కాంగ్రెస్ పాలనలో ఆగిన పల్లె ప్రగతి
జిల్లాలు రద్దు చేస్తే అగ్గి పుట్టిస్తాం
కేసీఆర్ పాలనలో మైగ్రేషన్ నుంచి ఇరిగేషన్‌గా మార్చాం
మున్సిపల్ ఎన్నికల నుంచే బీఆర్‌ఎస్ జైత్రయాత్ర : బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ- మహబూబ్‌నగర్
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పల్లెల్లో ఉన్న ట్యాంకర్ల ఇంజిన్‌లో డీజిల్ లేదు.. ట్యాంకర్‌లో నీళ్లు లేవు.. పల్లె ప్రగతి ఆగింది.. అని బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాల సర్పంచులకు సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీసీ మైదానంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పల్లెలు అభివృద్ధిలో పట్టణాలతో పోటీపడే వాతావరణం ఉండేదని అన్నారు. పార్కులు, శ్మశాన వాటికలు, మొక్కల పెంపకం, గ్రామసభలు, క్రీడా మైదానాలు ఇలా అనేక కార్యక్రమాలతో ప్రగతిని పరిగెత్తించిన రోజులు ఇప్పుడు కనిపించడం లేదన్నారు. కళ్యాణలక్ష్మి మొదలుకొని రైతుబంధు వరకు ఏ ఒక్క పథకం కాంగ్రెస్ పాలనలో అమలు కావడం లేదని ఆరోపించారు. రెండేండ్ల పాలనలో ఏ ఒక్క పనీ మొదలు పెట్టలేదన్నారు.
కొత్త పనులు చేయలేక అసమర్ధ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకొని.. బూతు మాటలతో ప్రతిపక్ష పార్టీల నాయకులను బెదిరించడమే పనిగా పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలలో 40 శాతం సర్పంచులను గెలుచుకున్న గులాబీ దళం.. రాబోయే మున్సిపల్ ఎన్నికలు మొదలుకొని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో జైతయాత్రను కొనసాగించాలని పిలుపునిచ్చారు. పాలమురు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు బీఆర్‌ఎస్ పాలనలో 90 శాతం పూర్తి చేస్తే.. మిగిలిన 10 శాతం పనులు కూడా పూర్తి చేయకుండా నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వ పాలన ఉందని విమర్శించారు. కేసీఆర్ పాలనలో పాలమూరు జిల్లాను మైగ్రేషన్ నుంచి ఇరిగేషన్‌గా మార్చామని చెప్పారు. 17న ముఖ్యమంత్రి ఈ జిల్లాకు వచ్చే ముందు.. ఐటీ పార్కులో 13 పరిశ్రమలు ఎందుకు వెళ్లిపోయాయో, కొత్తగా ఒక్క పరిశ్రమను కూడా ఎందుకు తేలేదో ప్రజలకు సమాధానం చెప్పి రావాలని సవాల్ విసిరారు. జిల్లాలను రద్దు చేస్తే అగ్గి పుట్టిస్తామని హెచ్చరించారు. ఈ సభలో మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, అలంపూర్ విధేయుడు, వివిధ అనుబంధ సంఘాల కార్పొరేషన్ల మాజీ అధ్యక్షులు పాల్గొన్నారు.
ఇంజిన్‌లో డీజిల్ లేదు..ట్యాంకర్‌లో నీరు లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



