వారిలోనూ చాలా మందికి అరకొర ఆదాయమే
స్వయం ఉపాధి పొందుతున్న వారే ఎక్కువ
న్యూఢిల్లీ : ఉద్యోగం అంటే మంచి జీతం ఉంటుందని, జీవితానికి భద్రత ఉంటుందని, పనిలో నైపుణ్యం ఉంటుందని అనుకోవడం సహజమే. కానీ మన దేశంలోని ఉద్యోగుల్లో చాలా మందికి స్థిరమైన వేతనాలు లభించడం లేదు. అరకొర ఆదాయంతో దినదిన గండంగా వారు జీవితాలను నెట్టుకొస్తున్నారు. స్థిరమైన ఆదాయంతో ఉద్యోగాలు చేస్తున్న వారి సంఖ్య మన దేశంలో కేవలం 23 శాతం మాత్రమే. మెజారిటీ శ్రామికులు రోజువారీ వేతనాలతోనూ లేదా కాంట్రాక్ట్ పనులతోనూ పొట్ట పోసుకుంటున్నారు. అనేక దేశాల్లో దీనికి భిన్నమైన పరిస్థితి కన్పిస్తోంది. ప్రపంచ శ్రామికుల్లో సగం మందికి స్థిరమైన ఉపాధి లభిస్తోందని గణాంకాలు చెబుతున్నాయి.
పట్టణ ప్రాంతాలకే పరిమితం
అభివృద్ధి చెందుతున్న అనేక మార్కెట్ ఆర్థిక వ్యవస్థల జాతీయ శ్రామిక శక్తిలో స్థిరమైన వేతనాలు పొందుతున్న వారి వాటా మన దేశంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. మన దేశానికి వచ్చే సరికి హర్యానా, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర వంటి సంపన్న రాష్ట్రాలలోనే స్థిరమైన ఉద్యోగాలు ఎక్కువగా లభిస్తున్నాయి. దేశంలో స్థిరమైన వేతనాలతో ఉద్యోగాలు చేస్తున్న వారి సంఖ్య ఓ మాదిరిగా పెరుగుతూ వస్తోంది. 2005-2018 మధ్యకాలంలో ఈ సంఖ్యలో గణనీయమైన మార్పు కన్పించినప్పటికీ ఆ తర్వాత పెద్దగా వృద్ధి నమోదు కాలేదు. దేశంలో స్థిరమైన ఉద్యోగాలు చేస్తున్న వారు ఎక్కువగా పట్టణ ప్రాంతాలలోనే కన్పి స్తుంటారు. గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా వ్యవసాయం చేసే వారే యజ మానులుగా ఉంటారు. వీరి వద్ద పనిచేసే శ్రామికులకు స్థిరమైన వేతనాలు ఉండవు.
ఐదుగురిలో ఒకరికే…
మొత్తంగా చూస్తే దేశంలోని ప్రతి ఐదుగురు శ్రామికుల్లో ఒకరికి మాత్రమే (13 కోట్ల మందికి) సంవత్సరం పొడవునా పని దొరుకుతోంది. తద్వారా స్థిరమైన వేతనాలు లభిస్తున్నాయి. ప్రతి ఐదుగురిలో ముగ్గురు (సుమారుగా 35 కోట్ల మంది) స్వయం ఉపాధి పొందుతున్నారు. వీరి ఆదాయం స్థిరంగా ఉండదు. పైగా వీరిలో 12 కోట్ల మంది జీతం భత్యం లేకుండా ఇంటి పని చేస్తున్న వారే. ఇక మిగిలిన ఐదో వంతు మంది (12 కోట్ల మంది) దినసరి కార్మికులుగా పనిచేస్తున్నారు.
మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే స్థిరమైన వేతనాలు పొందుతున్న వారి సంఖ్య కొంత ఎక్కువగా ఉంది. ప్రతి నలుగురిలో ఒకరికి స్థిరమైన వేతనాలు దక్కుతున్నాయి. అదే మహిళల విషయానికి వస్తే ప్రతి ఆరుగురిలో ఒకరికి మాత్రమే నెలవారీ జీతాలు లభిస్తున్నాయి. బాగా చదువుకున్న వారికి స్థిరమైన వేతనాలు లభించడం సహజమే. కేవలం 12వ తరగతి (ఇంటర్మీడియట్) వరకూ చదువుకున్న వారిలో 28 శాతం మందికి మాత్రమే స్థిరమైన ఆదాయాలు లభిస్తుండగా డిగ్రీ, పీజీ చేసిన వారిలో 57 శాతం మందికి మంచి ఉద్యోగాలు దక్కుతున్నాయి.
సేవల రంగంలోనే అధికం
దేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా మూడు రంగాలు…వ్యవసాయం, పరిశ్రమ, సేవలుగా విభజితమైంది. వీటిలో సేవల రంగం మాత్రమే శ్రామికులకు స్థిరమైన వేతనాలు కల్పిస్తోంది. తయారీ రంగాలలో దినసరి కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక వ్యవసాయ రంగం విషయానికి వస్తే అందులో స్వయం ఉపాధి పొందుతున్న వారు, ప్రతిఫలం తీసుకోకుండా పని చేస్తున్న వారు (ముఖ్యంగా మహిళలు) ఎక్కువగా కన్పిస్తుంటారు. సేవల రంగంలో విద్య, వాణిజ్యం, రవాణా విభాగాలలో స్థిరమైన ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయి. తయారీ రంగంలో అలాంటి ఉద్యోగాలు వస్త్రాలు, దుస్తులు, ఆహార యూనిట్లలో ఉంటాయి.
ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమేమంటే స్థిరమైన ఉద్యోగాలు చేస్తున్న వారిలో ఎక్కువ మంది నిపుణులు కారు. మన దేశంలో నెలవారీ జీతాలు తీసుకుంటూ పని చేస్తున్న వారిలో అత్య ధికులు రిటైల్ షాపుల్లో అమ్మకం పనులు చేసే వారే. దేశంలో నెలవారీ జీతాలు తీసుకుంటున్న వారిలో ఏడు శాతం మంది ఇలా దుకాణాలు, షాపుల్లో పనిచేస్తున్న వారే. అంటే కిరాణా షాపులు, మందుల షాపులు, బట్టల షాపులు అన్న మాట. ఇళ్లు, కార్యాలయాలు, ఆస్పత్రులు, హోటళ్లలో పని చేస్తున్న వారు కూడా ఈ కోవలోకే వస్తారు. స్థిరమైన వేతనాలు పొందుతున్న వారిలో ఆరు శాతం మంది ఇలా పనిచేస్తూ జీవితాలు నెట్టుకొస్తున్నారు.
ఆదాయం పడిపోయింది
నెలవారీగా జీతాలు పొందుతున్న వారిలో ఏడు శాతానికి పైగా ప్రాథమిక, సెకండరీ పాఠశాలల్లో, కళాశాలల్లో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఓ సర్వే ప్రకారం 2024లో స్థిరమైన వేతనాలు పొందుతున్న వారికి సగటున నెలకు రూ.21,000 వేతనం లభించగా స్వయం ఉపాధి పొందుతున్న వారికి రూ.13,200, దినసరి కార్మికులకు నెలకు రూ.9,000 ఆదాయం వచ్చింది. దేశంలో 2012-2024 మధ్యకాలంలో నెలసరి సగటు జీతం 90 శాతం మేర పెరిగినప్పటికీ ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేస్తే సగటు ఆదాయం నాలుగు శాతం పడిపోయింది. అధిక నైపుణ్యం కలిగిన, ఎక్కువ ఆదాయం పొందుతున్న ఉద్యోగుల వాస్తవ వేతనాలు తగ్గడం గమనార్హం.



