నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జీతూ పట్వారీ ఇంట్లో దుండగులు దొంగతనానికి ప్రయత్నించారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఐదుగురు ముసుగులు ధరించిన వ్యక్తులు ఇండోర్‌లోని పట్వారీ నివాసంలోకి చొరబడ్డారు. చోరీకి సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఆయన కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించినట్టు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.
ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. జీతూ పట్వారీ భద్రత విషయంలో డాక్టర్ మోహన్ యాదవ్ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలని కాంగ్రెస్ సూచించింది. ఆయనకు తక్షణమే పటిష్టమైన భద్రత కల్పించాలని, ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది.