– కాంట్రాక్టు కార్మికులతో వెట్టి వలస కార్మికుల జీవనం దుర్భరం నిర్వీర్యమైన కార్మిక చట్టాలు, హక్కులు
– 1700 పరిశ్రమల్లో కార్మికుల స్థితిగతులపై సర్వే కార్మికుల్ని కలుస్తున్న సర్వే బృందాలు
– సర్వేలో వచ్చిన సమస్యలపై 29న ధర్నా : సీఐటీయూ
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి మెదక్ జిల్లాలో కార్మికుల కష్టాలు చెప్పనలవిగానివిగా ఉన్నాయి. అందులో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 1700 పరిశ్రమలు విస్తరించాయి. పాశమైలారం, ఆర్‌సీపురం, పటాన్‌చెరు, బొల్లారం, ఖాజీపల్లి, బొంతపల్లి, గుమ్మడిదల, సంగారెడ్డి, కొండాపూర్, సదాశివపేట, హత్నూర, జహీరాబాద్, చౌటకూర్, పుల్కల్ వంటి ప్రాంతాల్లో పరిశ్రమ లున్నాయి. అత్యధికంగా ఫార్మాసూటికల్, కెమికల్, రబ్బర్, ఐరన్, ప్లాస్టిక్, సిరామిక్ వంటి పరిశ్రమలున్నాయి. వివిధ పరిశ్రమల్లో 1.80 లక్షల మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు. మొత్తం కార్మికుల్లో వీరు 80 శాతంగా ఉన్నారు. ఏండ్ల తరబడి పని చేసినా పర్మినెంట్‌కు నోచుకోవట్లేదు. కనీస వేతనాల్లేవు. సంక్షేమం, ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయి. కార్మికుల సంక్షేమం, భద్రత, సదుపాయాలు అందేందుకు పర్యవేక్షించాల్సిన కార్మిక శాఖ, పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు, ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్‌స్పెక్టర్, పీఎఫ్, ఈఎస్‌ఐ శాఖలన్నీ కూడా యాజమాన్యాలకు మేలు చేస్తూ కార్మికుల్ని విస్మరిస్తున్నాయి. ప్రమాదాలు పెరిగి కార్మికులు చనిపోతున్నా.. వికలాంగులై ఇంటికే పరిమితమైనా యాజమాన్యాలు పట్టించుకోవడంలేదు. ఈ పరిస్థితుల్లో పరిశ్రమల్లో కార్మికుల స్థితిగతులపై సీఐటీయూ సర్వే చేపట్టింది. కార్మికులను సర్వే బృందాలు కలుసుకుంటూ సమస్యలను తెలుసుకుంటున్నారు. సర్వేలో వచ్చిన సమస్యల ఆధారంగా ఈ నెల 29న ధర్నా చేయనున్నట్టు సీఐటీయూ తెలిపింది.
కనీస వేతనం అందని ద్రాక్ష
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల ఫలితంగా కార్మికులపై తీవ్రమైన పని భారం పెరుగుతోంది. 8 గంటల పనిని కాస్త 12 గంటలకు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 10 గంటల పని విధానం అమల్లోకి తెస్తూ జీవో 282 జారీ చేసింది. అయినా కార్మికులకు కనీస వేతనాలు అందట్లేదు. 15 సంవత్సరాలుగా పాలకులు కనీస వేతనాల జీవోలను సవరించలేదు. 15 ఏండ్ల కాలంలో నిత్యావసర సరుకుల ధరలు 200 శాతం పెరిగాయి. కాంట్రాక్టు, క్యాజువల్, అప్రంటీస్, ట్రైనీ, పిక్స్‌డ్ టర్మ్, పార్ట్‌టైమ్, నీమ్, న్యాప్స్, న్యాట్స్ వంటి పేర్లతో కార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తోంది. కార్మికులకు ఉచిత ట్రాన్స్‌పోర్ట్ సదుపాయం కల్పించకుండా జీతం నుండే రూ.2000, క్యాంటిన్ ఖర్చులకు రూ.1000లను యాజమాన్యాలు కట్ చేస్తున్నాయి. నిరుద్యోగ సమస్య వల్ల యువకులే ఎక్కువ మంది కాంట్రాక్టు కార్మికులుగా కంపెనీల్లో మగ్గుతున్నారు. హై స్కిల్డ్ వర్కర్స్‌కు జీవో నెంబర్ 4 ప్రకారం 26 రోజుల పనికి రూ.23,589, స్కిల్డ్ వర్కర్‌కు రూ.19,023, సెమిస్కిల్డ్ వర్కర్‌కు రూ.15,612, అన్‌స్కిల్డ్ వర్కర్‌కు రూ.13,302 చొప్పున వేతనాలివ్వాలి. 1957లో జరిగిన 15వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ తీర్మానం, 1991లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కార్మికుల కుటుంబాల అవసరాలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. ఆ ప్రకారం రూ.26,000 చెల్లించాలి కానీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యాజమాన్యాలకు అనుకూలంగా నిర్ణయాలు చేయడం వల్ల కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారు.
ఎలాంటి సదుపాయాలకు నోచని దుస్థితి
పారిశ్రామిక ప్రాంతాల్లోని కార్మికుల స్థితిగతుల్ని పరిశీలిస్తే ఎంతో దయనీయంగా బతుకుతున్నారు. కార్మిక చట్టాల ప్రకారం ప్రతి కార్మికునికి పీఎఫ్, ఈఎస్‌ఐ సదుపాయం కల్పించాలి. కంపెనీలు మాత్రం అమలు చేస్తున్నామని చెబుతున్నా కార్మికునికి అవసరమొచ్చినప్పుడు మాత్రం ఐడీలు ఇవ్వట్లేదు. దాంతో కార్మికులకు ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో వైద్యం అందట్లేదు. ఈఎల్స్, బోనస్, ఓటీ, లీవ్స్, మహిళలకు ప్రసూతి సెలవులు అమలు కావడంలేదు. కంపెనీల్లో కాంట్రాక్టు కార్మికులకు కనీసం క్యాంటీన్ సదుపాయం, ట్రాన్స్‌పోర్ట్ లేదు. భోజన సమయంలో ఉద్యోగులతో కలిసి కూర్చునే వీల్లేకుండా వివక్ష కొనసాగుతున్నది. మహిళా కార్మికులతో నైట్‌షిఫ్ట్‌లో పని చేయిస్తున్నారు. మహిళలకు పిల్లలుంటే వారి రక్షణకు ఎలాంటి ఏర్పాటూ లేదు. డ్రెసింగ్ రూమ్స్ ఉండవు. ఇక నివాస ప్రాంతాలైతే నరకకూపంలా ఉన్నాయి. మేస్త్రీల ద్వారా కార్మికుల్ని తీసుకొచ్చి ఇరుకైన గదుల్లో పెడుతున్నారు.
వలస కార్మికుల బతుకులు దుర్భరం
దేశంలోని బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, జర్ఖండ్, రాజస్థాన్, అస్సాం, మహారాష్ట్ర్ర, బెంగాల్, ఏపీ, కర్నాటక ఇతర ప్రాంతాల నుంచి లక్షలాది మంది కార్మికులు వచ్చి పనిచేస్తున్నారు. డ్యూటీలో ఎలాంటి ప్రమాదం జరిగి గాయాల పాలైనా, చనిపోయినా యాజమాన్యాలు గుట్టుగా ఇంటికి పంపిస్తున్నాయి. ఎస్‌బీ ఆర్గానిక్స్, సిగాచి పరిశ్రమల్లో రియాక్టర్లు పేలడం వల్ల భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్‌బీ పరిశ్రమలో 7మంది కార్మికులు, సిగాచిలో 54 మంది చనిపోయారు. వీరంతా బయటి రాష్ట్రాల వాళ్లే కావడంతో పరిహారం కూడా ఇవ్వలేదు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇస్తామని చెప్పిన యాజమాన్యం కేవలం రూ.25 లక్షలే ఇచ్చి చేతులు దులుపుకుంది.
కార్మికుల స్థితి గతులపై సర్వేలు, పోరాటాలు : అతిమేల మాణిక్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు
కాంట్రాక్టు కార్మికుల సమస్యలను అద్యయనం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 1700 కంపెనీల్లో సర్వేలు చేస్తున్నారు. అనేక దళాలుగా ఏర్పడి కార్మికుల్ని కలుస్తున్నాం. కాంట్రాక్టు కార్మికుల సమస్యలు వింటుంటే కన్నీరొస్తుంది. దుర్భరమైన, దయనీయమైన స్థితిలో కార్మికులు బతుకుతున్నారు. ఎక్కడా కార్మిక చట్టాలు అమలు చేయడంలేదు. కనీస వేతనాలు రూ.26,000 ఇవ్వట్లేదు. ఎలాంటి సదుపాయాల్లేవు. పైగా వలస కార్మికుల్ని నిలువు దోపిడీ చేస్తున్నారు. మోడీ తెచ్చిన లేబర్ కోడ్‌ల ప్రభావం వల్ల కార్మిక చట్టాలన్నీ నిర్వీర్యమయ్యాయి. సర్వేలో గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 29న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తాం.
కనీస వేతనం రాదు.. సదుపాయాలుండవు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES