అసమానతలు లేని సమాజం కోసం అమరులయ్యారు
ప్రజల హృదయాల్లో సదా చిరస్మరణీయులు
సమస్యల పరిష్కారానికి ఎర్రజెండానే మార్గం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
బాణాపురంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, అమరవీరుల విగ్రహావిష్కరణ
నవతెలంగాణ-ముదిగొండ
సామాజిక అసమానతలు లేని, దోపిడీ రహిత సమాజం కోసం ఎంతోమంది పని చేసి అమరులయ్యారని, వారి త్యాగం వెలకట్టలేనిదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురంలో సీపీఐ(ఎం) గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ సీనియర్ నేతలు, అమరవీరులు బాజీ హనుమంతు, గండ్లూరి కిషన్ రావు, మొక్క చిన్న నరసయ్య విగ్రహాలను పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌తో కలిసి సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గండ్లూరి ఫంక్షన్ హాల్‌లో పార్టీ మండల నాయకులు పండ్రకొల రాంబాబు అధ్యక్షతన జరిగిన సభలో జాన్‌వెస్లీ మాట్లాడారు. 50 సంవత్సరాల కిందట గ్రామాల్లో మనిషికి, మనిషికి మధ్య కొనసాగిన వ్యత్యాసాలను, వర్ణ, వర్గ విభేదాలను రూపుమా పేందుకు వ్యవసాయ కార్మికులు, కూలీలు, అట్టడుగు వర్గాల అభ్యున్నతి, సంక్షేమం కోసం తపించిన నాయకులు సదా చిరస్మరణీయులు అని జాన్‌వెస్లీ చెప్పారు.
అమరుల ఆశయాన్ని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన చేస్తోందని చెప్పారు. ప్రధాని మోడీ పెట్టుబడుదారులకు కొమ్ము కాస్తూ, దేశ సంపదను లూటీ చేస్తున్నారని విమర్శించారు. ఈనెల 12న చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో, రాష్ట్రంలో ఉన్న 90 శాతం మంది శ్రమజీవుల కోసం ఎర్రజెండా పోరాడుతుందన్నారు. పేదరికం, అణచివేత ఉన్నంతవరకు ప్రజా ఉద్యమాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. కేరళ రాష్ట్రంలో సీపీఐ(ఎం) పాలనలో ఇండ్లు, ఉపాధి, వైద్యం, విద్య ఉచితంగా ప్రజలకు అందిస్తూ ప్రజాపాలన కొనసాగుతోం దన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎర్రజెండే మార్గమని జాన్‌వెస్లీ చెప్పారు.
రాష్ట్రానికే వన్నె తెచ్చిన బాణాపురం వీరులు : పోతినేని
బాణాపురం వీరులు.. గ్రామ, మండల, జిల్లా కాదు, రాష్ట్రస్థాయిలో సీపీఐ(ఎం)కి వన్నెతెచ్చిన మహనీయులని వారి సేవలను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ కొనియాడారు. 50 ఏండ్ల క్రితం అంటే రెండు తరాల వీరులను స్మరించుకుంటున్నామంటే, వారి ఆశయాలు భవిష్యత్తుకు బాటలు వేస్తాయన్నారు. ‘భూమి పంచాలి, కూలి పెంచాలి’ అనే పోరాటాలను కొనసాగించి, విజయాలను సాధించి, కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో ముదిగొండ పోరాటాల కొండగా నిలిచిందని తెలిపారు.
కమ్యూనిస్టుగా జీవించాలంటే ఎంతో ధైర్యం, తెగింపు కావాలన్నారు. ఎర్రజెండా ఔన్నత్యాన్ని చాటిచెప్పిన యోధుల స్ఫూర్తితో మరింత పనిచేయాలని పార్టీ శ్రేణులకు పోతినేని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేశ్, మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వర్లు, మన్నేపల్లి సుబ్బారావు, ఐద్వా జాతీయ కమిటీ సభ్యురాలు బండి పద్మ పాల్గొన్నారు.


