– టారిఫ్ వార్, ఇరాన్‌తో యుద్ధంలో ట్రంప్ ఫెయిల్
– భవిష్యత్ కమ్యూనిస్టులదే… : కొరటాల వర్థంతి సభలో మాజీ ఎంపీ పీ మధు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అమెరికా ఆధిపత్యాన్ని ప్రపంచం ప్రతిఘటిస్తున్నదని సీపీఐ(ఎం) మాజీ ఎంపీ పీ మధు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎంహెచ్ భవన్‌లో నవతెలంగాణ దినపత్రిక ఆధ్వర్యంలో ప్రజాశక్తి సాహితీ సంస్థ మాజీ చైర్మెన్, సీపీఐ(ఎం) ఉమ్మడి రాష్ట్ర మాజీ కార్యదర్శి కొరటాల సత్యనారాయణ 19వ వర్థంతి సభ జరిగింది. దీనికి మధు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకొనేందుకు అమెరికా ఇష్టారీతిన సుంకాలను పెంచిందన్నారు. చైనా, కెనడా, ఫ్రాన్స్ తదితర దేశాలు ఎదురు దాడికి దిగడంతో ట్రంప్ తోకముడిచారని చెప్పారు. ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధంలో తల దూర్చి అమెరికా తగిన మూల్యం చెల్లించుకుందన్నారు. టారిఫ్ వార్, ఇరాన్ వార్‌లో ప్రపంచం ముందు అమెరికా విఫలమైందంటూ పలు అంశాలను ఉదహరించారు.
ప్రస్తుతం ప్రపంచంలోని వివిధ దేశాల ఆర్థిక, రాజకీయ విధానాల్లో మార్పులొస్తున్నాయనీ, ఆ పరిణామాలను అందిపుచ్చుకుని ముందుకు సాగితే భవిష్యత్ కమ్యూనిస్టులదేనని స్పష్టం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ సీటు లేదని కార్యకర్తలు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. సీపీఐ(ఎం)కు ఓట్లు, సీట్లు ముఖ్యం కాదనీ, ప్రజాక్షేత్రంలో పేదల పక్షాన నిలుస్తూ వారి కన్నీళ్లు తుడిచేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్నామని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్టుల బలోపేతానికి కొరాటాల సత్యనారాయణ ఎనలేని కృషి చేశారని చెప్పారు.
1968 ప్రాంతంలో నక్సలైట్ల నుంచి ఎదురైన ప్రతిఘటనను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. అంబలి కేంద్రాల ఏర్పాటు, పేదలకు భూ పంపిణీ, పత్తి రైతుల ఆత్మహత్యల నివారణ కోసం ఆయన అలుపెరగని పోరాటం చేశారని అన్నారు. పార్టీ సిద్ధాంతాలను చివరి వరకు త్రికరణ శుద్ధితో ఆచరించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన ఆశయాలకు అందరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. సభకు అధ్యక్షత వహించిన నవ తెలంగాణ సీజీఎం పీ ప్రభాకర్ మాట్లాడుతూ పూర్వ ప్రజాశక్తి అభివృద్ధి కోసం కొరటాల చేసిన సేవలు మరువలేనివని చెప్పారు. ప్రజాశక్తి పత్రికకు ప్రభుత్వం నుంచి స్థలాలు ఇప్పించడంలో ఆయన విశేషంగా కృషి చేశారని తెలిపారు. నవతెలంగాణ స్టేట్ బ్యూరో ఇంచార్జి బీవీఎన్ పద్మరాజు అతిథులను వేదికపైకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నవతెలంగాణ పత్రిక సంపాద కులు రాంపల్లి రమేశ్, బుకహేౌస్ ఎడిటర్ కే ఆనందాచారి పాల్గొన్నారు.