నవతెలంగాణ – మునిపల్లి
అతడు ఒక సామాన్య పారిశుధ్య కార్మికుడు. గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా ట్రాక్టర్ ను నడుపుతూ అదే గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా ఎంపికై ఔరా అనిపించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. మునిపల్లి మండలంలోని తాటిపల్లి గ్రామం రాజకీయాలకు కేంద్ర బిందువు. దశాబ్దాల నుండి ఏ పార్టీకైనా ప్రధాన పట్టుకొమ్మల్లాంటి ప్రణాళికలు ఇక్కడి నుండే జరుగుతాయి. గ్రామంలో ఎంతో పేరు మోసిన నిష్ణాతులైన రాజకీయ అనుభవం, చతురత కలిగిన నేతలు ఉన్నారు. అయితే ఆ గ్రామానికి ఎస్సీ జనరల్ రిజర్వేషన్ రావడంతో ఓ ట్రాక్టర్ డ్రైవర్ కు సర్పంచ్ గా ఎన్నికయ్యే అవకాశం లభించింది.
గ్రామపంచాయతీలో ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న గజ్జాడ రాములు కాంగ్రెస్ పార్టీ తరపున బలిలో నిలిచి 723 ఓట్లు సాధించి విజయ బావుటా ఎగురవేశారు. సమీప భారాస అభ్యర్థికి 608 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి రాములు కు 723 ఓట్లు వచ్చాయి. ఇరు పార్టీల్లో ప్రధాన కీలక భూమిక పోషించే గ్రామంలో ఒక సామాన్యుడు గ్రామ ప్రథమ పౌరుడిగా ఎంపిక కావడం ఆసక్తికరంగా నిలిచింది.



