Saturday, January 10, 2026
E-PAPER
Homeబీజినెస్అత్యంత పేలవ వారం..

అత్యంత పేలవ వారం..

- Advertisement -

– సెన్సెక్స్‌ 2,300 పాయింట్ల పతనం
– ఐదో రోజూ నేల చూపులే
– ట్రంప్‌ దాష్టీకంతో వరుస నష్టాలు
– భారత వృద్ధి రేటుపైనా అనుమానాలు
ముంబయి:
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దాష్టికానికి భారత మార్కెట్లు వరుస పతనాన్ని చవి చూస్తోన్నాయి. భారత్‌పై భారీ సుంకాల ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటుగా.. వెనిజులాపై సాయుధ దురాక్రమణకు పాల్పడి ఆ దేశ అధ్యక్షుడు మదురోను యూఎస్‌ అరెస్ట్‌ చేసి భౌగోళిక ఉద్రిక్తతలను రెచ్చగొట్టడంతో ఇన్వెస్టర్లు విశ్వాసాన్ని కోల్పోయారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో భారత వృద్ధి రేటు తగ్గొచ్చనే ఎజెన్సీల అంచనాలు తదితర అంశాల నేపథ్యంలో భారత మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో డిసెంబర్‌ 9తో ముగిసిన వారంలో సెన్సెక్స్‌ భారీ నష్టాన్ని చవి చూసింది. 2025 సెప్టెంబర్‌ తర్వాత ఒక వారంలో అత్యధిక నష్టం జరగడం ఇదే తొలిసారి. గడిచిన ఐదు సెషన్లలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఏకంగా 2,359.73 పాయింట్లు పతనమయ్యింది. జనవరి 2న 85,762 పాయింట్ల వద్ద ముగిసిన మార్కెట్లు వారాంతం సెషన్‌లో ఇంట్రాడేలో ఏకంగా 83,402 కనిష్టాన్ని చవి చూసింది. ఇదే సమయంలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 2.5 శాతం పతనమయ్యింది. 2025 సెప్టెంబర్‌ 26 తర్వాత ఇదే అత్యంత పేలవ వారం ప్రదర్శన కావడం గమనార్హం.

శుక్రవారం సెషన్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 604.72 పాయింట్లు లేదా 0.72 శాతం నష్టంతో 83,576కు పరిమితమయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 193.55 పాయింట్లు లేదా 0.75 శాతం క్షీణించి 25,683 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌-30లో ఆసియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, బీఈఎల్‌, ఎటర్నల్‌, రిలయన్స్‌, ఎస్‌బీఐ షేర్లు అధికంగా లాభపడగా.. ఎన్‌టీపీసీ, అదానీ పోర్ట్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, సన్‌ఫార్మా షేర్లు అధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు వరుసగా 0.79 శాతం, 1,81 శాతం చొప్పున పతనమయ్యాయి. ఐటీసీ, అదాని గ్రూపునకు చెందిన ఏసీసీ, బాటా, ఐఆర్‌సీటీసీ తదితర స్టాక్స్‌ 52 వారాల కనిష్టాన్ని చవి చూశాయి.

ప్రతికూలాంశాలు..
అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి ప్రతికూల సంకేతాలు, ఎఫ్‌ఐఐల అమ్మకాలు మార్కెట్లను ఒత్తిడికి గురి చేశాయి. ముఖ్యంగా రియల్టీ, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌, ఆటో స్టాక్స్‌ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అమెరికా అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌ టారిఫ్‌లపై ఆ దేశ సుప్రీంకోర్టు శుక్రవారం రాత్రి తీర్పు వెలువరించనుంది. ఒకవేళ ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే భారత మార్కెట్లకు ఊరట కలగనుంది. ట్రంప్‌ విధానాలకు అనుకూలంగా తీర్పు వస్తే ఆయా దేశాలపై మరిన్ని టారిఫ్‌లు విధించేందుకు అవకాశం ఉంటుంది. అదే జరిగితే వచ్చే వారం మరింత ఒత్తిడిని ఎదుర్కోనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -