రేపు కేబినేట్ సమావేశంలో తెలనుందా..
రాజకీయ పార్టీల్లోనూ ఆసక్తి
నవతెలంగాణ – మల్హర్ రావు
గ్రామ పంచాయతీ,మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది.కొత్త పాలకవర్గాలు కూడా కొలువుదీరాయి. ప్రస్తుతం అందరి దృష్టి పరిషత్ ఎన్నికలపై పడింది.అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థలను రద్దు చేయాలని యోచిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది.ఇది రాజకీయ పార్టీలను ఆందోళనకు గురిచేస్తోంది.ఈ క్రమంలో సోమవారం జరిగే రాష్ట్ర కేబినేట్పై అందరి దృష్టి పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రచారం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
రద్దా.. ఎన్నికలా?
ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థలను ప్రభుత్వం రద్దు చేయనుందా లేక ఎన్నికలకు వెళుతుందా అనే దానిపై స్పష్టత రానుంది. ఒకవేళ ఎన్నికలకు వెళితే ఎప్పుడు నోటిఫికేషన్ ప్రకటిస్తారనే దానిపై కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కొన్నేళ్లుగా మండల, జిల్లా పరిషత్లకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విడుదల పూర్తిగా నిలిచిపోయింది. దీంతో గత ఐదేళ్లు పదవీలో ఉన్న జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం లేక నామమాత్రంగా మిగిలిపోయారనే అభిప్రాయం ఉంది.
దీనికి తోడు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు ప్రత్యేక అధికారాలంటూ కూడా ఏమి లేవు. దీంతో ఈ వ్యవస్థ నామక్ వాస్తేగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఈ నేపథ్యంలోనే ఈ వ్యవస్థను రద్దు చేసి పరోక్ష విధానంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలను ఎన్నుకునేలా ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. నేటి సాయంత్రం వరకు ఈ సందిగ్ధతకు తెరపడే అవ కాశమున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయ పార్టీల నేత ల్లకు తీపికబురు అందిస్తారా లేక నిరాశ మిగుల్చు తారా వేచి చూడాల్సిందే.



