Sunday, January 25, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుదేశంలో మహిళలకు రక్షణ లేదు

దేశంలో మహిళలకు రక్షణ లేదు

- Advertisement -

‘బేటీ బచావో – బేటీ పడావో’ ఉత్తి మాటలే
ఉపాధి హామీ పేరు మార్చేసి నిర్వీర్యం చేస్తున్నారు
కేరళలో మహిళాభివృద్ధికి పెద్దపీట
ఐద్వా ఉద్యమాల్లో భాగస్వాములవ్వండి… : ఐద్వా జాతీయ అధ్యక్షురాలు పి.కె. శ్రీమతి

మహిళలపై హింస సాధారణ వార్తగా మారిన ఈ కాలం.. భారత ప్రజాస్వామ్యానికి ప్రమాద ఘంటిక అని ఐద్వా హెచ్చరిస్తోంది. బీజేపీ పాలనలో మహిళల భద్రత క్రమంగా క్షీణిస్తోందని, మనువాద భావజాలానికి అనుగుణంగా మహిళలను తిరిగి ఇంటికే పరిమితి చేసే ప్రయత్నాలు బలపడుతున్నాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) పేర్కొంటోంది. కులం-మతం పేరిట దాడులు, లైంగిక హింస పెరుగుతున్న వేళ, మహిళలను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ, చట్టాలే నేరస్తులకు అండగా నిలుస్తున్నాయని తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళా హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాల్సిన అవసరాన్ని ముందుకు తెస్తూ, నేటి నుంచి (ఆదివారం) హైదరాబాద్‌లో ఐద్వా అఖిల భారత మహాసభలు ప్రారంభమవుతున్నాయి. ఈ మహాసభల సందర్భంగా ఐద్వా జాతీయ అధ్యక్షురాలు పి.కె. శ్రీమతి తో..
నవతెలంగాణ ప్రతినిధి సలీమా ముఖాముఖి.

ప్రశ్న: దేశంలో సంస్కృతి పేర మహిళలపై తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. ఆ స్థాయికి తగ్గట్టు ఐద్వా పోరాటాలు చేస్తుందా..?
జవాబు: నిజం చెప్పాలంటే ఒక్క సంస్కృతి పేరుతోనే కాదు కులం, మతం పేరుతో కూడా దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ మహిళలపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. ప్రతి చోటా మహిళలనే వాళ్లు టార్గెట్‌ చేస్తున్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. కాపాడాల్సిన పోలీసులు, కోర్టులు వాళ్లకు అండగా నిలబడుతున్నారు. ఉన్నావో కేసులో మనకు ఇది స్పష్టంగా కనిపిస్తుంది. పితృస్వామ్య వ్యవస్థలో మహిళలంటే చిన్నచూపు. ఇక మనువాదాన్ని పెంచి పోషిస్తున్న బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ధోరణి మరింత పెరిగిపోయింది. మొత్తంగా మన దేశంలో మహిళలకు రక్షణ కరువయ్యింది. వీటిపై ఐద్వా ఎప్పటికప్పుడు ఉద్యమాలు చేస్తూనే ఉంది. మహిళలను చైతన్యం చేసేందుకు తన వంతు కృషి చేస్తుంది. అయితే రాబోయే కాలంలో ఈ పోరాటాలను మరింత ఉదృతం చేయాల్సిన అవసరమైతే ఉంది.

ప్రస్తుతం దేశంలో విద్యా, ఉపాధిలో మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఉందంటారు?
పాలకులు మహిళలను ఇంటికే పరిమితం చేయాలని చూస్తున్నారు. ఇక వారి విద్యా, ఉపాధి గురించి ఎలా ఆలోచిస్తారు. ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా ఒక్క కేరళ రాష్ట్రంలో తప్ప అన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలలను మూసేస్తున్నారు. రక్షణ లేని సమాజంలో ఆడపిల్లను ఇంటి నుంచి బయటకు పంపడానికే భయపడుతున్న తల్లిదండ్రులు చదువు కోసం దూర ప్రాంతాలకు ఎలా పంపిస్తారు? దాంతో డ్రాపౌట్స్‌ బాగా పెరిగిపోతున్నారు. అందులో అమ్మాయి సంఖ్యే ఎక్కువ. ‘బేటీ బచావో – బేటీ పడావో’ అంటూనే మన పాలకులు అమ్మాయిలను చదువుకు దూరం చేస్తున్నారు. మహిళలు బయటకు రావొద్దు, చదువుకోవద్దు, ఉద్యోగాలు చేయొద్దు అనే భావన పెంచుతున్నారు. మహిళను తిరిగి నాలుగ్గోడలకు పరి మితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళల కోసం చేసింది ఏమీ లేదు. ఓట్ల కోసం మాత్రం మహిళలను ఉపయోగించు కుంటున్నారు. మన దేశ మహిళలు అన్నీ అర్థం చేసుకుంటున్నారు. వీటన్నింటిపై ఐద్వాగా మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాం.

ఇటీవల ఉపాధి హామీ చట్టంలో అనేక మార్పులు చేశారు. దీని ప్రభావం మహిళలపై ఎలా ఉంటుందంటారు?
కచ్చితంగా ప్రభావం ఉంటుంది. వామపక్షాలు పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టం వచ్చిన తర్వాత ఏడాదిలో వంద రోజులైనా పని దొరుకుతుంది. కొద్దోగొప్పో పని చేసుకొని బతుకుతున్నారు. ఉపాధిహామీ ద్వారా పని చేసుకుంటున్నవారిలో 95 శాతం మంది మహిళలే. ఇప్పుడు మోడీ ప్రభుత్వం చేస్తున్న మార్పుల వల్ల ఆ పథకమే నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంది. దీనికి బలయ్యేది మహిళలే. అందుకే ఈ పథకంలోని మార్పులను ఐద్వా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.

గతంలో మీరు కేరళ రాష్ట్ర ఆరోగ్య – కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. అక్కడ మహిళా అభివృద్ధి కోసం జరుగుతున్న కృషి ఏమిటి?
దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే భిన్నంగా కేరళలో మేం పని చేస్తున్నాం. ఎన్నో భిన్నమైన పథకాలు ప్రవేశపెట్టాం. అన్నింటికంటే ముందు పాలనలో మహిళలకు సమభాగం ఉండాలని స్థానిక ఎన్నికల్లో ప్రెసిడెంట్స్‌, వైస్‌ ప్రెసిడెంట్స్‌, స్టాండింగ్‌ కమిటీ ఇలా ప్రతి వాటిలో సగం మంది మహిళలు ఉండేలా రిజర్వేషన్లు కల్పించుకున్నాం. ప్రస్తుతం స్థానిక సంస్థల్లో 56 శాతం మంది మహిళలు ఉంటారు. అలాగే కుటుంబ శ్రీ(మన దగ్గర డ్వాక్రా గ్రూపులు) పథకం ద్వారా మహిళలతో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టిస్తున్నాం.

అలాగే 60 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికి నెలకు రూ.2500 ఆర్థిక సాయం చేస్తున్నాం. కేజీ నుంచి ఇంటర్‌ వరకు ఉచిత విద్య అందిస్తున్నాం. పాఠ్యపుస్తకాలతో పాటు ఏడాదికి రెండు యూనిఫామ్స్‌ ఫ్రీగా ఇస్తున్నాం. పిల్లలకు పౌష్టికారం అందించేందుకు మధ్యాహ్న భోజనంతో పాటు ప్రతి రోజూ ఒక గుడ్డు, పాలు, అరటిపండు అందిస్తున్నాం. అలాగే ప్రజల కోసం నిత్యం శ్రమిస్తున్నా ఆశా, అంగన్‌వాడీ, మిడ్డే మీల్స్‌ కార్మికులకు రూ. 12 నుంచి 15 వేల వరకు జీతం ఇస్తున్నాం. ఇవన్నీ కేరళలో మాత్రమే కాదు కేంద్ర పాలకులు తలచుకుంటే దేశ వ్యాప్తంగా అమలు చేయగలిగిన పథకాలు. చిత్తశుద్ధి లేకపోవడమే అసలు సమస్య.

మీ రాజకీయ జీవితం గురించి?
నేను స్కూల్లో ఉన్నప్పుడే విద్యార్థి ఉద్యమం (ఎస్‌.ఎఫ్‌.ఐ)లో పని చేయడం మొదలుపెట్టాను. స్కూల్‌ స్పీకర్‌గా కూడా పని చేశాను. తర్వాత టీచర్‌గా నా కెరీర్‌ ప్రారంభించా. నా తల్లిదండ్రులు, నా భర్త కూడా టీచర్లే. మా పెద్దనాన్నలు ఉద్యమాల్లో బాగా పని చేశారు. భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి జైలుకు కూడా వెళ్లారు. మా తాతయ్య 52 ఏండ్ల వయసులోనే చనిపోయారు. పెద్దనాన్నలు ఉద్యమాల్లో ఉన్నారు. దాంతో కుటుంబ బాధ్యతలను మా నాన్ననే చూసుకునేవారు. నేను 1995లో పంచాయితీ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాను. 2001లో పయ్యనూర్‌ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాను. 2006 నుంచి 2011 వరకు ఆరోగ్య – కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశాను. తర్వాత ఎంపీగా కూడా పని చేశాను.

ఈ మహాసభల సందర్భంగా దేశ మహిళలకు మీరేం చెబుతారు?
మొట్టమొదటిసారి హైదరాబాద్‌లో ఐద్వా ఆలిండియా మహాసభలు జరగబోతున్నాయి. తెలంగాణ పోరాటాల గడ్డ. మల్లు స్వరాజ్యం వంటి నాయకులు పుట్టిన నేల. 45 ఏండ్ల తర్వాత తిరిగి తెలుగు నేలపై మహాసభలు జరగబోతున్నాయి. దేశ వ్యాప్తంగా వెయ్యి మంది ప్రతినిథులు హాజరుకాబోతున్నారు. ఉద్యమాలు తీవ్రతరం చేయాల్సిన సమయం ఇది. దానికి తగ్గట్టే నాలుగు రోజుల పాటు గత కార్యక్రమాలు సమీక్షించు కొని మా భవిష్యత్‌ కర్తవ్యాలను తీసుకోబోతున్నాం. సామ్రాజ్యవాదంపై, మనువాదంపై పోరాడుతూ స్త్రీ సమానత్వం సాధించడమే మా లక్ష్యం. దానికి అనుగుణంగా తీర్మానాలు చేసుకొని కొత్త కమిటీ ఆధ్వర్యంలో మా పని మొదలుపెట్టబోతున్నాం. దేశ వ్యాప్తంగా మహిళలందరూ ఐద్వా చేయబోయే ఉద్యమాలలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -