– మేడారం వనదేవతల గద్దెల ప్రతిష్టాపన
– అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తి చేస్తాం
– తాత్కాలిక పనులు కాకుండా శాశ్వత పనులు చేపట్టాం
– ఆదివాసీ గిరిజనుల మనోభావాలు దెబ్బతినకుండానే పనులు పూర్తి : మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క
నవతెలంగాణ – ములుగు
మేడారం జాతర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులు 200 సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా ఉండేలా పనులు చేస్తున్నామని, అనుకున్న సమయానికి అన్ని పనులు పూర్తి చేస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వనదేవతలను దర్శించుకోవడానికి మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాదిమంది సందర్శకులు మేడారం చేరుకొని వనదేవతల దీవెనలు పొందుతున్నారని తెలిపారు. మంగళవారం ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను, మేడారంలో చిలుకలగుట్ట రోడ్డు, స్తూపం, కన్నెపల్లి, జంపన్నవాగు, ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ చిత్రమిశ్రా, డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్‌తో కలిసి మంత్రి పొంగులేటి పరిశీలించారు. ఆలయం వద్ద జరుగుతున్న సాండ్ స్టోన్ బొమ్మల లిపి చిత్రాలను, క్యూ లైన్ నిర్మాణ పనులను, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెల నిర్మాణ పనులను, ఆలయ ఫ్లోరింగ్ పనులను, ఆలయ ప్రహరీలో వెదురు బొంగు మాదిరిగా ఉన్న స్తంభాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం మేడారంలోని హరిత హౌటల్‌లో సంబంధిత శాఖల ఉన్నత స్థాయి అధికారులు, గుత్తేదారులతో మేడారం జాతర అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణ పనులు, రాతి నిర్మాణ పనులు, సివిల్ వర్క్స్, గద్దెల చుట్టూ గ్రిల్స్, ప్రాకారం బయటి వైపు సీసీ రోడ్లను పనులు డిసెంబర్ 31వ తేదీ లోపు, ఇతర పనులు జనవరి 5వ తేదీ లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రధాన ద్వారం పనులు కూడా జనవరి 5వ తేదీ లోపు పూర్తిచేయాలని అన్నారు. ఆలయ ప్రాంగణం గద్దెల పరిసర ప్రాంతాలతోపాటు ఇతర ప్రాంతాల్లో కూడా త్వరితగతిన లైటింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. రహదారికి ఇరువైపులా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని, గద్దెలకు చేరుకునే హరిత వై జంక్షన్ నుంచి గద్దెల ప్రాంగణం వరకు సెంట్రల్ లైటింగ్ పనులను కూడా పూర్తి చేయాలని తెలిపారు. జాతర సమయంలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత ప్రతిపాదికన వాటర్ ట్యాంకులను నిర్మించాలని, పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. జాతరకు వచ్చే అన్ని రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని, ఐటీడీఏ ఆధ్వర్యంలో తాత్కాలిక పనులకు ప్రాధాన్యత ఇవ్వకుండా శాశ్వత అభివృద్ధి పనులకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సుందరీకరణ కూడలిలో గ్రాస్ ప్లాంటేషన్ పనులు, రహదారికి ఇరువైపులా రెవెన్యూ ప్లాంటేషన్ మొక్కలను నాటించాలని అన్నారు. గతంలో కంటే కూడా 200 శాతం సందర్శకుల సంఖ్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ, ఆర్‌అండ్‌బీ అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. కాగా, గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జాతరను విజయవంతం చేయాలని ఎంపీ బలరాం నాయక్ అన్నారు.
గిరిజన సంప్రదాయాలు ఉట్టిపడేలా..
గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా గద్దెల ప్రాంతంలో పాలరాతి శిల్పాలచే పునరుద్ధరణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గద్దెల ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా 29 ఎకరాల భూసేకరణ చేపట్టి పనులు పూర్తి చేస్తున్నామని అన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఆదివాసీ గిరిజనుల అస్తిత్వాన్ని కాపాడుతూ పనులు చేపట్టామని అన్నారు. పాలరాతి శిల్పాలు ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావడంతో ఆలయ పునరుద్ధరణ పనులు కొంత ఆలస్యంగా జరుగుతున్నాయని తెలిపారు.
స్వస్తిక్ ఏర్పాటు విషయంలో గిరిజనుల సంప్రదాయ ప్రకారంగా ఏర్పాటు చేస్తున్నామని, దీనిపై ఎవరూ రాద్ధాంతం చేయొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్ జి, సంపత్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, ఆర్ అండ్ బీ, పీఆర్ ఈఎన్‌సీ, ఆర్డీఓ వెంకటేష్, పూజారులు, జిల్లా అధికారులు, ఆర్కిటెక్చర్, గుత్తేదారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
200 ఏండ్లు చెక్కుచెదరకుండా పనులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


