి అయితేనూ మానసికంగా కూడా స్త్రీలు ఎన్నో మార్పులకు గురవుతారు. తల్లి కావడం అనే సహజ ప్రక్రియ ఎప్పుడైతే వికటిస్తుందో అప్పుడే సమస్యలు ఉత్పన్నమవుతాయి.
తల్లి కావడం అనే ప్రత్యేక అనుభూతిని పొందగలగడం చాలా గొప్ప విషయం, అరుదైన విషయం. గర్భధారణ తర్వాత స్త్రీ అటు మానసికంగా ఇటు శారీరకంగా ఎన్నో మార్పులకు లోనవుతుంది. హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి, భౌతికంగా శారీరకమార్పులు స్పష్టంగా తెలిసిపోతాయి. ఇన్ని సంక్లిష్టతలు ఏర్పడతాయి. ఇవన్నీ తట్టుకొని నిలిచిన గర్భవతి ఈ ఆధునిక కాలంలో విజయం సాధించినట్టే. చాలామందికి ఆరోగ్యాలు సరిగా ఉండక గర్భస్రావాలు జరుగుతున్నాయి. గర్భస్రావాలు జరిగిన స్త్రీలను జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే డెలివరీ తర్వాత కూడా చాలా నీరసించి ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తల్లి అయిన తర్వాత పిల్లల భవిష్యత్తుకు తనే మార్గదర్శి కావాలి. తను కన్న పిల్లలకు సమాజంలో ఎట్లా జీవించాలో నేర్పగలగాలి, నైతిక విలువలను సామాజిక నైపుణ్యాలను చెప్పగలగాలి.
పైవన్నీ చేయాలంటే ముందున్న అసహనం స్థానంలో సహనం చేరాలి. కోపం స్థానంలో ఆప్యాయత చేరాలి. తొందర తొందరగా పనులు చేసేయాలని ఆత్రుత తగ్గి నెమ్మదిగా, నింపాదిగా చేసే నైపుణ్యతను సాధించుకోవాలి. ఈ పుస్తక రచయిత ‘మీ ఆరోగ్య సమస్యలకు అవసరమైన సలహాలనిస్తాం’ అంటూ Lifehrg@gmail.com అనే ఈ మెయిల్ అడ్రస్ ఇచ్చారు. మీ సందేహాలను దీనికి పంపించమంటూ ఆరోగ్య శిక్షణ శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తామంటూ చెప్పారు రచయిత్రి.
కళ్ళను రెప్పలు పైనా కిందా ఉండి కాపాడుతున్నట్టు శరీరానికి మనసు, బుద్ధి అనే రెప్పలు ఉంటాయి. మనిషిని కాపాడుతుండేలా మలచుకోవాలి. అంతరాత్మని అడగండి. మనస్సాక్షిగా ప్రశ్నించండి.Feelings and intiutions అనేవి ఒక phrasలో భావాలు ఇమిడి ఉండేవి ఉంటాయి కదా ప్రశ్నించుకోండి.. అద్దం ఎప్పుడూ అబద్ధాన్ని చూపించదు. భాష కందని భావాలు ఉంటాయి తొవ్వుకోండి.. అంతర్గత శక్తులను పున: సమీక్షించుకోండి. పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనోనేత్రంతో గమనించుకోండి.. గర్భసంచి విలువను అర్థం చేసుకోండి. అంత:కరణ శుద్ధితో స్త్రీల పట్ల గౌరవాన్ని ఆదరణను చూపించాలి. ఆరోగ్యం గురించి మంచి విషయాలను తెలుసుకుందాం. ఒక సదుద్దేశ్యంతో ఈ పుస్తకాన్ని రచించిన రచయిత్రి సామవేదం వేంకట కామేశ్వరికి, ప్రచురించిన హెచ్.ఆర్.జి. ముఖ్య నిర్వహణ అధికారికి అభినందనలు తెలియజేస్తున్నాను. గర్భపేటిక జీవన పీఠిక.. గర్భసంచిని కాపాడుకుందాం! గౌరవాల సింహాసనం పై స్త్రీ జాతిని చూద్దాం!!
– డా|| కొండపల్లి నీహారిణి, 9866360082