రోడ్డుపై బైటాయించి రాస్తారోకో
ఎల్లారెడ్డిలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినుల ఆందోళన
నవతెలంగాణ-ఎల్లారెడ్డి
‘అన్నంలో పురుగులొస్తున్నరు.. తమ సమస్యను పరిష్కరించాలి’ అని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు సోమవారం ఎల్లారెడ్డి, బాన్సువాడ ప్రధాన రహదారిపై బైటాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ.. అన్నం తినే సమయంలో తరచుగా పురుగులు వస్తున్నాయనీ, ఈ విషయంపై పలుమార్లు ప్రిన్సిపల్‌కు, అధ్యాపకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పని పరిస్థితుల్లో రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైటాయించడంతో ఎల్లారెడ్డి, బాన్సువాడ ప్రధాన రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి తహసీల్దార్ ప్రేమ్ కుమార్ విద్యార్థులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. దాంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.
గిరిజన బాలికల పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్
అన్నంలో పురుగులు వస్తున్నాయంటూ విద్యార్థులు రాస్తారోకో చేయడంతో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్ గిరిజన బాలికల పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని డైనింగ్ హాల్, స్టాక్ రూమ్, వాష్ రూమ్‌లను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను విన్న అదనపు కలెక్టర్ సమస్యలు పరిష్కరిస్తామని హామీనిచ్చారు. సమస్యలు మరోసారి పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు. ఆయన వెంట తహసీల్దార్ ప్రేమ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ మహేష్, ఎంఈఓ రాజు తదితరులు ఉన్నారు.