దోహాలో దాడులపై భద్రతా మండలి నామమాత్ర ఖండన
అల్జీరియా అసంతృప్తి
చర్చలకు విఘాతం కలిగించేందుకే దాడులన్న ఖతార్
న్యూయార్క్ : ఖతార్ రాజధాని దోహాలో ఇజ్రాయిల్ ఇటీవల జరిపిన దాడులను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఖండించింది. ఆ ఖండనలో అమానుషంగా దాడులు జరిపిన ఇజ్రాయిల్ పేరును ప్రస్తావించనే లేదు. ఇజ్రాయిల్ మిత్రపక్షమైన అమెరికాతోసహా 15 సభ్య దేశాలూ ఈ ప్రకటనపై సంతకాలు చేశాయి. చర్చల్లో పాల్గొంటున్న హమాస్ నేతలను హత్య చేయాలనే ఉద్దేశంతోనే మంగళవారం ఇజ్రాయిల్ ఈ దాడికి దిగింది. ”భద్రతా మండలి సభ్యులు ఉద్రిక్తతలను తగ్గించాల్సిన ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. ఖతార్‌కు సంఘీభావం ప్రకటించారు. ఖతార్ సార్వభౌమాధికారానికి, ప్రాదేశిక సమగ్రతకు మద్దతు తెలియచేశారు.” అని మండలి ప్రకటనలో పేర్కొంది. ఈ ఖండన ప్రకటనను బ్రిటన్, ఫ్రాన్స్‌లు రూపొందించాయి. గాజాలో కాల్పుల విరమణ కోసం చర్చలు జరుపుతున్న బృందాలకు కతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్న నేపథ్యంలో దోహా కాల్పుల ఘటనపై ఖండనలు వెల్లువెత్తాయి. ”హమాస్ చేతుల్లో మరణించిన వారితో సహా బందీలను విడుదల చేయాలని మండలి సభ్యులు అన్నారు. యుద్ధాన్ని ముగించి, గాజాలోని ప్రజల ఇబ్బందులను పరిష్కరించడం మండలి ప్రధమ ప్రాధాన్యత” అని భద్రతా మండలి ప్రకటన పేర్కొంది.
ఖండించడానికి ఇన్ని పరిమితులా? : అల్జీరియా అసంతృప్తి
భద్రతా మండలి ప్రకటన అనేక పరిమితులకు లోబడి ఉందని అల్జీరియా అసంతృప్తి వ్యక్తం చేసింది. ”హింస, హింసకే కారణమవుతుంది. ఎలాంటి శిక్ష లేకపోవడం యుద్ధాన్ని రగిలిస్తుంది. అంతర్జాతీయ సమాజం ముఖ్యంగా ఈ భద్రతా మండలి మౌనంగా వుండడం గందరగోళ పరిస్థితులు పెచ్చరిల్లడానికి ఆజ్యం పోస్తుంది.” అని అల్జీరియా రాయబారి అమర్ బెండ్‌జామా మండలిలో వ్యాఖ్యానించారు. ఈ మండలి చాలా పరిమితులకు లోబడి ప్రకటన చేసింది. కనీసం దాడులకు దిగిన దేశం పేరును కూడా ప్రస్తావించలేకపోయింది. ఈ దూకుడును అంతర్జాతీయ చట్ట ఉల్లంఘనగా కూడా ప్రకటించలేకపోయింది.” అని అల్జీరియా స్పష్టం చేసింది. పాకిస్తాన్ కూడా ఇజ్రాయిల్ వైఖరిని ప్రశ్నించింది. శాంతికి గల ప్రతి అవకాశాన్ని చెడగొట్టాలన్నదే వారి ఆలోచనగా వుందని పాక్ రాయబారి అన్నారు.
శాంతి యత్నాలకు విఘాతం కలిగించేందుకే : ఖతార్
గాజాలో యుద్ధాన్ని అంతమొందించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను పక్కదారి పట్టించడానికి ఇజ్రాయిల్ ప్రయత్నిస్తోందని ఖతార్ ప్రధాని షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్ రహాన్ అల్ తాని విమర్శించారు. అందుకే దోహాలో హమాస్ నేతలపై దాడులకు దిగారని, ఇంత జరిగినా తమ మధ్యవర్తిత్వ ప్రయత్నాలను కొనసాగిస్తామని ప్రతిన చేశారు. భద్రతా మండలిలో ఆయన మాట్లాడుతూ ”చర్చలతో మేం తలమునకలై వున్న సమయంలో మా భూభాగాలపై దాడులు చేయడం వల్ల ఇజ్రాయిల్ ఉద్దేశమేంటో వెల్లడైంది. శాంతి ప్రయత్నాలను దెబ్బతీయాలన్నదే వారి లక్ష్యంగా వుంది. పాలస్తీనా ప్రజల కష్టాలు, ఇబ్బందులను శాశ్వతంగా కొనసాగించాలన్నది వారి ప్రణాళికగా ఉంది.” అని అన్నారు. ఇజ్రాయిల్‌ను పాలిస్తున్న తీవ్రవాదులకు బందీల గురించి పట్టడం లేదని, వారిని కాపాడాలన్న ప్రాధాన్యతే అక్కడి పాలకులకు లేదని విమర్శించారు.
సమర్థించుకున్న ఇజ్రాయిల్, అమెరికా
భద్రతా మండలి సమావేశంలో ఇజ్రాయిల్ రాయబారి డామీ డానన్ మాట్లాడుతూ గాజాలో, టెహరాన్‌లో, దోహాలో తీవ్రవాదులు, వారి నేతలు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టేది లేదని, వారికి ఎలాంటి రక్షణ ఉండదని అన్నారు. అమెరికా తాత్కాలిక రాయబారి డొరొతి షియా మాట్లాడుతూ, బందీలను విడిపించి ఇంటికి తీసుకురావడానికి ఇజ్రాయిల్‌కు గల నిబద్ధతను ప్రశ్నించడానికి ఏ సభ్యుడైనా ఈ వేదికను ఉపయోగించుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. ఈ దాడుల వల్ల అమెరికా లేదా ఇజ్రాయిల్ లక్ష్యాలు, ప్రయోజనాలు నెరవేరవని ట్రంప్ చేసిన ప్రకటననే ఆయనా పునరుద్ఘాటించారు.
ఇజ్రాయిల్ పేరే ప్రస్తావన లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES