– అక్షర దీపం వెలిగించిన ఆశావహ నాయకుడు
– పాఠశాలకు తన ఐదు సంవత్సరాల వేతనం విరాళం
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన యువ సర్పంచ్ రిక్కల అరుణ్ రెడ్డి తొలి అడుగులోనే తన సేవా గుణాన్ని చాటుకున్నారు. సాధారణంగా పదవి రాగానే చాలామంది అధికారం గురించి ఆలోచిస్తారు. కానీ యువ సర్పంచ్ అరుణ్ రెడ్డి మాత్రం తన ఊరి భవిష్యత్తు గురించి ఆలోచించాడు.సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేసిన రోజే అందరినీ ఆశ్చర్యానికి, అంతకు మించి ఆనందానికి గురిచేసే ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు.నా ఐదేళ్ల జీతం…నా ఊరి పిల్లల చదువుల కోసం అంటూ తాను వచ్చే ఐదు సంవత్సరాల పాటు పొందే వేతనాన్ని స్థానిక ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కేటాయిస్తూ సంతకం చేశారు.
పాఠశాల విద్యార్థుల్లో వెలుగు నింపే నిర్ణయం..
యువ సర్పంచ్ అరుణ్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఒక గొప్ప ఆశయం ఉంది. శిథిలావస్థలో ఉన్న పాఠశాల గోడలు, సరిగ్గా లేని మౌలిక వసతులు రేపటి తరాన్ని వెనక్కి నెట్టకూడదని ఆయన తపించారు. ఏ పల్లెలో అయితే తను చదువుకున్నారో, అదే పల్లెలోని బడిని ఒక దేవాలయంగా తీర్చిదిద్దాలని సంకల్పించారు.సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి తోడ్పడాలన్న గురజాడ మాటలను ఆయన అక్షరాలా నిజం చేశారు.ఆ పసిపిల్లల కళ్లలో మెరిసే విద్యా కుసుమాలకు ఆయన త్యాగమే మొదటి మెట్టు కానుంది.పల్లె సీమల్లో ఇలాంటి మార్పు కోరుకునే మరెందరో యువతకు ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత నిలిచారు.పదవి అంటే భోగం కాదు, అదొక బాధ్యత అని నిరూపించిన ఈ యువ నాయకుడి చొరవ నిజంగా అభినందనీయం.నిజమైన నాయకత్వానికి నిలువుటద్దంగా కోనాపూర్ యువ సర్పంచ్ రిక్కల అరుణ్ రెడ్డి నిలిచారు. ఆయన నిర్ణయాన్ని గ్రామస్తులతో పాటు మండల ప్రజలు కొనియాడుతున్నారు.
తొలి అడుగులోనే సేవాగుణాన్ని చాటుకున్న యువ సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



