నయా ఉదారవాద దాడి పెరిగింది
సమీకరణతోనే కార్మిక ఉద్యమం బలోపేతం
ఈ నెలలో పాలస్తీనాలో పర్యటిస్తాం : ‘నవతెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డబ్ల్యూఎఫ్‌టీయూ ప్రధాన కార్యదర్శి పాంబిస్ కిరిట్జిస్
ప్రపంచంలోని కార్మిక వ్యతిరేక విధానాలను కార్మికవర్గం ప్రతిఘటిస్తోందని ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌టీయూ) ప్రధాన కార్యదర్శి పాంబిస్ కిరిట్జిస్ అన్నారు. కార్మికవర్గంపై నయా ఉదారవాద దాడి పెరిగిందని, దీన్ని తిప్పికొట్టేందుకు కార్మికవర్గం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. పాలస్తీనాలో అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్ చేపట్టే అమానవీయ చర్యలను ఖండించిన ఆయన, ఈనెలలో తన అధ్యక్షతన డబ్ల్యూఎఫ్‌టీయూ ప్రతినిధి బృందం పాలస్తీనాలో పర్యటిస్తుందని తెలిపారు. ప్రపంచ కార్మికసంఘాల సమాఖ్యలో ప్రపంచవ్యాప్తంగా 133 దేశాల నుంచి 100 మిలియన్లకుపైగా సభ్యులు ఉన్నారు. సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభకు విశాఖపట్నం వచ్చిన ఆయన ‘నవతెలంగాణ ప్రతినిధి’తో ముచ్చటించారు.
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి- అనంతలవట్టం ఆనందన్ నగర్
ప్రపంచంలో కార్మిక వర్గంపై దాడిని ఎలా చూస్తారు?
ప్రపంచంలో కార్మికహక్కులపై దాడి తీవ్రంగా జరుగుతోంది. దశాబ్దకాలంగా నయా ఉదారవాద దాడి వేగవంతమైంది. కార్మిక ఉద్యమ బలోపేతానికి కార్మికులను సమీకరించడం ఒక్కటే మార్గం. పెట్టుబడిదారి వ్యవస్థ సంక్షోభం చాలా తీవ్రంగా ఉంది. దీనివల్ల కార్మిక వర్గంపై సరికొత్త దాడి జరుగుతోంది. కార్మికుల హక్కులతో పాటు మొత్తం కార్మిక వర్గ ఆలోచనపైనే దాడి జరుగుతోంది. దీనిపై గతేడాదిగా ప్రపంచ కార్మికవర్గం ఉద్యమిస్తోంది. యూరప్, లాటిన్ అమెరికా, ఆసియా దేశాల్లో కార్మిక వర్గ ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. సరిగ్గా ఇండియాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పెట్టుబడిదారీ సంక్షోభం తీవ్రతరం కావడంతో కార్మిక, సామాజిక, ప్రజాస్వామ్య, ట్రేడ్ యూనియన్ స్వేచ్ఛలపై దాడులు మరింత కఠినంగా, తీవ్రంగా మారుతున్నాయి.
ఈ దాడిని ఎలా ఎదుర్కొంటారు?
కార్మికవర్గంపై ప్రపంచ పెట్టుబడిదారీ వర్గం చేస్తున్నదాడిని పోరాటాలతోనే తిప్పికొడతాం. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులు మార్చడానికి సమ్మె ఒక్కటే మార్గం. అంతేతప్ప వ్యవస్థతో మిలాఖత్ అవ్వడంతో ఎటువంటి ఉపయోగం లేదు. లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా ఇండియాలోని ఫిబ్రవరిలో జరిగే సమ్మె విజయవంతానికి భారీగా సమీకరణ జరుగుతుందని ఆశిస్తున్నా. ఈ సమ్మెకు డబ్ల్యూఎఫ్‌టీయూ సభ్య సంఘాల మద్దతు ఉంటుంది.
డబ్ల్యూఎఫ్‌టీయూ సంఘీభావం ఎలా ఉంది?
ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా డబ్ల్యూఎఫ్‌టీయూ స్పందిస్తుంది. అమానవీయంగా జరిగే దాడులకు వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమం చేస్తోంది. బాధిత దేశాలకు సంఘీభావంగా నిలుస్తోంది. బాధిత దేశాలకు అండగా నిలిచేందుకు సమీకరణ కూడా చేస్తోంది. ఈ నెలలో డబ్ల్యూఎఫ్‌టీయూ ప్రతినిధి బృందం పాలస్తీనాను సందర్శిస్తుంది. తమ సంఘీభావాన్ని, తమ మద్దతును అక్కడి వారికి అందిస్తాం. అక్కడ జరిగే అకృత్యాలను ప్రపంచానికి తెలియజేస్తాం. పాలస్తీనాకు మద్దతుగా జరిగే ఆందోళనల్లో భాగస్వామ్యం అవుతాం.
ప్రపంచంలో నిరుద్యోగం పరిస్థితిని ఎలా చేస్తారు?
పెట్టుబడిదారీ విధానాల అమలే నిరుద్యోగానికి ప్రధాన కారణం. ప్రపంచంలో యువత నిరుద్యోగ సమస్యతో సతమతం అవుతోంది. పెట్టుబడిదారీ వర్గాలు దీన్ని కప్పిపుచ్చి, అన్ స్కిల్డ్ పేరుతో ప్రచారం చేస్తున్నాయి. పని చేయడానికి సిద్ధపడిన యువతకు పని దొరకని పరిస్థితి నెలకొంది. ఇది ప్రపంచానికే సవాలుగా మారింది. దీనిపై ప్రభుత్వాధినేతలు సరిగ్గా స్పందించటం లేదు. పైగా కార్పొరేట్ శక్తులతోనే ఉపాధి పెరుగుతోందని ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. తమ బాధ్యత నుంచి తప్పుకోవడానికి ఇలాంటి ప్రచారాలకు తెరలేపుతున్నారు. అలాగే ధరలు పెరుగుదలకు పెట్టుబడిదారీ విధానాలే కారణం.



