నవతెలంగాణ – హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు 2015లో చేసిన సంతకాలే తెలంగాణ నీటి హక్కులకు మరణశాసనంగా మారాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర జలాల విషయంలో ఏమాత్రం రాజీపడే ప్రసక్తే లేదని, తెలంగాణ హక్కుల సాధన కోసం రాజకీయంగా, సాంకేతికంగా, న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ప్రజాభవన్‌లో ‘గోదావరి-బనకచర్ల’ అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “పదేళ్ల పాటు నీటిపారుదల శాఖను కేసీఆర్, హరీశ్ రావులే చూశారు. వారే రాష్ట్ర నీటి హక్కులను కాపాడతారని ప్రజలంతా భావించారు. కానీ దురదృష్టవశాత్తు వారి నిర్ణయాల వల్లే తెలంగాణకు తీరని నష్టం జరిగింది” అని ఆయన అన్నారు.
కృష్ణా జలాల్లో మొత్తం 811 టీఎంసీలకు గాను తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు చాలని, మిగిలిన 68 శాతం నీటిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని 2015లో వారే సంతకాలు చేశారని రేవంత్ ఆరోపించారు.
కృష్ణా నది పరివాహక ప్రాంతం ప్రకారం చూస్తే వాస్తవానికి తెలంగాణకే ఎక్కువ నీటి వాటా దక్కాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన ప్రాజెక్టులను గత పదేళ్లలో పట్టించుకోకపోవడం వల్లే రాష్ట్రానికి కేటాయించిన 299 టీఎంసీల నీటిని కూడా పూర్తిగా వాడుకోలేని దయనీయ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తమ ప్రాజెక్టులను పూర్తిచేసుకొని నీటిని తరలించుకుపోతోందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, నీటి హక్కుల పరిరక్షణలో వెనకడుగు వేసేది లేదని ఆయన తేల్చిచెప్పారు.