Tuesday, October 7, 2025
E-PAPER
Homeజాతీయంస్థానికులకు ఉద్యోగాలు లేవు

స్థానికులకు ఉద్యోగాలు లేవు

- Advertisement -

పాలనపై పెత్తనమంతా బయటి వారిదే
లడఖ్‌లో పరిస్థితిపై నిజ నిర్ధారణ కమిటీ నివేదిక
శ్రీనగర్‌ :
లడఖ్‌లో ప్రాంతంలో స్థానిక యువతకు ఉద్యోగాలు లభించడం లేదు. పరిపాలనపై బయటి వారే పెత్తనం చెలాయిస్తున్నారు. నేషనల్‌ అలయన్స్‌ ఆఫ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్స్‌, హమ్‌ భారత్‌ కీ లాగ్‌, సోషలిస్ట్‌ పార్టీ (ఇండియా)తో కూడిన ప్రతినిధి బృందం గత నెల 10-14 తేదీల మధ్య శ్రీనగర్‌, కార్గిల్‌, లెహ్‌లో పర్యటించి రాజకీయ, మత నేతలతో సమావేశమైంది. తన పర్యటనకు సంబంధించి నిజ నిర్ధారణ నివేదికను రూపొందించింది. 2019లో లడఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతం అయింది. ఇప్పటి నుంచి నేటి వరకూ గెజిటెడ్‌ పోస్టుల్లో నియామకాలే జరగలేదు. యూనివర్సిటీ ఆఫ్‌ లడఖ్‌లో 80 కాంట్రాక్ట్‌ లెక్చరర్‌ పోస్టులు ఉండగా వాటిలో 78 పోస్టుల్ని బయటి వారితోనే నింపేశారని నివేదిక తెలిపింది.

‘అధికార యంత్రాంగంలో ఉన్నత పదవులన్నీ బయటి వారికే ఇచ్చారు. తమకు ఈ పోస్టింగులు శిక్షగా వారు భావిస్తుంటారు. లడఖ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటును గురించి చర్చించే వారే లేరు. పరిపాలనా పరంగా న్యాయం జరగాలన్నా, సొంతగా నిర్ణయాలు తీసుకోవాలన్నా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటు తప్పనిసరి’ అని నివేదిక చెప్పింది. లడఖ్‌లో ఆరు సంవత్సరాలుగా గెజిటెడ్‌ పోస్టులలో నియామకాలు జరపకపోవడాన్ని చూస్తుంటే స్థానికులను ఓ పద్ధతి ప్రకారం పక్కన పెడుతున్నారని అర్థమవుతోందని విమర్శించింది.
లడఖ్‌కు సొంతంగా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని పర్యావరణ కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌, లెహ్‌ అపెక్స్‌ బాడీ, కార్గిల్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌ కూడా డిమాండ్‌ చేస్తున్నాయి. అర్హత కలిగిన స్థానిక పీహెచ్‌డీ అధ్యాపకులు ఉన్నప్పటికీ కాంట్రాక్ట్‌ పోస్టులను బయటి వారితో నింపడం స్థానికులను చిన్నచూపు చూస్తున్నారనడానికి మరో ఉదాహరణ అని నివేదిక ఎత్తిచూపింది. లడఖ్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని, ఆరో షెడ్యూల్‌ ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్‌ చేసింది. ఇది కేవలం రాజకీయ ఆకాంక్ష మాత్రమే కాదని, రాజకీయ మనుగడకు అవసరమని నివేదిక తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -