Sunday, February 1, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమేడారంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌

మేడారంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌

- Advertisement -

గంటల తరబడి బస్సుల్లోనే.. చివరి రెండ్రోజుల్లో గందరగోళం

నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
మేడారం మహాజాతర చివరి రెండ్రోజుల్లో గందరగోళం నెలకొంది. శుక్ర, శనివారాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో 6-8గంటల పాటు భక్తులు బస్సుల్లోనే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. గురువారం, శుక్రవారం మేడారానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తుల రాకపై పోలీసులు, ఆర్టీసీ అధికారులకు సరైన అంచనా లేకపోవడంతో తిరుగుప్రయాణానికి అవసరమైన బస్సులను అందుబాటులో లేకుండా పోయింది. శుక్రవారం వీవీఐపీల తాకిడి తారాస్థాయిలో ఉండటంతో ఆర్టీసీ బస్టాండ్‌లో ఉన్నా బస్సులు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో ఉన్నతాధికారులు సైతం చేతులు ఎత్తేశారు. శుక్రవారం సాయంత్రం నుంచి మేడారం-తాడ్వాయి మధ్య, తాడ్వాయి-పస్రా మధ్య భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో గంటలపాటు ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

శుక్రవారం రాత్రి 7గంటలకు హనుమకొండ నుంచి మేడారం బయలుదేరిన భక్తులు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు మేడారం చేరుకోకపోవడం గమనార్హం. హనుమకొండలో శుక్రవారం రాత్రి 7గంటలకు బస్సు ఎక్కితే మేడారం చేరేసరికి శనివారం ఉదయం 9గంటలు కావడం అంటే 14గంటలు పట్టడం విస్మయాన్ని కలిగిస్తోంది. శనివారం ఉదయం 4 గంటల అనంతరం ములుగు నుంచి మేడారం వెళ్లే బస్సులు ట్రాఫిక్‌ సమస్యను ఎదుర్కొన్నట్టు ఆర్టీసీ ప్రయాణీకులు తెలిపారు. మూడు, నాలుగు ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్‌ సమస్య తీవ్రమవుతుండటంతో తాడ్వాయి నుంచి మేడారానికి వెళ్లే భక్తులకు, మేడారం నుంచి బయటకు వచ్చే భక్తులకు కష్టంగా మారింది. ఆర్టీసీ అధికారులు మేడారానికి వయా తాడ్వాయి మీదుగా బస్సులకు వన్‌వే ట్రాఫిక్‌ను అమలు చేసినా, వీవీఐపీల వాహనాలు సైతం ఇదే రూట్‌లో వెళ్లడం కూడా ట్రాఫిక్‌ రద్దీకి కారణమైంది. తాడ్వాయి-మేడారం రహదారి మధ్యలో 7-8 వంకలుంటాయి. ఈ వంకల వద్ద బస్సులు నెమ్మదించడంతోనే వెనుక వాహనాలన్నీ నిలిచిపోయాయి.

డ్రోన్‌లు, క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌ ఉన్నా ట్రాఫిక్‌ జామ్‌
మేడారం జాతరలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, డ్రోన్‌లు, క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీతో మేడారం గద్దెలతో పాటు పరిసర ప్రాంతాలు, రహదారుల్లో ట్రాఫిక్‌ రద్దీని ఎప్పటికప్పుడు అధిగమిస్తామని ప్రకటించిన పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం సాయంత్రం నుంచి చేతులు ఎత్తేయడం చర్చనీయాంశంగా మారింది. ఆధునిక ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నా, ట్రాఫిక్‌ సమస్యలు ఏయే ప్రాంతాల్లో ఉత్పన్నమయ్యాయో అక్కడికి వెళ్లి తనిఖీలు చేయడానికి పోలీసులకూ కష్టతరమైంది.

వీవీఐపీ పాసుల వాహనాలతోనే రద్దీ..
మేడారం జాతరకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలకు, అధికారులకు భారీగా వీవీఐపీల పాసులు పంపిణీ చేయడం ట్రాఫిక్‌ రద్దీకి కారణంగా పలువురు ప్రయాణీకులు చెబుతున్నారు. వీవీఐపీల పాసులతో వచ్చిన వారు ఆర్టీసీ బస్సుల రూట్‌లోనే రావడం, ఇష్టారాజ్యంగా డ్రైవింగ్‌ చేస్తూ బస్సులకు అడ్డంగా నిలపడంతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడిందని ప్రత్యక్ష సాక్షి త్రిపురనేని సుబ్రహ్మణ్యం ‘నవతెలంగాణ’కు తెలిపారు.

సరిపోను బస్సులు లేక ఇబ్బందులు
మేడారంలో 50ఎకరాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్‌లో శుక్రవారం సాయంత్రం నుంచి బస్సులు లేక మేడారం నుంచి బయటకు రావడానికి వేచి ఉన్న భక్తులు గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. 4వేల బస్సులను ఏర్పాటు చేశామని ప్రకటించిన ఆర్టీసీ అధికారులు గురువారం రాత్రి సమ్మక్క తల్లి గద్దెలపైకి కొలువుతీరగానే భక్తులు పెద్ద మొత్తంలో తిరుగుపయనమవుతారు. ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి బస్సులను పెంచాల్సిన అధికారులు పెంచకపోవడంతో బస్సులు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -