Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంసామాన్యుడికి ప్రయోజనం ఉండదు

సామాన్యుడికి ప్రయోజనం ఉండదు

- Advertisement -

– నిర్మాణాత్మక సంస్కరణలు అవసరం
– అలా అయితేనే అమెరికా టారిఫ్‌లను ఎదుర్కోగలం
– అప్పుల్లో ఉన్న రాష్ట్రాల పరిస్థితిపై ఆలోచించాలి
– జీఎస్టీ తాజా ప్రతిపాదనలపై ఆర్థిక నిపుణులు

న్యూఢిల్లీ : జీఎస్టీలో శ్లాబుల మార్పు ప్రతిపాదనపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. సామాన్యులపై భారాన్ని తగ్గించేలా తదుపరి చర్యలు ఉండబోతున్నాయని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ వెల్లడించిన విషయం విదితమే. అయితే కేంద్రం చెప్తున్నట్టుగా దేశంలోని లబ్దిదారులు, సామాన్యులకు ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చవని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. భారత్‌పై అమెరికా విధించిన సుంకాలను ధీటుగా ఎదుర్కోవాలంటే నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమని వివరిస్తున్నారు. అంతేకాదు.. తాజా ప్రతిపాదనతో పలు రాష్ట్రాల ఆదాయానికి గండి పడుతుందని హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశానికి ముందు మంత్రుల బృందాలు(జీఓఎంలు) సైతం పలు అంశాలపై చర్చలు జరిపాయి. ఆయా రాష్ట్రాల మంత్రులు తమ అభిప్రాయాలు, ఆందోళనలను కూడా లేవనెత్తారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరగనున్న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. కేంద్రం, రాష్ట్రాలతో కూడిన ఈ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం సెప్టెంబర్‌ నెలలో జరగనున్న విషయం విదితమే. ప్రస్తుతమున్న 12 శాతం, 28 శాతం శ్లాబులను తొలగించి 5 శాతం, 18 శాతం శ్లాబులకు మాత్రమే పరిమితం చేయాలని కేంద్రం భావిస్తున్న విషయం తెలిసిందే. ఇక 40 శాతం శ్లాబులోకి కేవలం లగ్జరీ గూడ్స్‌ మాత్రమే రానున్నాయి. అయితే సగటు పన్ను రేటు తగ్గినా.. ఉత్పత్తిదారులు ఆ ప్రయోజనాన్ని వినియోగ దారులకు అందిస్తేనే వస్తువులు, సేవలు చౌకగా మారుతాయని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. జీఓఎం సమావేశాల్లోనూ ఆయా రాష్ట్రాల మంత్రులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిన విషయం విదితమే. ఇక కొత్త పన్ను విధానం అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయన్న చర్చల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థలో స్తబ్దత నెలకొన్నది. ఎందుకంటే.. ధరలు తగ్గే అవకాశం ఉన్నందున కొనుగోలుదారులు అధిక విలువ కలిగిన వస్తువుల కొనుగోళ్లను వాయిదా వేస్తున్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ తగ్గుతోంది. దీనికితోడు ఇప్పటికే పేరుకుపోయిన నిల్వలు కొత్త సమస్యను సృష్టించే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్రాలపై భారం
జీఎస్టీ మార్పులతో పలు రాష్ట్రాల ఆదాయంపై ప్రతికూల ప్రభావాన్ని చూపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాని ప్రతిపాదించిన జీఎస్టీ మార్పులను ముందుకు తీసుకెళ్లడానికి కేంద్రం చర్యలు తీసుకుంటుందని విశ్లేషకులు చెప్తున్నారు. రాష్ట్రాల స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) నిషత్తికి అప్పులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇవి జీఎస్టీ పన్ను ఆదాయాన్ని కూడా కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఫలితంగా దేశంలోని పలు రాష్ట్రాలకు జీఎస్టీ శ్లాబుల్లో మార్పులు నష్టాన్ని తీసుకురానున్నాయి. కేంద్రం ఆదాయానికి కూడా గండి పడే అవకాశాలున్నాయి. అయితే తన ఆదాయాలను పెంచుకోవటానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నుంచి డివిడెండ్‌ వంటి అనేక మార్గాలు కేంద్రం వద్ద ఉంటాయి. ఎటొచ్చి రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదమున్నదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో కేంద్రం, ప్రధాని వెంటనే జోక్యం చేసుకోవాలంటూ కేరళ సీఎం పినరయి విజయన్‌ కేంద్రాన్ని కోరిన విషయాన్నీ వారు గుర్తు చేస్తున్నారు. భారత్‌పై అమెరికా టారిఫ్‌ విధింపుల భయం నేపథ్యంలో మోడీ సర్కారు నుంచి జీఎస్టీ మార్పుల ప్రతిపాదన వచ్చినట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి భారత్‌కు అమెరికా అతిపెద్ద మార్కెట్‌. అయితే ట్రంప్‌ టారిఫ్‌ల పెంపుతో అమెరికాకు భారత ఎగుమతులు మరింత ప్రియం కానున్నాయి. దీని భారం భారత్‌లోని ఎగుమతిదారులపై తీవ్రంగా పడనున్నది. ఈ నేపథ్యంలోనే జీఎస్టీ రేట్లు తగ్గడం ద్వారా.. ఎగుమతులు పడిపోవడంతో తగ్గిపోయే డిమాండ్‌ను ఎదుర్కోవడంలో సహాయపడుతుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అయితే జీఎస్టీ రేట్ల తగ్గింపు అనేది వినియోగదారులకు లబ్ది చేకూర్చనప్పుడు మాత్రం కేంద్రం నిర్ణయం తిరోగమనే చర్యే అవుతుందని హెచ్చరిస్తున్నారు.
గతంలో కేంద్రం చెప్పిన వివరాల ప్రకారం జీఎస్టీని ఎక్కువగా వ్యవస్థీకృత రంగం చెల్లిస్తుంది. ఐదు శాతం యూనిట్లు 95 శాతం జీఎస్టీని చెల్లిస్తాయి. కాబట్టి కేంద్రం చెప్పినదానిని బట్టి చూస్తే జీఎస్టీ తగ్గింపు వల్ల లబ్ది పొందేది వ్యవస్థీకృత రంగంలోని ఈ యూనిట్లే. వాస్తవానికి అసంఘటిత రంగంపై నామమాత్రపు పన్ను వసూళ్లు ఉంటాయి. ఈ రంగం ఉత్పత్తులను ఎక్కువగా వాడేది దేశంలోని పేద ప్రజలే. కాబట్టి జీఎస్టీలో మార్పులు దేశంలోని పేద ప్రజలకు ఏ మాత్రమూ ప్రయోజనాలు అందించవన్న విషయం స్పష్టమవుతున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. కాబట్టి అమెరికా విధించిన సుంకాలను ఎదుర్కోవాలంటే శ్లాబులలో మార్పులతో పాటు జీఎస్టీకి నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమని ఆర్థిక నిపుణులు వాదిస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad