– ఇజ్రాయిల్ ఒత్తిడితోనే వార్
– నేను యుద్ధానికి వ్యతిరేకం
– ఎన్‌సీటీసీ డైరెక్టర్ రాజీనామా
– ట్రంప్ బృందంలో చీలిక
– చర్చనీయాంశంగా మారిన జో కెంట్ అంశం
ఇరాన్‌తో అమెరికా యుద్ధం నేపథ్యంలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌తో యుద్ధానికి వెళ్లాలన్న ఆయన విధానాన్ని ప్రశ్నిస్తూ ఒక ఉన్నత స్థాయి అధికారి రాజీనామా చేశారు. యూఎస్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ (ఎన్‌సీటీసీ) డైరెక్టర్ జో కెంట్ తన పదవి నుంచి వైదొలుగు తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన ఒక కీలక పోస్ట్ చేశారు. ”నా మనస్సాక్షి ప్రకారం ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధానికి నేను మద్దతు ఇవ్వలేను. ఇరాన్ నుంచి మన దేశానికి తక్షణ ముప్పు ఏమీ లేదు. ఇజ్రాయిల్ , దాని శక్తివంతమైన అమెరికన్ లాబీ ఒత్తిడితోనే మనం ఈ యుద్ధాన్ని ప్రారంభిం చామన్నది స్పష్టం” అని ఆయన పేర్కొన్నారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న సైనిక ఘర్షణల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నిరంతరం పెరుగుతున్న తరుణంలో కెంట్ రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇరాన్ యుద్ధం కారణంగా ట్రంప్ యంత్రాంగంలో జరిగిన అత్యంత ప్రముఖ నిష్క్రమణలలో జో కెంట్ రాజీనామా ఒకటి కావటం విశేషం. కౌం టర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టర్‌గా జో కెంట్ ఒక కీలకమైన యూఎస్ ఇంటె లిజెన్స్ ఏజెన్సీకి నాయకత్వం వహించారు. దేశానికి ఎదురయ్యే తీవ్రవాద ముప్పులను గుర్తించి, విశ్లేషించడం ఆయన పని. అయితే, ఇరాన్ ప్రస్తుతం అమెరికాకు ఎలాంటి ముప్పునూ కలిగించడం లేదని అదే అధికారి పేర్కొ నడం గమనార్హం. జో కెంట్ వ్యాఖ్యలతో ట్రంప్ యుద్ధోన్మాదం స్పష్టంగా బయటపడినట్టయ్యిందని విశ్లేషకులు చెప్తున్నారు. ఆయన డైరెక్టర్‌గా వ్యవహ రించిన ఈ అమెరికా ఏజెన్సీ చాలా కీలకమైంది. ఇది అమెరికా ప్రభుత్వంలోని ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ, పెంటగాన్, చట్ట అమలు సంస్థలతో సహా వివిధ విభాగాల మధ్య ఉగ్రవాద నిరోధక నిఘాను సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చాలా ఆలోచించిన తర్వాతనే తాను రాజీనామా నిర్ణ యాన్ని తీసుకున్నట్టు జో కెంట్ ట్రంప్‌నకు రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు. దానిని జో కెంట్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ లేఖలో జో తన రాజీనామా వెనుక గల కారణాలను వివరించారు. ”మీరు (డోనాల్డ్ ట్రంప్) 2016, 2020, 2024లో ప్రచారం చేసిన విలువలు, విదేశాంగ విధానాలకు నేను మద్దతు ఇస్తున్నప్పటికీ, ఇరాన్‌పై సైనిక చర్యను ప్రారంభించాలన్న నిర్ణయంతో నేను విభేదిస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు. ”మనం ఇరాన్‌లో ఏమి చేస్తున్నామో, ఎవరి కోసం చేస్తున్నామో మీరు పరిగణనలోకి తీసుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడిది ధైర్యమైన చర్యలు తీసుకోవాల్సిన సమయం. మీరు గమనాన్ని మార్చి మన దేశానికి ఒక కొత్త మార్గాన్ని చూపొచ్చు.. లేదా మరింత పతనం, గందరగోళంలోకి జారిపోనివ్వవచ్చు. పగ్గాలు మీ చేతుల్లో ఉన్నాయి” అని ఆయన ప్రస్తావించారు.
జో కెంట్ ఎవరు?
గతేడాది జులైలో యూఎస్ సెనెట్‌లో హోరాహోరీగా జరిగిన ఓటింగ్‌లో జో కెంట్ ఈ పదవికి నియమితులయ్యారు. సెనెట్ ఆయన నామినేషన్‌ను 52-44 ఓట్ల తేడాతో ఆమోదించింది.
ఆయన వివాదాస్పద గతం, మితవాద తీవ్రవాద గ్రూపులతో సంబంధాలున్నాయన్న ఆరోపణల కారణంగా కొంతమంది చట్టసభ సభ్యులు ఆయన నియామకాన్ని ప్రశ్నించారు. జో కెంట్.. ట్రంప్ యంత్రాంగంలో చేరకముందు రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. వాషింగ్టన్ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు రెండుసార్లు పోటీ చేశారు. అయితే ఆయన రెండు సార్లూ కూడా విఫలమయ్యారు.
రాజకీయాల్లోకి రాకముందు, ఆయన యూఎస్ సైన్యంలో గ్రీన్ బెరెట్‌గా పనిచేశారు. సైన్యంలో విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో పనిచేశారు. జో కెంట్ రాజీనామా, ఇరాన్ యుద్ధానికి సంబంధించి ట్రంప్ విధానంపై యూఎస్‌లో చర్చను తీవ్రతరం చేసే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నారు.
ఏక్ నిరంజన్
కలిసిరాని మిత్రదేశాలు అమెరికా అధ్యక్షుడిలో నైరాశ్యం
ఎవరి సాయం అవసరం లేదు : ట్రంప్ అసహనం
హార్మూజ్ జలసంధిలో ప్రయాణించే చమురు ట్యాంకర్లకు రక్షణగా నౌకలను పంపాలంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన సూచనకు కీలక భాగస్వామ్య దేశాల నుంచి సానుకూల స్పందన లభించలేదు. దీంతో ట్రంప్ తీవ్ర అసహనానికిగురయ్యారు. వ్యూహా త్మక హార్మూజ్ జలసంధిని స్వాధీనం చేసుకునే విషయంలో తమకు ఎవరి సాయం అవసరం లేదని చెప్పారు. ‘మాకు ఎవరి సాయం అవసరం లేదు. ప్రపంచంలోనే అమెరికా బలమైన దేశం. అపారమైన సైనిక బలగం మా సొంతం’ అని అన్నారు. సంకీర్ణంలో చేరినప్పటికీ నాటో సభ్య దేశాలు అమెరికాకు సాయపడవని నిందించారు. హార్మూజ్ జలసంధిలో యుద్ధ నౌకలను మోహరించాలంటూ ట్రంప్ చేసిన సూచనను జర్మనీ, స్పెయిన్, ఇటలీ సహా పలు అమెరికా మిత్రదేశాలు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. మిత్రదేశాలు.. ముఖ్యం గా ఫ్రాన్స్ స్పందనపై అడిగిన ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ ‘ఫ్రాన్స్ మాకు సాయం చేస్తుందనే అనుకుంటున్నాను. అయినా ఈ విషయంలో అమెరికాకు ఎవరి సాయం అవసరం లేదు’ అని చెప్పారు. అవసరమైన సమయంలో మిత్ర దేశాలు అమెరికాకు బాసటగా నిలుస్తాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలనే ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చానని చెప్పుకొచ్చారు. అవసరం వచ్చినప్పుడు మిత్రులు తమకు మద్దతు ఇవ్వడం లేదని అనేక సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నానని అంటూ ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మిత్రులను సంపాదించుకుంటున్నామని ట్రంప్ వాపోయారు.



