ఏదైనా అసెంబ్లీలో చర్చించిన తర్వాతే నిర్ణయం
గత పాలకులు ఫోన్ ట్యాపింగ్‌తో వ్యాపారులను బ్లాక్‌మెయిల్ చేశారు
అలాంటి పాపాత్ములను వదిలిపెట్టం
సింగరేణి మెడికల్ అన్‌ఫిట్ బోర్డును రద్దు చేస్తాం : భూపాలపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
ఉమ్మడి వరంగల్ జిల్లాకు, తెలంగాణ ఉద్యమానికి విడదీయలేని సంబంధం ఉందని, ఈ ప్రాంతం మేధావులకు, పోరాట యోధులకు పుట్టినిల్లని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కొనియాడారు. ఆదివారం గణపురం మండలం చెల్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో జరిగిన ‘ప్రజాపాలన – ప్రగతి బాట’ బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, సింగరేణి కార్మికుల సమస్యలు, గత ప్రభుత్వ వైఫల్యాలపై సీఎం ఘాటుగా స్పందించారు. భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారంటూ కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు.
రాష్ట్రంలో ఏ జిల్లాను తొలగించే ఆలోచన గానీ, కొత్త జిల్లాల ఏర్పాటు గానీ ప్రభుత్వ పరిశీలనలో లేదని అన్నారు. జిల్లాల పునర్విభ జనపై అందరి అభిప్రాయాలు సేకరించి, అసెంబ్లీలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం కుట్రలు చేసే వారిని గమనించాలని సూచించారు. భూపాలపల్లి జిల్లా ఎక్కడికీ పోదని స్పష్టం చేశారు. నల్ల్లబంగారాన్ని వెలికితీస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న సింగరేణి కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికులకు భారంగా మారిన మెడికల్ అన్‌ఫిట్ బోర్డును రద్దు చేస్తామని ప్రకటించారు. గతంలో డిస్మిస్ అయిన 217 మంది కార్మికుల సమస్యను తప్పకుండా పరిష్కరిస్తామన్నారు.
వారసత్వ ఉద్యోగాలపై జరుగుతున్న విష ప్రచారాన్ని నమ్మవద్దని, కార్మికుల సంక్షేమమే ఈ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. గత పాలకులు డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో పేదలను వంచించారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారే తప్ప, పేదల ఇండ్ల గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. వచ్చే బడ్జెట్‌లో రెండో విడత ఇండ్లను కూడా మంజూరు చేస్తామని వెల్లడించారు. 2027లో రాబోయే గోదావరి పుష్కరాల నాటికి బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న తీర ప్రాంతాన్ని పర్యాటక హబ్‌గా మారుస్తామని సీఎం ప్రకటించారు. ఇందుకోసం రూ. 3 వేల నుంచి 4 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. జంపన్న వాగు నుంచి రామప్ప చెరువుకు నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.
వందల కోట్లు దోచుకున్నారు
గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌తో భార్యాభర్తలు, జడ్జిలు, జర్నలిస్టులు, సినీ తారలను కూడా వదల్లేదని సీఎం ఆరోపించారు. వ్యాపారులను బ్లాక్‌మెయిల్ చేసి వందల కోట్లు దోచుకున్నారని, ఇలాంటి పాపాత్ములను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఆడబిడ్డల ఆశీర్వాదం తమ ప్రభుత్వానికి ఎప్పుడూ ఉండాలని సీఎం కోరారు. ప్రతి ఏటా దసరా పండుగకు మీ తమ్ముడిగా ‘ఇందిరమ్మ చీర’ను సారెగా అందజేస్తామని తెలిపారు. అనంతరం మహిళా సంఘాలకు రూ. 205 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వివిధ కార్పొరేషన్ల చైర్మెన్లు ఐతా ప్రకాష్ రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, రాజబాబు, రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.



