Saturday, April 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయండ్రంక్‌ డ్రైవ్‌ కేసుల్లో వాహనాల సీజ్‌పై పరిమితులున్నాయి : హైకోర్టు

డ్రంక్‌ డ్రైవ్‌ కేసుల్లో వాహనాల సీజ్‌పై పరిమితులున్నాయి : హైకోర్టు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో కేవలం మద్యం సేవించి వాహనం నడిపిన కారణంతోనే వాహనాలను మోటారు వాహనాల చట్టం ప్రకారం సీజ్‌ చేయడానికి పోలీసులకు అధికారం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. వాహనాల సీజ్‌ చేసేప్పుడు పరిమితులు ఉన్నాయని చెప్పింది. ఈ మేరకు జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌ ఇచ్చిన ఉత్తర్వుల్లో, వాహనానికి సంబంధించిన అవసరమైన పత్రాలు సమర్పించినపుడు సీజ్‌ చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఇదే సమయంలో డ్రైవర్‌ మద్యం సేవించినట్టు నిర్ధారణ అయితే అతడిని వాహనం నడపనివ్వకూడదని స్పష్టం చేశారు. అటువంటి సందర్భంలో వాహనంలో ఉన్న మరొకరు మద్యం సేవించకుండా ఉండి, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉంటే, వాహనాన్ని సీజ్‌ చేయకుండా అతనికి అప్పగించాలని సూచించారు. మరో వ్యక్తి అందుబాటులో లేని పరిస్థితిలో డ్రైవర్‌ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు సమాచారం ఇచ్చి వాహనాన్ని తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నా, యజమాని లేదా అధికృత వ్యక్తి ఆర్సీ, గుర్తింపు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ చూపిన వెంటనే వాహనాన్ని తిరిగి అప్పగించాలని ఆదేశించారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో చట్టపరమైన విధానాలను పోలీసులు కచ్చితంగా అనుసరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడిపిన కేసుల్లో నిందితులను అరెస్టు చేయాల్సి వస్తే మూడు రోజుల లోపు చార్జిషీట్‌ దాఖలు చేయాలని ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -