ఖమ్మంలో బీఆర్‌ఎస్ సర్పంచుల ఆత్మీయ సన్మాన సభ
కేసీఆర్.. ఆ తర్వాత కేటీఆరే సీఎం : మాజీ మంత్రి అజయ్
ప్రాజెక్టులు కట్టలేని దద్దమ్మ ప్రభుత్వం
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా యూరియా దొరకడం లేదు
కేసీఆర్ చేసిన అప్పు.. తెలంగాణ భవిష్యత్ కోసమే : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ -ఖమ్మం
కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రాజెక్టులు కట్టలేని దద్దమ్మ ప్రభుత్వం నడుస్తున్నదని, పైనున్న పెద్దలకు నెలకు రూ.100 కోట్లు ఇక్కడి నాయకులు కప్పం కడితేనే పదవులు భద్రమని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటినా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రు లున్నా యూరియా దొరకని దుస్థితి నెలకున్నదని అన్నారు. బుధవారం ఖమ్మంలోని తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధ్యక్షతన నూతన సర్పంచుల ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఓటమికి రంగం సిద్దమైందని, క్వార్టర్ ఫైనలైన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు మంచి ఫలితాలే వచ్చాయని, సెమీ ఫైనలైన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలే వస్తాయని, ఫైనల్లో మాత్రం ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఏడు నుంచి ఎనిమిది స్థానాలు గెలుచుకొని మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడని సీఎం దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ మధ్య పార్లమెంట్ లో ఓ బీజేపీ ఎంపీ కేసీఆర్ ఎంత అప్పు చేశాడని పార్లమెంట్ వేదికగా అడిగారని.. కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి అంటే 2014 నాటికి రూ.72 వేల కోట్లు అని, పదవి దిగిపోయేనాటికి అంటే 2023 నాటికి రూ.3.50 లక్షల కోట్లని కేంద్రమే సమాధానం ఇచ్చిందన్నారు. పార్లమెంట్ సాక్షిగా వాస్తవం బయటపడిందన్నారు. సంక్షేమం, అభివృద్ధి పథకాల కోసం, తెలంగాణ భవిష్యత్ కోసమే కేసీఆర్ పెట్టుబడి పెట్టారని తెలిపారు.
మా నాన్ననంటే ఊరుకుంటానా..
‘తెలంగాణ రాష్ట్రం తెచ్చిన కేసీఆర్‌ను రేవంత్‌రెడ్డి నానా మాటలు అంటుంటే.. కొడుకుగా రగిలిపోతున్నా. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చవయ్యా అంటే.. నీ లాగులో తొండలు దూరుస్తా.. నీ గుడ్లు పీకి గోలీలాడుతా.. నీ పేగులు తీసి మెడకేసుకుంటా” అంటున్నాడని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఆంధ్రాలోని గుంటూరులో చదువుకుంటే తప్పు అన్నాడని, కానీ రేవంత్‌రెడ్డి తన అల్లున్ని అక్కడి నుంచే తెచ్చుకున్నాడు కదా ఇదెక్కడి నీతి అని ప్రశ్నించాడు.
రాజ్యాంగం ప్రకారం నిధులు..
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నిధులన్నీ పంచాయతీలకు వస్తాయని, బీఆర్‌ఎస్ తరపున గెలిచిన సర్పంచులు ఎక్కడా రాజీ పడొద్దని కేటీఆర్ సూచించారు. ఖమ్మం జిల్లాలో నిధులు ఇవ్వబోమని కాంగ్రెస్ నాయకులు, మంత్రులు బెదిరించినా భయపడొద్దని చెప్పారు.
గ్యారంటీ కార్డు ఎక్కడ పెట్టుకోవాలి..
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గ్యారంటీ కార్డులను భద్రంగా పెట్టుకోవాలని, వంద రోజుల్లోనే ఇందులో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. రెండేండ్లయినా హామీలు అమలు కాలేదు కదా.. ఇప్పుడు ఈ కార్డుల ఎక్కడ పెట్టుకోవాలో భట్టి విక్రమార్కే చెప్పాలని ఎద్దేవా చేశారు.
కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరే.. : పువ్వాడ అజయ్ కుమార్
వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆరే అవుతారని, ఆ తర్వాత కేటీఆరే తప్పకుండా ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులున్నా జిల్లాకు చేసింది ఏమీ లేదని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ముగ్గురు మంత్రులు తన అభ్యర్థులను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని, మంత్రి పదవులు శాశ్వతం కాదని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాళ ఉపేందర్ రెడ్డి, హరిప్రియ నాయక్, మెచ్చా నాగేశ్వరరావు, వనమా వెంకటేశ్వరరావు, చంద్రావతి, తాటి వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీ చైర్మెన్ లింగాల కమల్ రాజు, డీసీసీబీ మాజీ చైర్మెన్ కూరాకుల నాగభూషణం, మాజీ గ్రంథలయ సంస్థ చైర్మెన్లు దిండిగల రాజేందర్, ఖమర్, నగర అధ్యక్షులు పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
సీతారామ.. ఎక్కడికక్కడే..
గోదావరి జలాల మీద పూర్తి హక్కు ఖమ్మం జిల్లాకు దక్కాలని, 7.5 లక్షల ఎకరాలకు సాగునీరందించే విధంగా సీతారామ సాగర్‌ను కేసీఆర్ ప్రభుత్వంలో డిజైన్ చేసి, బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే 90 శాతం పనులు పూర్తి చేశామని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా పనులు ఇంకా అక్కడే ఉన్నాయని విమర్శించారు. కమీషన్ల కోసం మాత్రమే ఇక్కడి మంత్రులు పనిచేస్తున్నారని అన్నారు. షాపుల్లో యూరియా లేకపోతే యాప్‌లలో ఎక్కడి నుంచి వస్తుందని సెటైర్ వేశారు. ఇప్పుడు ఆ యాప్ కూడా పనిచేయకపోవడంతో మరో కొత్త నాటకానికి తెరదీసి యూరియా కార్డు పేరిట మోసం చేస్తున్నారన్నారు. కేసీఆర్ పదేండ్లపాటు పనిచేసిన సమయంలో ఏ యాప్, కార్డు అవసరం పడలేదన్నారు.



