కేవలం ఐదేళ్ల కాలపరిమితిలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయో పరిమితి పెంపుదల యోచన చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించడం భారంగా మారిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఒకవేళ అదే నిజమైతే ఆ ఆలోచన మానుకోవాలి. తక్కువ కాలపరిమితిలో ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయసు పెంపుదల అంతమంచిది కాదు. ఉద్యోగుల్లో ఆందోళన ఉన్నందున ఈ విషయమై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి. రిటైర్మెంట్ వయస్సు పెంపుదలకు కొన్ని ప్రమాణాలు ఉంటాయి. అది సగటు పౌరుని ఆయుప్రమాణం ప్రాతిపదికగా ఉంటుంది. దాని పెరుగుదలకూ కొన్ని మౌలిక ప్రమాణాలు, కొల మానాలు ఉంటాయి. సగటు మనిషి జీవన ప్రమాణాలు పెరుగుదల, ఆధునిక వైద్య సౌకర్యాలు, ఆరోగ్య ప్రమాణాలు మెరుగుదల, ఈ మూడు సూచికలు బాగున్నప్పుడు మనిషి సగటు ఆయుప్రమాణం పెరుగుతుంది.
భారతదేశం సగటు మనిషి ఆయు ప్రమాణం1998లో 61.7శాతంగా ఉంది.2020కి అది 70.1 శాతానికి, 2025నాటికి అది 70.82 శాతానికి పెరిగింది. ఐదేండ్ల కాలంలో పెరిగిన ఆయు ప్రమాణం 0.81 శాతం మాత్రమే కాగా, రాష్ట్రంలో పెరుగుదల కేవలం 0.29 శాతం! ఈ మాత్రం స్వల్ప పెరుగుదలకే, ఐదేండ్ల కాలపరిమితిలో ఉద్యోగ వయోపరిమితి పెంపు నిర్ణయం ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. రాష్ట్రంలో 2020లోనే పెరిగిన సగటుమనిషి ఆయుప్రమాణం దృష్టిలో పెట్టుకుని రిటైర్మెంట్ వయోపరిమితి 58 ఏండ్ల నుండి 61 సంవత్సరాలకు పెంచింది.ఫలితంగా ప్రతియేటా రిటైర్ కావలసిన ఉద్యోగులు మూడేండ్లకు ఒకేసారి పదివేల మంది 2024లో రిటైర్ కావాల్సి వచ్చింది. వారికి చెల్లించాల్సిన 8,200 కోట్ల రూపాయలు నేటికీ అందించలేదు. ఉద్యోగులు దాచుకున్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్, గ్రూపు ఇన్సూరన్స్, గ్రాట్యూటీ,లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, పెన్షన్ కమిటేషన్‌తో కలిపి ఒక్కో రిటైర్ ఉద్యోగికి 50లక్షల నుండి కోటి రూపాయల వరకు ప్రభుత్వం బకాయిపడింది. 2024 ఏప్రిల్ నుండి ఈ బకాయిల పరంపర పెరుగుతూనే ఉంది. రిటైర్ ఉద్యోగులకు న్యాయబద్దంగా చెల్లించాల్సిన బకాయిలను చెల్లించలేదు.
2025 ఏప్రిల్ నుండి 2026ఏప్రిల్ నాటికి 1400మంది గెజిటెడ్ అధికారులు, ఐదువేల మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, మరో 3,100మంది ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు వెరసి మరో 9,600మంది రిటైర్మెంట్‌కు సిద్ధంగా ఉన్నారు.అంటే మరో 8వేల కోట్ల రిటైర్మెంట్ బకాయిలు కలుపుకుంటే వెరసి బకాయి 16 వేలకోట్ల పై చిలుకు పెరిగే అవకాశం ఉంది. ప్రతి నెలా రిటైర్ అయిన ఉద్యోగులకు వందకోట్లు కేటాయిస్తే సర్దుబాటు అయ్యే స్థితి నుండి రెండేండ్లుగా పెండింగ్‌లో పెట్టడంతో ఏకంగా బకాయి 16వేలకోట్లకు ఎకబాకనుంది. ఇప్పటికే రాష్ట్రంలో రిటైర్మెంట్ పొంది బకాయిలు రాక ఆందోళన చెంది ఆత్మహత్యలు, గుండె పోట్లతో మృతి చెందిన వారి సంఖ్య రెండు డజన్ల సంఖ్య దాటింది. జిల్లాల్లో రిటైర్ ఉద్యోగులు నిత్యం ఏదోఒక ఆందోళన చేస్తూనే ఉన్నారు. అంతేకాదు, రిటైర్మెంట్ పొందిన తర్వాత ప్రశాంత జీవనం గడపాల్సిన వీరు నిత్యం బకాయిలు కోసం ఎదురుచూపులతో ఆందోళనలకు గురౌతున్నారు. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయోపరిమితి అరవైయేండ్లుగా ఉంది.
మన పక్కరాష్ట్రలైన ఆంధ్రప్రదేశ్‌లో 62, కర్నాటకలో 60, ఉత్తరప్రదేశ్‌లో 60 ఏండ్లు ఉంది. కేంద్రప్రభుత్వం సైతం ఒకదశలో రిటైర్మెంట్ వయస్సు 60 నుండి 65సంవత్సరాలకు పెంచాలని యోచన చేసి విరమించుకుంది.తిరిగి పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు విషయంలో రిటైర్మెంట్ వయసులో చాలా వ్యత్యాసం ఉంటుంది. సుప్రీంకోర్టు జడ్జి, యూనివర్సిటీ ప్రొఫెసర్, వృత్తిరీత్యా డాక్టర్లు వయో పరిమితి 65సంవత్సరాలు ఉంది. ఎందుకంటే వీరి అనుభవ పూర్వకమైన సేవలు అవసరం కనుక ఆ పెరుగుదల అనివార్యమైంది. అయితే సైన్యం, నేవీ, వాయుసేన అధికారులు రిటైర్మెంట్ వయోపరిమితి వివిధ కేడర్‌లను బట్టి 42ఏండ్ల నుండి అరవైయేండ్ల వరకు ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో మరోమారు తక్కువ కాలవ్యవధిలో, ఆయుప్రమాణ సూచి ఆశించినంత పెరగకుండా ఉద్యోగుల వయోపరిమితి పెంచడం వలన, ఇప్పుడు చెల్లించాల్సిన రిటైర్మెంట్ బకాయిలు అదనపు భారం మరో 8వేల కోట్లు తాత్కాలికంగా ఉపశమనం పొందవచ్చునేమో? కానీ, మరి రెండేండ్ల తర్వాత ప్రభుత్వానికి అదే మోయలేని భారం, శాపం అవుతుంది.
రాష్ట్రంలో 2017-18 ఏడాదికే నిరుద్యోగ సూచిక 6.1 శాతం పెరిగితే, ఇప్పుడది 2024-25నాటికి 3.5శాతం అదనంగా పెరిగి ఏకంగా నిరుద్యోగ సూచిక 9.6 శాతంగా మారింది. రిటైర్మెంట్ ఖాళీలు నింపుకోవడం, రిటైర్మెంట్ వయోపరిమితి వలన ఉద్యోగఖాళీలు ఏర్పడకపోవడం వలన నిరుద్యోగ సూచిక మరింత పెరిగి నిరుద్యోగ యువత సంక్షోభం అంత శ్రేయోదాయకం కాదు.అది తిరుగుబాట్లు, సామాజిక అశాంతికి ఆజ్యం పోసే ప్రమాదం ఉంది.అటు ఉద్యోగులు కూడా తమ రిటైర్మెంట్ వయస్సు పెంచమని కోరడం లేదు.వీలైనంత త్వరగా ఉద్యోగ బాధ్యతలు వదిలించుకోవాలనే రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న ఉద్యోగుల ఆలోచనగా ఉంది. ఇటు నిరుద్యోగులు, అటు ఉద్యోగులకు ఇష్టం లేని ఉద్యోగం వయోపరిమితి పెంపుదల తాత్కాలికంగా ప్రభుత్వం బకాయిల శిరోభారం వాయిదా పడవచ్చునేమో! కానీ,అదే భవిష్యత్తు పాలకుల సంక్ష్షోభానికి, పరిపాలనకు శరాఘాతం కానుంది.
కనుక తాత్కాలిక ఉపశమనం ఎత్తుగడగా ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచడం వలన తెలంగాణా ప్రజలకు ఒనగూరే ప్రయోజనమేమీ ఉండదు.ఒకమౌలిక మైన దీర్ఘకాలిక ప్రభావిత నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం మంచి, చెడులు బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది.తాత్కాలిక అవసరాలు బయటపడటం కోసం విధాన పరమైన రిటైర్మెంట్ ఉద్యోగుల వయో పరిమితి పెంపు నిర్ణయం తీసుకునే పక్షంలో ప్రజలకు నష్టంతోపాటు, భవిష్యత్తు పరిపాలనా ఆర్థిక సంక్షోభానికి కారణంగా నిర్ణయం మిగిలే అవకాశం ఉంది. కనుక ఈవిషయంలో బేషజాలకు పోవాల్సిన అవసరం లేదు. ఉద్యోగులు, నిరుద్యోగులను ఆందోళనకు గురి చేయవలసిన అవసరం లేదు. ప్రస్తుత స్థితిలో ఉద్యోగుల వయోపరిమితి పెంపు అంత శ్రేయస్కరం కానేకాదు. ఇలాంటి విషయాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి అడుగేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ఎన్.తిర్మల్
9441864514



