నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్లు, రాష్ట్రపతి ఆమోదం తెలిపేందుకు ఎలాంటి కాలపరిమితి నిర్దేశించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, బిల్లుల ఆమోదంలో గవర్నర్లు అనవసరంగా, అంతులేని జాప్యం చేస్తే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చని, నిర్ణీత సమయంలోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించవచ్చని తేల్చిచెప్పింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన రిఫరెన్స్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం తన అభిప్రాయాన్ని వెల్లడించింది. గవర్నర్ నిర్ణయం తీసుకోకపోతే, కోర్టులే బిల్లుకు ఆమోదం తెలిపినట్లుగా భావించే “డీమ్డ్ అసెంట్” అనే భావన రాజ్యాంగ స్ఫూర్తికి, అధికారాల విభజన సిద్ధాంతానికి విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. ఇది న్యాయవ్యవస్థ కార్యనిర్వాహక విధులను స్వీకరించినట్లే అవుతుందని అభిప్రాయపడింది.
అదే సమయంలో, ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ ఒక బిల్లుకు ఆమోదం నిరాకరిస్తే, దానిని తప్పనిసరిగా అసెంబ్లీకి తిరిగి పంపాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలా చేయకుండా తన వద్దే అట్టిపెట్టుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. గవర్నర్ల విచక్షణాధికారాల వినియోగంపై న్యాయసమీక్ష చేయలేనప్పటికీ, వారు సుదీర్ఘకాలం పాటు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉంటే మాత్రం కోర్టులు జోక్యం చేసుకోవచ్చని తెలిపింది. గవర్నర్లకు కాలపరిమితి విధించడంపై గతంలో తమిళనాడు గవర్నర్ కేసులో ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రాష్ట్రపతి ఈ రిఫరెన్స్ చేశారు. దీనిపై పది రోజుల పాటు విచారణ జరిపిన ధర్మాసనం, ఈ మేరకు స్పష్టతనిచ్చినట్లు లైవ్‌లా తన కథనంలో పేర్కొంది. ఈ తీర్పుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తరచూ తలెత్తుతున్న ఈ వివాదానికి తెరపడినట్లయింది.



