Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeమానవిశ్ర‌మే వీరి ఆయుధం

శ్ర‌మే వీరి ఆయుధం

- Advertisement -

శ్రమను నమ్ముకున్న వారికి ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇక ఆ స్థానంలో ఉంది మహిళైతే… వారి మనోధైర్యం మాటట్లో చెప్పలేనిది. చేస్తున్న పని ఏదైనా, కష్టం ఎంతున్నా కుటుంబం కోసం ముందుకే సాగిపోతారు. చదువున్నా లేకపోయినా తమలో దాగివున్న ప్రతిభతో బతుకుసాగించే మహిళలు మన చుట్టూ ఎందరో ఉంటారు. అలాంటి వారే ఈ ముగ్గురు. గౌరవంగా బతకాలంటే డిగ్రీలే ఉండాల్సిన అవసరం లేదని నిరూపిస్తూ శ్రమనే నమ్ముకొని ఈ మహానగరంలో జీవనం సాగిస్తున్న ఆ మహిళల సంక్షిప్త పరిచయాలు నేటి మానవిలో…


చెప్పులు కుట్టే హీరాబాయి
చెప్పులషాపు నడుపుతూ తృప్తిగా జీవితం గడుపుతున్నారు నాంధారి హీరాబాయి. మోర్చీ కులంలో పుట్టిన హీరాబాయి తన కులవృత్తినే నమ్ముతున్నారు. కర్నాటకాకు చెందిన వీరు ఇంట్లో మరాఠీ మాట్లాడతారు. హీరాబాయి అమ్మనాన్నలకు నలుగురు సంతానం. తల్లిదండ్రులు కూడా చెప్పులుకుట్టేవారు. హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌ కాలనీలోని ప్రభుత్వ బడిలో తెలుగు మీడియంలో తొమ్మిదో తరగతి పూర్తికాగానే బంధువుల అబ్బాయి విశ్వనీథ్‌తో హీరా పెండ్లి జరిగింది. 21 వేల కట్నం, ఓ తులం బంగారం పెట్టారు పుట్టింటివారు. భర్త ఐదవ తరగతి వరకే చదివాడు. భరత్‌నగర్‌లో మామగారు 40 ఏండ్ల కిందట చెప్పులషాపు పెట్టుకొని కష్టపడి మూడు అంతస్థుల బిల్డింగ్‌ కట్టించాడు. అందులో అత్త, మరుదులు వారి కుటుంబాలతో కలిసి ఉంటున్నారు ఈ దంపతులు. ఇద్దరూ ఉదయం 10 నుంచి సాయంత్రం ఎనిమిది వరకు షాపులో కూర్చుని చెప్పులు, రెయిన్‌ కోట్‌ రిపేర్లు, బ్యాగ్‌లకి జిప్‌ వేయటం వంటి పనులు చేస్తారు. రోజూ 200 రూపాయల వరకు సంపాదిస్తారు. బేగంబజారునుంచి 20-30 వేలు పెట్టుబడి పెట్టి భర్త కొత్త సరుకు తెస్తాడు. రోడ్‌ పక్కన ఉన్న చిన్న దుకాణంలో ఇద్దరూ కూర్చుంటారు. మామ చనిపోయాక 13 ఏండ్ల నుండి వీళ్లే ఆ షాపు నడిపిస్తున్నారు. వీరు ఇద్దరు కూతుళ్లకు పెండ్లి చేశారు. కొడుక్కి చదువబ్బలేదు. ‘మాట వినడు ఏంచేయాలమ్మా! తల్లిగా తిండి పెట్టి మంచిగా చెప్పినా వినడు’ ఆమె కళ్ళల్లో బాధ! ‘మా కులవృత్తినే నమ్ముకున్నాము’ అంటున్న హీరాబాయి మాటల్లో ధైర్యం, ఆత్మ విశ్వాసం తొణికిసలాడింది. అత్తగారిని వాళ్లే చూసుకుంటున్నారు. ‘పెద్ద కోడలిగా ఆమె బాధ్యత మాదే’ అంటుంది ఆమె. హీరాబాయికి పాటలంటే ఇష్టం. చదువులో పాస్‌ మార్కులు వచ్చినా పాటల పోటీల్లో మాత్రం చాలా బహుతులు అందుకున్నారు ఈ డైమండ్‌ లేడీ.

కర్రీ పాయింట్‌ హేమలత
నల్లా హేమలత, తన భర్త పరశురాంతో కలిసి భరత్‌నగర్‌లో తొలుత చిల్లర దుకాణం నడిపేవారు. అందులోనే ఇప్పుడు కర్రీపాయింట్‌ కూడా నడుపుతున్నారు. దానిపై వచ్చే ఆదాయంతోనే పిల్లల్ని పెద్ద చదువులు చదివిస్తున్నారు. వారి పెద్దబ్బాయి పంజాబ్‌లో బి.టెక్‌ చేశాడు. రెండో కొడుకు డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ప్రస్తుతం అమ్మానాన్నలకు సాయం చేస్తున్నాడు. హేమలత కలకత్తాలో పుట్టిపెరిగారు. తాత ముత్తాతలు సోంపేట నుంచి కలకత్తావెళ్లి స్థిరపడ్డారు. ఇత్తడి కంచుపాత్రలు అమ్మేవారు. ఈమె తండ్రి దాల్మియా ఫ్యాక్టరీలో పనిచేసేవారు. వీరి కుటుంబాలు కలకత్తాలోని టిటాఘర్‌లో ఉన్న ఆంధ్ర విద్యాలయంలో పిల్లల్ని చదివించారు. చదువు తెలుగు మీడియంలోనే. కానీ బెంగాలీ, హిందీ భాషలు చదవాలి.
తొమ్మిదో తరగతి వరకు అక్కడ చదివిన హేమలత రాజాంలోని పెద్దనాన్న దగ్గర టెన్త్‌ పూర్తి చేశారు. పరశురాంతో పెండ్లి తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఓపెన్‌ యూనివర్శిటీలో బి.కాం. చదివారు. అప్పట్లో భర్త బట్టల షాపులో పనిచేసేవారు. తర్వాత కిరాణాషాపు పెట్టి భార్య భర్తలు పాలు, పెరుగు కూడా అమ్మేవారు. ఆ రోజుల్లో ఒక చపాతీ రెండు రూపాయలు. నేడు 12 రూపాయాలు. కస్టమర్స్‌ కోరిక ప్రకారం వేడివేడిగా చేసి ఇస్తారు. క్రమంగా కర్రీపాయింట్‌ పెట్టి రోజూ అన్నం, పప్పు, సాంబార్‌, రసం, చట్నీతో పాటు రెండు గ్రేవీ కర్రీలు, రెండు ఫ్రైలు తయారుచేస్తారు. 70 రూపాయలకి అన్నం, రెండు కూరలిస్తారు. గిన్నెలు తలమానికం ఒకామెను పెట్టుకున్నారు. లంచ్‌ టైం12 నుంచి 2 వరకు ప్యాక్‌ చేసి ఇస్తారు. షాపు, ఇంటి అద్దెలు 20 వేలుపోను రోజుకు వెయ్యి రూపాయాలు మిగులుతాయి. వీరి కులవృత్తి నేత పని అయినా కాలాన్ని బట్టి ఇంటిపని ముగిశాక భర్తతో పాటు మధ్యాహ్నం మూడు వరకు షాపులోనే ఉంటారామె. కుటుంబం హైదరాబాద్‌ చేరాక ఆమె తండ్రి ఆటో నడిపారు. ఒక అన్న ఉన్నాడు. ఇక అత్తగారింట ఇద్దరు ఆడపడుచులు, బావ మరిది ఉన్నారు. వారిని చూడటానికి అప్పుడప్పుడు కోల్‌కతా వెళుతుంటారు. కోల్‌కతాలోని ఆంధ్ర విద్యాలయం ఇప్పటికీ అద్భుతంగా నడుస్తోందని. 26 జనవరిన త్యాగరాజ ఉత్సవాలు ఘనంగా జరుపుతారని ఆమె చెప్పారు. ఇక సొంత ఇల్లు కట్టుకోవాలనేది హేమలత కల. ఈమె పాటలు కూడా బాగా పాడతారు.

కూరలమ్మే పుష్పమ్మ
పుష్పమ్మ, నర్సింహా… వీరిద్దరినీ చూస్తే ఎవరికైనా మహాముచ్చటగా వుంటుంది. తెల్లారుఝామున రెండున్నరకల్లా భరత్‌నగర్‌ కూరగాయల మార్కెట్‌కి వచ్చి మధ్యాహ్న రెండు గంటలకు ఇంటికి వెళతారు. చిరునవ్వులతో మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌లా కనిపిస్తారు. అతని పేరు కుర్వ నర్సింహ, 51 ఏండ్లు ఉంటాయి. వీరి దగ్గర కొనేవాళ్లు ప్రత్యేకంగా బేరం చేయా ల్సిన అవసరం లేదు. రోజూ కొనేవారికి తగ్గించి ఇస్తారు. వద్దు అన్నా కూడా ‘తీసుకో అమ్మ’ అని కొసరు వేస్తారు.
మైల్వారం(తాండూర్‌)లో 12 ఏండ్ల వయసులో పుష్పమ్మకు 14 ఏండ్ల నర్సింహతో పెండ్లి జరిగింది. ఆమెకి ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లి. తల్లి కూలీపని చేస్తే తండ్రి మేకలు కాసేవాడు. ఓ ఎకరం పొలంలో పెసలు, కందులు పండించేవారు. తల్లి ప్రోత్సాహంతో పుష్ప రెండవ క్లాసు వరకు చదివింది. మసీదులో తెలుగుసార్‌ 20 మంది పిల్లలకు పాటలు, పద్యాలు, ఎక్కాలు, పెద్ద బాలశిక్ష నేర్పారు. అప్పుడు నేర్చుకున్నవి ఆమె ఇప్పటికీ అలవోకగా నాకు చెప్పివినిపించింది. ‘మా నాయనకు అంత తెలివిలేదు, మాయమ్మ మంచి చురుకు’ అంటున్న పుష్పమ్మలో మంచి సుగుణాలు ఎన్నో ఉన్నాయి. టకటకా వివరాలు ఆగకుండా చెప్పింది.
ఈమె 15వ ఏట పెద్ద కూతురు, 18వ ఏట కొడుకు, 20వ ఏట రెండో కూతురు, 22వ ఏట మూడవ కూతురు పుట్టారు. సంసారసాగరం ఈదుతూ పిల్లల్ని చదివించింది. పెద్దమ్మాయికి పెండ్లయి పిల్లలున్నారు. రెండవ కూతురు, కొడుకు బి.టెక్‌ చదివి జాబ్స్‌ చేస్తున్నారు. మూడవ కూతురు సి.ఎ.చదువుతోంది. కొంత అప్పుచేసి సొంత ఊరిలో ఇల్లు కట్టుకున్నారు. ఆ అప్పు తీర్చటంకోసం హైదరాబాద్‌ వచ్చి అజిత్‌నగర్‌లో ఉంటున్నారు. ఒకప్పుడు వీరు శ్రీసునీల్‌ కపూర్‌ అనే ఆయన కోళ్లఫారంలో తెల్లారి నాలుగ్గంటల నుండి సాయంత్రం వరకు పని చేసేవారు. ఆయన వీరి పిల్లల్ని ప్రైవేట్‌ బడిలో చదివించి ఖర్చు భరించటమేగాక 1200 రూపాయాలు జీతం, దీపావళికి ఇంటిల్లిపాదికి కొత్త బట్టలు ఇచ్చేవారంట. ఆయన్ని ఈ దంపతులు ఇప్పటికీ తల్చుకుంటారు. పచ్చిబాలింతగా కోళ్లఫాంలో పనిచేయటంతో అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఇక లాభంలేదని ఎల్లమ్మ బండలో ఇల్లుచూసుకుని నర్సింహ్మ కూరగాయల మూటలు మోస్తే రోజూ 500 వచ్చేవి. పుష్పమ్మ పది ఇళ్లల్లో పని చేసి10 వేలు సంపాదించి కుటుంబాన్ని నడిపేది. హోల్‌సేల్‌గా కూరలు అమ్మితే ఖర్చులు పోను రోజుకి 5 నుండి 6 వందలు మిగిలేవి. ఆ డబ్బుతోనే పిల్లల్ని బాగా చదివించారు.

– – అచ్యుతుని రాజ్యశ్రీ

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad