Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుఅన్నదాత ఆగ్రహం మన గ్రోమోర్‌పై దాడి

అన్నదాత ఆగ్రహం మన గ్రోమోర్‌పై దాడి

- Advertisement -
  • యూరియా బస్తాలు ఎత్తుకెళ్లిన రైతులు
  • రాళ్లతో షట్టర్లు ధ్వంసం, బోర్డు చించివేత
  • మానుకోటలో ఉద్రిక్త పరిస్థితి
  • రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ యూరియా కష్టాలు

    నవతెలంగాణ-మహబూబాబాద్‌/విలేకరులు
    అన్నదాత ఆగ్రహం కట్టలు తెగింది.. యూరియా బస్తాలు ఇవ్వకుండా వేధిస్తుండటంతో రైతులు ప్రతిఘటించారు. యూరియా బస్తాలు దాచిపెట్టి ఇతర రాష్ట్రాలకు, బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం మహబూబాబాద్‌ జిల్లాలో రైతులు మన గ్రోమోర్‌ షాప్‌పై రాళ్లతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేసి గోదాం తాళాలు పగలగొట్టి యూరియా బస్తాలు ఎత్తుకెళ్లారు. ఇలాగే, రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ రైతులు రాస్తారోకోలు నిర్వహించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే..
    మహబూబాబాద్‌లోని మన గ్రోమోర్‌ ఫర్టిలైజర్‌ షాప్‌ ముందు మూడు రోజులుగా రైతులు బార్లు తీరుతున్నారు. అయినా యాజమాన్యం యూరియా బస్తాలు ఇవ్వడం లేదు. పైగా రైతులు ఎక్కువగా ఉన్నారని షట్టర్లు వేసి, తాళాలు వేసి ఉంచారు. దాంతో ఆగ్రహించిన రైతులు రాళ్లతో గ్రోమోర్‌ షాప్‌పై దాడి చేశారు. షట్టర్లను ధ్వంసం చేశారు. బోర్డు చింపి, అద్దాలు పగలగొట్టారు. వందలాదిగా వచ్చిన మహిళా రైతులు రాళ్లతో దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ప్రాణాలు అరచేతులో పెట్టుకుని దూరంగా పరిగెత్తారు. మరి కొంతమంది షాపు వెనుక నుంచి తలుపులు, తాళం పగలగొట్టి గోదాంలోకి జొరబడి యూరియా బస్తాలు ఎత్తుకెళ్లారు. పోలీసులు సైతం ఏమీ చేయలేకపోయారు. చెత్తాచెదారం, టైర్లు తీసుకొచ్చి షాప్‌ ఎదుట వేసి దగ్ధం చేశారు. రైతుల ఆగ్రహం చూసిన అధికారులు ఎవరూ సంఘటనా స్థలానికి రావడానికి సాహసించలేదు. రెండు రోజుల క్రితం మరిపెడ మండల కేంద్రంలో కూడా రైతులు దాడి చేసి పీఏసీఎస్‌ గోదాంలో ఉన్న ఎరువుల బస్తాలు ఎత్తుకెళ్లారు.

    పలు జిల్లాల్లోనూ యూరియా కష్టాలు..
    సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ క్యాంప్‌ కార్యాలయం ఎదుట హుస్నాబాద్‌ హనుమకొండ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. రైతులను పోలీసులు శాంతింపజేయడానికి ప్రయత్నించినా, వారు వెనక్కి తగ్గలేదు. జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో సొసైటీ వద్ద రైతులు బారులు తీరారు. కాటారం మండల కేంద్రంలోని క్రాంతికుమార్‌ ఫర్టిలైజర్‌ దుకాణం వద్ద యూరియా పంపిణీపై ఉద్రిక్తత నెలకొంది. 200 యూరియా బస్తాలు వచ్చినప్పటికీ, స్టాక్‌ లేదని యజమాని చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలంలోని మల్లారెడ్డిపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాము వద్ద తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రైతులు చెప్పులు లైన్‌లో పెట్టి వేచి ఉన్నారు.
    యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో.. రైతులు భువనగిరి – చిట్యాల రోడ్డులోని పీఏసీఎస్‌ కార్యాలయం వద్ద రోడ్డుపై బైటాయించి గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని సహకార సంఘం వద్ద వృద్ధురాలు సొమ్మసిల్లి పడిపోయింది.

    రాత్రి నుంచి క్యూలో..
    కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రైతులు బుధవారం రాత్రి నుంచి క్యూలో ఉండి అక్కడే పడుకున్నారు. ఉదయం టోకెన్లు లభిస్తాయనుకున్న రైతులకు నిరాశే ఎదురైంది. 420 బస్తాల యూరియా ఉంటే.. 1000 మంది రైతులు క్యూలో ఉన్నారు. అధికారులు టోకెన్లు అందించే సమయంలో తోపులాట జరగడంతో నిలిపివేశారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. చివరకు ముఖ్యమంత్రి బందోబస్తులో ఉన్న ఎస్‌ఐ లావణ్య వచ్చి.. రైతులను సముదాయించారు. పోలీసులతోనే టోకెన్లను పంపిణీ చేయించారు. మాచారెడ్డి(దోమకొండ) మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం వద్ద, పాల్వంచ మండలంలోని, ఎల్పుగొండ గ్రామంలోని గోదాం వద్ద గురువారం పంపిణీ చేశారు.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad