Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుకుడి ఎడమైతే పొరపాటు లేదోయ్!

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్!

- Advertisement -

– నేడు లెఫ్ట్‌ హ్యాండర్స్‌ డే
– ఎడమచేతి వాటం తప్పుకాదు
– దాన్ని మార్చే ప్రయత్నం చేస్తే పిల్లల ప్రవర్తనలో మార్పులు
– చార్లీచాప్లిన్‌… ఐన్‌స్టీన్‌… సచిన్‌… నరేంద్ర మోడీ లెఫ్ట్‌ హ్యాండర్లే
– అమెరికా అధ్యక్షుల్లో ఎక్కువ మంది వాళ్లే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’ అంటాడు 1953లో రిలీజైన దేవదాసు సినిమాలో పాట రచయిత సముద్రాల రాఘవాచారి. ఆ పాటపై అప్పట్లోనే అనేక మీమ్స్‌ వచ్చాయి. పాట అద్భుతంగా హిట్‌ అయ్యింది. నేడు ప్రపంచ ఎడమచేతి వాటం వ్యక్తుల (లెఫ్ట్‌ హ్యాండర్స్‌) దినోత్సవం. ఎడమచేతివాటంపై సమాజంలో అనేక నెగెటివ్‌ కామెంట్స్‌ ఉంటారు. కొందరు లెఫ్ట్‌ హ్యాండ్‌తో తింటారు.మరికొందరు ఎడమ చేత్తోనే రాస్తారు. ఇంకొందరు షటిల్‌ సహా అనేక ఆటల్ని ఎడమచేత్తోనే ఆడతారు. ఇక పూజలు, పునస్కారాల్లో అయితే ఎడమ చేతిని వాడొద్దని పురోహితులు గట్టిగానే చెప్పేస్తారు. సెంటిమెంట్‌ను అడ్డంపెట్టి మన అలవాటును మార్చే ప్రయత్నాల్లో ఇదొకటి. ‘ఎప్పుడొచ్చాం అన్నది కాదు…బుల్లెట్‌ దిగిందా లేదా…’ అనేదే ముఖ్యం అన్నట్టు…ఏ చేత్తో చేశాం..రాశాం..అని కాదు…మనసుపెట్టి చేశామా లేదా అనేదే ముఖ్యం. కుడిచేతి పనులు ఎడమ చేత్తో చేస్తే వచ్చే ఉపద్రవం ఏమీ లేదు. పైపెచ్చు ఎడమచేతి వాటం ఉన్నవాళ్లను అలా వదిలేస్తే వాళ్లలో చురుకుదనం, తెలివితేటలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని పలు అధ్యయనాల్లో తేలింది. అయితే సమాజంలో ఇప్పటికీ లెఫ్ట్‌ హ్యాండర్స్‌ను అర్థం చేసుకోనివాళ్ళే ఎక్కువ. ఇప్పుడైనా ఆ అభిప్రాయాలు మార్చుకోవాల్సిందే. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది లెఫ్ట్‌ హ్యాండర్స్‌ అద్భుతాలు సృష్టించారు. ఇక తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఎడమ చేతి వాటం వస్తే, బలవంతంగా కుడిచేతి వాటానికి మార్పించాలనే ప్రయత్నం చేయకండి. అలాచేస్తే పిల్లల్లో నత్తితో పాటు ఆత్మన్యూనతా భావం పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన ఐన్‌స్టీన్‌, చార్లీచాప్లిన్‌, మైఖేల్‌ జాక్సస్‌, నాదల్‌, సచిన్‌, పుతిన్‌, మదర్‌థెరిస్సా ఇలాంటి వారంతా ఎడమచేతి వాటం వాళ్లే! ప్రపంచంలో ఎడమ చేతి వాటం వాళ్లు జనాభాల్లో పది శాతం వరకు ఉంటారని గణాంకాలు చెప్తున్నాయి. అయితే, ఇటీవలి కాలంలో ఇది 8 శాతానికి పడిపోయిందని అంచనా. సమాజంలో చీదరింపులు, తల్లిదండ్రుల ఒత్తిడితో కొందరు ఎడమ చేతి వాటం నుంచి కుడి చేతివాటానికి బలవంతంగా మారుతున్నారు. సమాజంలో ఎదురవుతున్న ఇబ్బందులు లెఫ్ట్‌ హ్యాండర్స్‌ కోసం ప్రత్యేక పరికరాలు లేకపోవడం వంటి అనేక సమస్యలు ఉన్నాయి. వీటిని సాకుగా చూపి బలవంతంగా రైట్‌హ్యాండ్‌కు మారడం సరికాదని గ్రాఫాలజీ నిపుణులు చెప్తున్నారు. తొలిసారిగా 1976 ఆగస్టు 13న వరల్డ్‌ లెఫ్ట్‌హ్యాండర్స్‌ డేను నిర్వహించారు. అప్పటి నుంచి ఏటా ఆగస్టు 13వ తేదీన ఎడమచేతివాటం వ్యక్తుల దినోత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి.

చేతిరాత మార్పిస్తే ప్రమాదమే
ఎడమ చేతి వాటం మనుషులను దారుణంగా చూసే సమాజం మనది. వాస్తవానికి చేయి మన రాతను నిర్ణయించదు. మన మెదడు రాతల్ని రాయిస్తుంది. చేయి పట్టకారు లాంటిది మాత్రమే. ప్రతి వంశంలోనూ 20 నుంచి 30 తరాలకు కొందరు ఎడమచేతివాటం వాళ్లు పుడతారని గ్రాఫాలజిస్టులు చెబుతున్నారు. ఎడమ చేతివాటం అనేది అనువంశికం కాదనే వాదనలు కూడా ఉన్నాయి. 3.5 నుంచి 4 ఏండ్ల వయస్సులో పిల్లలు ఎడమ చేతితో రాయడం మొదలు పెడితే వారిని లెఫ్ట్‌హ్యాండర్స్‌గానే నిర్ధారించాలి. కుడి చేతితో రాసేటప్పుడు మెదడులోని ఎడమ భాగం న్యూరాన్లు చైతన్యమవుతాయి. అదే ఎడమ చేతితో రాసేటప్పుడు కుడి భాగం న్యూరాన్లు యాక్టివ్‌ అవుతాయి. ఎడమ చేతి వాటం పిల్లలను బలవంతంగా కుడి చేతి వాటానికి మారిస్తే పిల్లల్లో మానసిక, అనారోగ్య రుగ్మతలు ఏర్పడే ప్రమాదం ఉందని చేతిరాత నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా చేస్తే పిల్లల మాటల్లో తడబాటు మొదలవుతుంది. నత్తి వస్తుంది. మానసిక ఎదుగుదలలో నాలుగైదేండ్లు వెనుకబడిపోతారు. అంతిమంగా పిల్లలు ఆత్మనూన్యతాభావానికి లోనవుతారు. పొరపాటున ఎడమ చేతితో రాయడం మొదలుపెడితే…ఏదో అపశకనం అన్నట్టు కుటుంబసభ్యులు ఆందోళన పడుతుంటారు. అవన్నీ ఒట్టి మూఢనమ్మకాలే.

విదేశాల్లో ప్రత్యేక పరికరాలు
స్కేలు, పెన్సిల్‌, షార్ప్‌నర్‌, కత్తెర, పెన్ను తదితర వస్తువులు, పరికరాలన్నీ కుడిచేతి వాటం కోసం తయారు చేసినవే. స్కేలుతో గీతలు కొట్టడం ఎడమచేతి వాటం వాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో వారి కోసం ప్రత్యేక పరికరాలొచ్చాయి. మార్కెట్‌లో లెఫ్ట్‌ హ్యాండర్ల కోసం తయారు చేసిన స్కేళ్లు, పెన్నులు, తదితర వస్తువులు దొరుకుతున్నాయి. మన దేశంలో మాత్రం ఇప్పుడిప్పుడే ఈ కామర్స్‌ మార్కెట్‌లో అందుబాటులోకి వస్తున్నాయి. ప్రపంచంలో 98 శాతం లెఫ్ట్‌ హ్యాండర్లు చేతిని పడుకోబెట్టి రాస్తారు. ఇప్పుడు మార్కెట్‌లోని కుడిచేతి వాటం కోసం తయారు చేసిన పెన్నులతో రాయడం వారికి ఇబ్బంది. అందుకే లెఫ్ట్‌ హ్యాండర్లు వేగంగా రాసేందుకు అనువైన పెన్నులు ఇప్పుడు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి.

లెఫ్ట్‌ హ్యాండర్‌ ప్రముఖలు వీరే..
కుడి చేతితో రాసేవాళ్లు మాత్రమే గొప్పవాళ్లు అవుతారనేది కేవలం భ్రమ. ఎడమ చేతివాటం వాళ్లలోనూ ప్రపంచ ప్రసిద్ధి చెందిన మేధావులు, రాజకీయ నాయకులున్నారు. ప్రపంచంలోనే అధిక జ్ఞాపకశక్తి కలిగిన వ్యక్తి, ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌. ఆయన లెఫ్టిస్టే. జాతిపిత మహాత్మాగాంధీ, సమాజసేవకురాలు మధర్‌ థెరిస్సా, ఫేక్‌బుక్‌ సృష్టికర్త జుకెన్‌బర్గ్‌, విశ్వవిఖ్యాత నటులు చార్లీ చాప్లిన్‌, అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామా, క్రికెట్‌ గాడ్‌గా పేరొందిన సచిన్‌ టెండూల్కర్‌, మన దేశ ప్రధాని నరేంద్రమోడీ, ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్‌టాటా, రష్యా అధ్యక్షులు పుతిన్‌, బాలీవుడ్‌ బాద్‌షా అమితాబచ్చన్‌, బహుభాషా నటుడు రజినీకాంత్‌, వాల్ట్‌ డిస్నీ, ప్రముఖ డ్యాన్సర్‌ మైకేల్‌ జాక్సన్‌, లక్ష్మీమిట్టల్‌, బిల్‌గేట్స్‌ ఇలా ఎడమ చేతి వాటం వాళ్లలో అనేకమంది ఎందరెందరో మహామహులు ఉన్నారు. లెఫ్ట్‌హ్యాండర్లు బొమ్మలు బాగా గీస్తారు. లాజికల్‌గా ఆలోచిస్తారనే ప్రచారమూ ఉంది. అలాగే ఉద్రేకం కూడా ఎక్కువే. టెన్నిస్‌లో ప్రముఖ క్రీడాకారులందరూ లెఫ్ట్‌ హ్యాండర్లే కావడం గమనార్హం. అమెరికా అధ్యక్షులుగా ఇప్పటిదాకా పనిచేసిన వారిలో దాదాపు సగం మంది లెఫ్ట్‌ హ్యాండర్లే.

చిన్నచూపు చూడొద్దు
కుడిచేతితో చేస్తే మంచి, ఎడమ చేతితో చేస్తే చెడు అనే మూఢత్వం సరికాదు. వంద రూపాయల లోటును కుడి చేత్తో ఇస్తే రెండు వందల రూపాయల నోటు అవుతుందా? ఎడమ చేతితో వంద లోటు ఇస్తే 90 రూపాయలే అవుతాయా? కాదుకదా! ఏ చేత్తో ఇచ్చినా వంద…వందే!! ఎడమ చేతి వాటాన్ని చులకన చేయొద్దు. అలా చేసేవాళ్లపై చట్టపర చర్యలు తీసుకోవాలి. పెంపకంలోనూ, పాఠశాల లోనూ కుడి, ఎడమ ఒక్కటే అన్న భావన కల్పించాలి. లెఫ్ట్‌ హ్యాండర్స్‌కు ఆగస్టు 13న చిన్న బహుమతులైనా ఇచ్చి ప్రోత్సహిం చండి. పిల్లలు మరింత సృజనాత్మకంగా ఎదగాలంటే 13, 14 ఏండ్ల తర్వాత రెండు చేతులతోనూ రాయడం నేర్పించండి. దీనివల్ల మెదడు ఎడమ, కుడి వైపు భాగాలు యాక్టివేట్‌ అయ్యి, వారు సవ్యసాచిగా మారుతారు. అంతేగానీ చేతివాటాన్ని మార్చొద్దు. స్కూళ్లల్లో, ఆఫీసుల్లో ఎడమచేతి వాటం దినోత్సవాన్ని నిర్వహించాలనే చైతన్యాన్ని సమాజంలో తీసుకురావాలి. దీన్ని అందరూ బాధ్యతగా భావించాలి.
– వై మల్లిఖార్జున్‌ రావు,
ప్రముఖ చేతిరాత నిపుణులు

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img