Saturday, March 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅమెరికాపై ప్రపంచదేశాలు ఒత్తిడి తేవాలి

అమెరికాపై ప్రపంచదేశాలు ఒత్తిడి తేవాలి

- Advertisement -

ఇరాన్‌పై యుద్ధాన్ని నిలువరించాలి
ప్రపంచయుద్ధంగా మారితే భవిష్యత్‌ కోల్పోతాం
ఎస్వీకే వెబినార్‌లో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు అరుణ్‌కుమార్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ దాడులు ప్రపంచయుద్ధంగా మారితే ప్రపంచానికే భవిష్యత్‌ ఉండదని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్‌ అరుణ్‌కుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌ సహా ప్రపంచదేశాలన్నీ అమెరికాపై ఒత్తిడి తెచ్చి, యుద్ధ నివారణకు కృషి చేయాలని కోరారు. ఇప్పుడు ఏ దేశంలోనూ అణ్వాయుధాల నియంత్రణ కోసం ఆదేశించే పరిస్థితులు లేవని చెప్పారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ‘ట్రంప్‌, నెతన్యాహు యుద్ధోన్మాదం- ప్రపంచంపై దాని ప్రభావం’ అంశంపై జరిగిన వెబినార్‌లో అరుణ్‌కుమార్‌ ప్రధాన వక్తగా మాట్లాడారు. ప్రస్తుత యుద్ధంలో రష్యా, చైనా దేశాలు సైనిక పరంగా ఇరాన్‌ పక్షాన నిలిస్తే, అది ప్రపంచానికే మంచిది కాదన్నారు. అలాకాకుండా ఇతర మార్గాల్లో యుద్ధాన్ని ఆపేందుకు ఆయా దేశాలు అమెరికాపై ఒత్తిడి తేవాలని చెప్పారు.

ప్రపంచదేశాలను ఏకం చేస్తూ అమెరికాపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగేలా చేయొచ్చనీ, ఆ మేరకు ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. ఈ యుద్ధం అమెరికా, ఇరాన్‌కు సంబంధించిన అంశం మాత్రమే కాదనీ, అంతిమంగా సామ్రాజ్యవాదం నశిస్తేనే శాశ్వత ప్రపంచ శాంతి లభిస్తుందని స్పష్టంచేశారు. అయితే తక్షణ కర్తవ్యం ఈ యుద్ధాన్ని ఆపడమేననీ, ఆ ప్రయత్నంలో ప్రపంచదేశాలు ఇరాన్‌కు మద్దతుగా నిలవాలని ఆకాంక్షించారు. అమెరికా తర్వాతి టార్గెట్‌ క్యూబానే అనీ, ఇప్పటి నుంచే క్యూబా సంఘీభావ ఉద్యమాలను ఉధృతం చేసి, ప్రజల్ని భాగస్వాముల్ని చేయాలన్నారు. యుద్ధం వల్ల జన, ఆస్తి నష్టంతోపాటు ప్రపంచ ఆర్థికవ్యవస్థపై ప్రభావం పడి అనేక రాజకీయమార్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు.

అమెరికా ఈ ఏడాది తొలి రెండు నెలల్లోనే రెండు సార్వభౌమదేశాలపై దౌర్జన్యానికి పాల్పడిందని గుర్తుచేశారు. వెనిజులాపై దాడి చేసి, ఆదేశ అధ్యక్షుడిని బంధించిందనీ, ఈ సందర్భంగా వందమంది సైనికులను చంపేసిందని చెప్పారు. తాజాగా ఇజ్రాయిల్‌ ప్రోద్బలంతో అమెరికా ఇరాన్‌పై దాడి చేసిందనీ, వారంరోజుల్లో రెండువేలమంది మరణించారనీ, అనేకమంది గాయపడ్డారనీ, వేలకోట్ల ఆస్తినష్టం జరిగిందని వివరించారు. మొదటిరోజే అమెరికా ఇరాన్‌లోని చిన్న పిల్లల స్కూల్‌పై బాంబులు వేసి, వందమందికిపైగా పసిబిడ్డల్ని చంపేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్యపట్ల అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాలు కనీస పశ్చాత్తాపం ప్రకటించలేదని ఆక్షేపించారు.

ఇరాన్‌ ప్రతిదాడిలో ఆరుగురు అమెరికన్‌ సైనికులు మరణిస్తే, ట్రంప్‌ గగ్గోలు పెట్టారనీ, మరి వారి చర్యతో పోయిన పసిపిల్లల ప్రాణాలకు లెక్కలేదా అని ప్రశ్నించారు. తాము ఏం చేసినా మౌనంగా ఉండాలనీ, ప్రతీకారం తీర్చుకొనే అధికారం ఎవరికీ లేదని అమెరికా చెప్పదలుచుకుందని విమర్శించారు. అమెరికా ఐక్యరాజ్యసమితి నిర్ణయాలన్నింటినీ ఉల్లంఘించి, యుద్ధోన్మాదంతో వ్యవహరిస్తున్నదన్నారు. ఇరాన్‌పై యుద్ధానికి రెండ్రోజుల ముందు భారత ప్రధాని నరేంద్రమోడీ ఇజ్రాయిల్‌ పర్యటనకు వెళ్లారనీ, దీన్ని అప్పుడే వామపక్షపార్టీలు ముక్తకంఠంతో వ్యతిరేకించాయని గుర్తుచేశారు. క్యూబాపై దాడి జరక్కుండా ప్రపంచదేశాలు అమెరికా సామ్రాజ్యవాదాన్ని కట్టడిచేయాలని చెప్పారు. వెబినార్‌కు సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌ వినయ కుమార్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -