Friday, November 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపిల్లల ప్రపంచం పిలుస్తోంది

పిల్లల ప్రపంచం పిలుస్తోంది

- Advertisement -

-రెండు రోజుల పాటు బాలోత్సవం
– నేడు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ప్రారంభం
– తొలి రోజు సీనియర్లు..రెండో రోజు జూనియర్ల సందడి
– పిల్లల్లోని సృజనాత్మకతను వెలికితీసేలా విభిన్న అంశాల్లో పోటీలు
– ఆకట్టుకోనున్న చిన్నారుల సైన్స్‌ ఫెయిర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

చదువుల చట్రంలో బందీలైన చిన్నారులను మరో ప్రపంచం పిలుస్తోంది. సృజనాత్మక ప్రదర్శనల కోసం బాలోత్సవం వేదిక రా..రమ్మని పిలుస్తోంది. ఇరుకుగదులు..బట్టీ చదువులకు కాస్త విరామమిచ్చి స్వేచ్ఛా ప్రపంచంలో విహరిద్దాం రమ్మంటూ హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో గల సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆహ్వానిస్తోంది. స్వేచ్ఛనిస్తే..ప్రోత్సహిస్తే..మొగ్గ దశలోనే సరైన మార్గం చూపితే మరో ప్రపంచం సాధ్యమేనని చాటిచెప్పేందుకు పిల్లల సైన్యం అక్కడకు కదిలి రాబోతున్నది. వెయ్యి హోల్టుల బల్బు అయినా మా వెలుగుల ముందు దిగదిడుపే అని చాటిచెప్పేందుకు చిన్నారుల లోకం సంసిద్ధమై వస్తోంది. గురు, శుక్రవారాలను పిల్లల కోసం కేటాయిద్దాం. రండి..కదిలి రండి…చిన్నారుల ప్రదర్శనలను తిలకిద్దాం..భవిష్యత్తు మీదే అంటూ దీవిద్దాం.బాలోత్సవం..ఒక సృజనాత్మకోతవ్సం. ప్రతి ఏటా మాదిరిగానే ఈసారీ బాలోత్సవం వేదిక ఐదో చిల్డ్రన్‌ ఫెస్ట్‌ను గురు, శుక్రవారాల్లో నిర్వహించనున్నది. దీనికి హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో గల సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదిక కానున్నది. 5 వేల మంది చిన్నారులు తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించేందుకు ఎస్వీకేకు రానున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లను బాలోత్సవం కమిటీ పూర్తి చేసింది. ఈ ఫెస్ట్‌ ప్రారంభోత్సవానికి అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారులు, ఐఏఎస్‌(రిటైర్డ్‌) కె.వి.రమణాచారి, హైదరాబాద్‌ కలెక్టర్‌ హరిచందన దాసరి, తెలంగాణ భాషా, సాంస్కృతిక విభాగం డైరెక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి, ప్రముఖ సినీగేయ రచయిత డాక్టర్‌ సుద్దాల అశోక్‌ తేజ, భారత్‌ విద్యాసంస్థల చైర్మెన్‌ సీహెచ్‌.వేణుగోపాల్‌రెడ్డి, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మాలావత్‌ పూర్ణ, గ్రంథాలయోద్యమకర్త ఆకర్షణ సతీశ్‌, బాలోత్సవం రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి సోమన్న, తదితరులు హాజరుకానున్నారు. ఆయా అంశాల్లో పిల్లల సృజనాత్మక శక్తులను దగ్గరుండీ తిలకించనున్నారు.

బాలోత్సవం పోటీలు ఇలా..
పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగానే పిల్లల్లో ప్రతిభ కూడా బాల్యంలోనే మొగ్గ తొడుగుతుంది. మొగ్గ దశలోనే పిల్లల్లో కళల పట్ల ఆసక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో బాలోత్సవం పనిచేస్తున్నది. వారిని కళాజీవులుగా, శ్రమజీవులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు నడుస్తున్నది. పిల్లల్లోని అసమాన ప్రతిభాపాటవాలకు వేదికగా నిలుస్తూ వారి మానసిక స్థితిని వికసింపజేయడంలో తనదైన పాత్రను పోషిస్తున్నది. ముఖ్యంగా పిల్లల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం, మట్టిలోని మాణిక్యాలను వెలికితీయడం, ఉపాధ్యాయుల కృషిని గుర్తించి ప్రోత్సహించడం, పిల్లల్లో మానసిక ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం అనే లక్ష్యాలతో బాలోత్సవం ముందుకు సాగుతున్నది. ప్రతి ఏటా పిల్లల కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగానే బాలోత్సవం కమిటీ సాంస్కృతిక, సాహిత్య, సైన్స్‌ఫెయిర్‌ ఇలా 36 అంశాల్లో గురు, శుక్రవారాల్లో పిల్లలకు పోటీలను తలపెట్టింది. వాయిద్య పరికరాలతో పిల్లల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నది. తొలిరోజు సీనియర్‌ కేటగిరిలో భాగంగా 8,9, 10వ తరగతి పిల్లలకు ఆయా విభాగాల్లో పోటీలు జరుగనున్నాయి. పిల్లలు ఏర్పాటు చేయబోయే సైన్స్‌ఫెయిర్‌ శాస్త్రీయ భావజాలానికి నిలువటద్ధంగా నిలువనున్నది. బతుకమ్మ, జానపద, దాండియా నృత్య ప్రదర్శలను ఆయా పాఠశాలల విద్యార్థులను చేపట్టనున్నారు. షార్ట్‌ఫిలిమ్‌ ప్రదర్శన కూడా ఉండనున్నది. చైతన్యపరిచే, ఆలోచింపజేసే ఆయా షార్ట్‌ఫిలిమ్‌లను చూసిన తర్వాత పిల్లలు తమ భావాలను పంచుకోనున్నారు. కథలు, లఘునాటికలు, చిత్రలేఖనం, వ్యాసరచన, కథారచన, క్విజ్‌, స్పెల్‌బీ, తదితర పోటీల్లో పాల్గొననున్నారు. రాణిరుద్రమదేవి, భగత్‌సింగ్‌, అల్లూరిసీతారామరాజు, ఇలా విచిత్ర వేషధారణలతో ఏకపాత్రాభినయ పాత్రతో తమ నటనాకౌశల్యాన్ని ప్రదర్శించనున్నారు. ఎంపిక చేసిన అంశాలపై పిల్లలకు వ్యాసరచన పోటీలు జరుగనున్నాయి. మట్టితో బొమ్మలను పిల్లలు తయారు చేయనున్నారు. రెండోరోజైన శుక్రవారం 4,5,6,7వ తరగతి విద్యార్థులకు ఆయా విభాగాల్లో పోటీలు జరుగనున్నాయి. ఆయా కేటగిరిల్లో జరిగే ఈవెంట్లలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన పిల్లలకు అక్కడే బహుమతులు, సర్టిఫికెట్లను బాలోత్సవం నిర్వహకులు అందజేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -